Work from Home: ఐటీ ఉద్యోగులు మళ్లీ పూర్తి స్థాయిలో ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రమ్ హోమ్) పద్ధతికి మారిపోతున్నారు. కొవిడ్ రెండో దశ కేసులు తగ్గాక, కార్యాలయాలకు కొద్దిమంది ఐటీ ఉద్యోగులు వస్తున్నారు. కొవిడ్ 'ఒమిక్రాన్' ముప్పు పెరుగుతున్నందున వీరినీ ఇంటి నుంచే పనిచేయాలని సంబంధిత సంస్థల యాజమాన్యాలు సూచిస్తున్నాయి. సోమవారం నుంచే కొన్ని ఐటీ కంపెనీల ఉద్యోగులు పూర్తిగా ఇంటి నుంచే పనిచేయటం ప్రారంభించగా, బుధవారం నుంచి మరికొన్ని సంస్థలు కూడా తమ ఉద్యోగులకు ఇదే విధంగా సూచించినట్లు స్థానిక ఐటీ పరిశ్రమ వర్గాలు వివరించాయి. 'ఒమిక్రాన్' ముప్పు ఇంకా పెరిగితే ఇంకేం జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం పైనా కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. ఈ పరిస్థితులను ఎదుర్కోవడంలో కంపెనీలు, సిబ్బందికి ఏడాదిన్నర అనుభవం ఉంది. ఐటీ ప్రాజెక్టులను యథావిధిగా కొనసాగించేందుకు, ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేందుకు అనువైన సాంకేతిక ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నందున, కార్యకలాపాలకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.
కరోనా 'డెల్టా' కేసుల తీవ్రత గత ఏడాది ఆగస్టు నాటికి తగ్గడంతో నెమ్మదిగా అన్ని రకాల కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. దీంతో ఐటీ కార్యాలయాలకు కొందరు సిబ్బందిని పిలిపించడం మొదలైంది. అక్టోబరు నాటికి మొత్తం ఐటీ ఉద్యోగుల్లో 15- 20 శాతం మంది కార్యాలయాలకు వచ్చి పనిచేయటం కనిపించింది. నెమ్మదిగా ఈ సంఖ్య పెరుగుతుందని, త్వరలో అత్యధిక ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేస్తారని భావించారు. విదేశాల నుంచి క్లయింట్లు ఇక్కడి ఐటీ కంపెనీలను సందర్శించడం, స్ధానిక ఐటీ కంపెనీల ప్రతినిధులు వివిధ దేశాల్లోని తమ క్లయింట్లను కలిసి 'ప్రెజెంటేషను' ఇవ్వడం వంటివీ చోటుచేసుకున్నాయి. కానీ నవంబరు నెలాఖరు నుంచి 'ఒమిక్రాన్' ముప్పు పెరుగుతూ రావడంతో, ఇంకొంతకాలం పాటు 'ఇంటి నుంచి పనే' క్షేమకరమని కంపెనీలు భావిస్తున్నాయి. 'కార్యాలయానికి రావొద్దంటూ, ఆయా సంస్థల యాజమాన్యాల నుంచి సూచనలు రావడంతో, కార్యాలయాలకు వచ్చే ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోంద’ని స్థానిక ఐటీ కంపెనీ ఉన్నతోద్యోగి ఒకరు వివరించారు.