ఐటీ రంగంలో 'వర్క్ ఫ్రమ్ హోమ్' (ఇంటి నుంచే పని) పద్ధతి భవిష్యత్తులోనూ కొనసాగుతుందని, ఈ పద్ధతిలో సత్ఫలితాలు సాధించవచ్చని కొవిడ్-19 'లాక్‌డౌన్'తో అనుభవంలోకి వచ్చిందని పెగా సిస్టమ్స్ ఇండియా ఎండీ సుమన్‌రెడ్డి పేర్కొన్నారు. కొవిడ్-19 వల్ల బాగా కుంగిపోయిన రిటైల్, ఆతిధ్యం, విమానయానం... వంటి కొన్ని రంగాల నుంచి గతంలో మాదిరిగా ఐటీ ప్రాజెక్టులు రాకపోవచ్చని, ఈ రంగాలు కోలుకోవటానికి ఎక్కువ సమయం పట్టవచ్చని పేర్కొన్నారు. అంతేగాక ఐటీ రంగం పెను మార్పులకు లోనవుతోందని, గతానికి భిన్నమైన పద్ధతుల్లో కార్యకలాపాలు నిర్వహించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. ఐటీ రంగంపై కొవిడ్-19, 'లాక్‌డౌన్' ప్రభావం, దానికి ఏవిధంగా ఐటీ కంపెనీలు సన్నద్ధం అవుతున్నాయనే... అంశాలను ఆయన 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. విశేషాలు....
- ఐటీపై కొవిడ్-19 ప్రభావం ఎలా ఉంది ?
ఇతర రంగాలతో పోలిస్తే ఐటీ రంగం కొంత ఫర్వాలేదు. ఎయిర్‌లైన్స్, రిటైల్, ఆతిధ్యం... తదితర రంగాలు ఎంతగానో నష్టపోయిన విషయం తెలుస్తూనే ఉంది. 'వర్క్ ఫ్రమ్ హోమ్' వంటి అవకాశాల వల్ల ఐటీ కార్యకలాపాలు కొనసాగించే వీలు కలిగింది. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేస్తున్న ఫలితంగా ఐటీ రంగానికి కొన్ని సవాళ్లు కనిపిస్తున్న మాట వాస్తవం. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని విభాగాలకు చెందిన వ్యాపార సంస్థలు వ్యయాల తగ్గింపుపై దృష్టి సారిస్తాయి.
- 'కరోనా' వ్యాప్తి, 'లాక్‌డౌన్' వంటి పరిస్థితుల్లో మీ కార్యకలాపాలు ఎలా కొనసాగాయి ?
వ్యాపార కార్యకలాపాల కొనసాగింపు, సిబ్బంది ఆరోగ్యంపై మేం ప్రధానంగా దృష్టి సారించాం. సిబ్బందికి స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించి పనివేళల్లో వెసులుబాటు కల్పించాం. దీనివల్ల మా ప్రాజెక్టులు ఆగలేదు. పైగా ఈ 'లాక్‌డౌన్'లో మా సిబ్బంది ఉత్పాదకత పెరిగింది. సిబ్బంది అన్ని వేళల్లో అందుబాటులో ఉంటూ ప్రాజెక్టులు పూర్తిచేశారు.
- 'వర్క్ ఫ్రమ్ హోమ్' విధానంలో ఎంత పని కేటాయిస్తున్నారు..., ఎంత పని ఆఫీసులో చేస్తున్నారు ?
మార్చి నెల మధ్య నుంచి నూరు శాతం పని 'వర్క్ ఫ్రమ్ హోమ్' పద్ధతిలో నిర్వహిస్తున్నాం. సిబ్బందికి అవసరమైన ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ సిస్టమ్స్, ఇతర ఉపకరణాలను సిబ్బంది ఇళ్లకే పంపించాం. పూర్తిస్థాయిలో కృత్రిమ పని వాతావరణాన్ని సృష్టించాం. ఈ విధానంలో సత్ఫలితాలు సాధించటానికి తరచు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం.
- ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో 'సెంటిమెంటు' ఎలా ఉంది. ఈ సంక్షోభాన్ని గట్టెక్కి ముందుకు సాగగలమనే నమ్మకం కనిపిస్తోందా ?