చైనీస్ టెక్ దిగ్గజం షియోమీ 'టైప్-సీ 65డబ్ల్యూ' యూనివర్సల్ ఫాస్ట్ ఛార్జర్‌ను చైనాలో విడుదల చేసింది. దీని ద్వారా స్మార్ట్ఫోన్లను మాత్రమే కాకుండా, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, నింటెండో స్విచ్, యూఎస్బీ టైప్-సీ పోర్టుకు మద్దతిచ్చే ఇతర గేమింగ్ పరికరాలను కూడా ఛార్జ్ చేయవచ్చు.
అందరికీ మద్దతిస్తా!
అంతేకాకుండా ఐఫోన్ 11 సిరీస్, 2016 తరువాత విడుదలైన ఆపిల్ మాక్‌బుక్ ప్రో 15 కూడా ఈ ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించవచ్చని షియోమీ తెలిపింది.
షియోమీ టైప్-సీ 65డబ్ల్యూ యూనివర్సల్ ఛార్జర్... 13 అంగుళాల మాక్‌బుక్ ప్రోను ఒక గంట 50 నిమిషాల్లో, 15 అంగుళాల ఎమ్ఐ నోట్‌బుక్ ప్రోను 2 గంటల 25 నిమిషాల్లో ఛార్జ్ చేస్తుంది. ఐఫోన్ 11 - ఒక గంట 50 నిమిషాల్లో, రెడ్మీ కే20 ప్రో - ఒక గంట 40 నిమిషాల్ల ఛార్జ్ అవుతాయి. ఇది ఆసుస్, డెల్, హెచ్‌పీ, లెనోవా, రేజర్, శామ్సంగ్ లాంటి బ్రాడ్ల నోట్బుక్లకూ సపోర్ట్ చేస్తుందని సంస్థ స్పష్టం చేసింది.
చాలా కాంపాక్ట్‌గా
షియోమీ టైప్-సీ పవర్ అడాప్టర్ 65 డబ్ల్యూని చైనాలో ప్రారంభించింది. ఇది ఒకే యూనివర్సల్ టైప్-సీ పోర్టుతో వస్తుంది. ఇది మునుపటి ఫాస్ట్ ఛార్జర్ల కంటే పరిమాణంలో 27 శాతం చిన్నగా చాలా కాంపాక్ట్‌గా ఉంటుందని సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఇది చైనాలోని అధికారిక ఎమ్ఐ ఆన్లైన్ స్టోర్‌లో లభిస్తుంది. దీని ధర 129 సీఎన్‌వై (సుమారు రూ.1,300) ఉంది.
షియోమీ ఈ ఫాస్ట్ ఛార్జర్‌తో పాటు యూఎస్బీ ఛార్జర్ 65 ఫాస్ట్‌ఛార్జ్ వెర్షన్ (2ఏ1సీ)ని అందిస్తోంది. ఇందులో 2 యూఎస్బీ టైప్-ఏ పోర్టులు, ఒకేసారి పలు పరికరాలు ఛార్జ్ చేయడానికి యూఎస్బీ టైప్-సీ పోర్టు ఉన్నాయి.
కచ్చితత్వంతో..
ఈ ఫాస్ట్ ఛార్జర్ మంచి తెల్లని రంగులో ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత నుంచి తట్టుకునే, అగ్ని నిరోధకత సామర్థ్యం దీనికి ఉంది. షియోమీ అడాప్టర్‌లో అధిక కచ్చితత్వ నిరోధక కెపాసిటర్ సెన్సార్ ఉంది. ఇది వేర్వేరు పరికరాలకు అనుగుణంగా ఛార్జింగ్ చేస్తుంది. దెబ్బతినే ప్రమాదం లేకుండా వేర్వేరు పరికరాలను సరైన వేగంతో ఛార్జ్ చేస్తుంది. షియోమీ త్వరలో 100 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్ తీసుకురావాలని చూస్తోంది.
ఇదీ చూడండి:ఆటో ఎక్స్పో 2020: కళ్లు చెదిరే కార్లు.. అదిరే మోడళ్లు