Work from office india: కొవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఐటీ కంపెనీలు కార్యాలయాల నుంచి పనులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయని తమ సర్వేలో తేలినట్లు హైసియా (హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్) వెల్లడించింది.
వర్క్‌ఫ్రం ఆఫీస్‌కు ఐటీ కంపెనీల సంసిద్ధత.. - IT companies work from office latest news
Work from office india: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గిన క్రమంలో ఐటీ కంపెనీలు కార్యాలయాల నుంచి పనులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయని హైసియా సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో దాదాపు 68 ఐటీ కంపెనీలు పాల్గొన్నాయని, స్థానిక ఐటీ పరిశ్రమలో ఈ కంపెనీల వాటా 30 శాతమని హైసియా పేర్కొంది.
వర్క్‌ఫ్రం ఆఫీస్‌కు ఐటీ కంపెనీల సంసిద్ధత..
హైదరాబాద్‌లోని ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల్లో సగానికి పైగా సంస్థలు తమ సిబ్బంది ఆఫీసు నుంచి పనిచేసేందుకు వీలుకల్పిస్తున్నాయని వివరించింది. ఈ సర్వేలో దాదాపు 68 ఐటీ కంపెనీలు పాల్గొన్నాయని, స్థానిక ఐటీ పరిశ్రమలో ఈ కంపెనీల వాటా 30 శాతమని హైసియా పేర్కొంది.
- దాదాపు 56 శాతం ఐటీ కంపెనీలు తమ కార్యాలయాలను పూర్తిగా ప్రారంభించాయి. ఈ కంపెనీల సిబ్బంది ఆఫీసు నుంచి పని చేయవచ్చు. 28 శాతం ఐటీ కంపెనీలు మాత్రం ఇంకా పరిమితంగానే, కార్యాలయాల నుంచి పని చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
-
హైబ్రిడ్ పని విధానానికి (కొన్ని రోజులు ఇంటి నుంచి, మరికొన్ని రోజుల ఆఫీసు నుంచి పనిచేయటం) 65 శాతం కంపెనీలు అనుకూలంగా ఉన్నాయి. అన్ని రోజులు సిబ్బంది ఆఫీసుకు వచ్చి పనిచేయాలని 15 శాతం కంపెనీలు కోరుకుంటున్నాయి. -
పాఠశాలలు పూర్తిస్థాయిలో తెరచుకుని పిల్లలు వెళ్లాల్సి వస్తే, అప్పుడు ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు తమ సొంత ఊళ్ల నుంచి హైదరాబాద్ రావడంతో పాటు ఆఫీసుకు వెళ్లి పనిచేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. -
జాతీయ/ అంతర్జాతీయ కంపెనీలకు చెందిన స్థానిక ఐటీ కేంద్రాల్లో, ఆయా సంస్థల అత్యున్నత యాజమాన్యాల నిర్ణయాల ప్రకారం 'కార్యాలయాల నుంచి పని' విధానం ఆధారపడి ఉంటుంది. మిగిలిన కంపెనీలకు సంబంధించి స్థానిక నాయకత్వమే అమలు చేయొచ్చు. -
కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సిందిగా ఎక్కువ శాతం ఐటీ కంపెనీలు ఇప్పటికే సిబ్బందికి సూచిస్తున్నాయి. మరికొన్ని ఐటీ కంపెనీలు ఆఫీసుకు రావాలని సిబ్బందిని సమీప భవిష్యత్తులో కోరే అవకాశం ఉంది. -
ఉత్పాదకతను దృష్టిలో పెట్టుకుని సిబ్బంది ఆఫీసుకు వచ్చి పనిచేయాలని తాము భావిస్తున్నట్లు 45 శాతం కంపెనీలు స్పష్టం చేశాయి. క్లయింట్లు అవసరాలు, వ్యాపార సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటే సిబ్బంది ఆఫీసు నుంచి పనిచేయాల్సి వస్తోందని 22 శాతం కంపెనీలు వివరించాయి. సిబ్బందిలో చొరవ లేకపోవడం, పరస్పర భాగస్వామ్యం, అనుబంధం తగ్గిపోవడం, సంబంధిత ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని సిబ్బంది కార్యాలయాలకు వస్తే బాగుంటుందని భావిస్తున్నట్లు 33% కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు. -
మూన్‌లైటింగ్ (ఒకేసారి రెండు మూడు ఉద్యోగాలు చేయటం) అనేది సమస్యే కాదని 78 శాతం ఐటీ కంపెనీలు స్పష్టం చేశాయి.