ఐటీ రంగంలో(IT Sector) ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. కరోనా పరిణామాల(Coronavirus) ఫలితంగా అన్ని రంగాల్లో డిజిటలీకరణ పెరగడంతో, ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకనుగుణంగా కంపెనీలు పెద్దఎత్తున నియామకాలు చేపడుతున్నాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఇటీవల కాలంలో ఐటీ ఉద్యోగ నియామకాల్లో (IT Job Vacancy) మహిళల సంఖ్య అధికంగా ఉండటం. దాదాపు 50 శాతానికి పైగా మహిళా ఉద్యోగులు ఉంటున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది మొదటి 6 నెలల్లో దేశంలోని 10 అగ్రగామి ఐటీ కంపెనీలు 1.21 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాయి. గత అయిదేళ్లలో ఇంత పెద్ద సంఖ్యలో ఐటీ నియామకాలు జరగడం ఇదే మొదటిసారి.
గత కొన్నాళ్లుగా కృత్రిమ మేధ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, డేటా మైనింగ్, క్లౌడ్.. విభాగాల్లో ఐటీ కంపెనీలకు(IT Companies) భారీ ప్రాజెక్టులు లభిస్తున్నాయి. వీటిని దక్కించుకుంటున్న కంపెనీలకు పెద్దఎత్తున ఐటీ నిపుణులు కావలసి వస్తోంది. భారీ సంఖ్యలో నియామకాలు జరగడానికి ఇదే ప్రధాన కారణం. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో (టీసీఎస్) ఉద్యోగులు సంఖ్య 5 లక్షలకు చేరగా, ఈ సంఖ్య 10 లక్షలకు చేరడానికి ఎన్నో ఏళ్లు పట్టదని ఐటీ వర్గాలు వివరిస్తున్నాయి. దీని ప్రకారం చూస్తే.. ఐటీ ఉద్యోగాలు ఏస్థాయిలో పెరుగుతోందీ స్పష్టమవుతోంది.
ఈ నైపుణ్యాలు ఉంటే..
అన్ని రకాల ఐటీ ఉద్యోగాలు(IT Jobs) లభిస్తున్నా, కొన్ని విభాగాలకు మరింత గిరాకీ కనిపిస్తోంది. డేటా సైంటిస్ట్, సైబర్ సెక్యూరిటీ ప్రొపెషనల్, క్లౌడ్ ఆర్కిటెక్ట్, ఏఐ ఎక్స్‌పర్ట్ ఉద్యోగాలు ఎక్కువగా ఉండగా, వీరికి జీతభత్యాలు కూడా అధికంగా ఉండటం గమనార్హం. నెలకు రూ.1.20 లక్షల వేతనం లభించే అవకాశం ఉంది. అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో ఒకటైన యాక్సెంచర్ ఇటీవల కాలంలో క్లౌడ్, బిగ్ డేటా, నెట్‌వర్క్ సెక్యూరిటీ విభాగాల్లో పెద్దఎత్తున నియామకాలు చేపడుతోంది. కొన్ని ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలో సాగుతున్నాయి.
వెంటనే ప్రాంగణ కొలువులు
వచ్చే ఏడాది బీటెక్ పూర్తి చేసే విద్యార్థులకు ఐటీ కంపెనీలు ఇప్పుడే ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నాయి. నియామకాల కోసం గతంలో కళాశాలలకు ఐటీ కంపెనీల ప్రతినిధులు వెళ్లేవారు. కొవిడ్ వల్ల అంతా 'ఆన్‌లైన్' కావడంతో, ఎక్కడి నుంచి అయినా నియామకాలు చేపట్టే అవకాశం వచ్చింది. చేతినిండా ప్రాజెక్టులు ఉండటంతో ఐటీ కంపెనీలు ప్రాంగణ (క్యాంపస్) నియామకాలు మొదలు పెట్టేశాయి. గతంలో బీటెక్ పూర్తయ్యాక ఉద్యోగంలో చేరడానికి ఆరేడు నెలలు ఎదురు చూడాల్సి వచ్చేది. ఆఫర్ లెటర్ ఇచ్చినా, కంపెనీలు వెంటనే నియామక పత్రం అందించేవి కాదు. కొన్ని కంపెనీలు ఏడాది వరకు స్పందించేవి కాదు. ఎదురుచూపులు భరించలేని కొందరు విద్యార్థులు ఇతర ఉద్యోగాలకు, ఉన్నత చదువులకు వెళ్లిపోయేవారు. కానీ ఇప్పుడలా లేదు. డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగానికి ఐటీ కంపెనీలు పిలుస్తున్నాయి.
52 శాతం మహిళా ఉద్యోగులు
ఐటీ రంగంలో మహిళలు అధిక సంఖ్యలో ఉండటం కొత్త విషయం కాదు. కానీ మహిళల శాతం బాగా పెరగడమే తాజా ప్రత్యేకత. హైదరాబాద్‌లో చూస్తే... ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో దాదాపు 7 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఏటా కొత్త నియామకాలు 50,000 పైగానే ఉంటాయి. ఈ ఉద్యోగాలకు మహిళలు అధికంగా ఎంపికవుతున్నారు. 5-7 ఏళ్ల ఉద్యోగ అనుభవం గల వారిలో మహిళల సంఖ్య 52 శాతం ఉన్నట్లు పరిశ్రమ వర్గాల అంచనా. హెచ్‌ఆర్ సేవలు, బీపీఓ, కాల్ సెంటర్ ఉద్యోగాల్లో మహిళా ఉద్యోగులు ఇంకా అధిక సంఖ్యలో ఉంటున్నారు. ఉద్యోగంలో చేరిన అయిదారేళ్ల తర్వాత మహిళలు వివిధ కారణాలతో రాజీనామా చేయడం ఇటీవల వరకూ కనిపించేదని, ఇప్పుడు ఆ పరిస్థితీ మారుతోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
'ఇంటి నుంచి పని' విధానంలో, మహిళా ఉద్యోగులు ఎంత కాలమైనా ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని ఇవ్వడానికి కంపెనీలు సిద్ధపడుతున్నాయి.'ఫ్లెక్సిబుల్ టైమింగ్స్'ను కూడా అనుమతిస్తున్నాయి. దీంతో కార్యాలయానికి రాలేక, లేదా కుటుంబంతో వేరే నగరానికి తరలివెళ్లడం.. వంటి కారణాలతో ఉద్యోగాన్ని వదులుకోవాల్సిన అవసరం మహిళలకు ఉండటం లేదు. అందువల్ల మొత్తం ఐటీ ఉద్యోగుల్లో మహిళల సంఖ్యతో పాటు, వీరి సీనియార్టీ కూడా పెరుగుతోందని జాబ్ కన్సల్టెంగ్ సేవల సంస్థ హ్యూసిస్ ఎండీ జీఆర్ రెడ్డి వివరించారు. ఇప్పటివరకు సీనియార్టీ ఉన్న మహిళా ఉద్యోగులు తక్కువగా ఉండటంతో, ఐటీ రంగంలో ఉన్నత స్థానాల్లో వారి సంఖ్య పరిమితంగా ఉంది. వైస్‌ప్రెసిడెంట్లు, సీనియర్ వైస్‌ప్రెసిడెంట్లు, సీటీఓ.. తదితర ఉన్నతోద్యోగాల స్థాయికి మహిళలు చేరుకోవడం తక్కువ. ప్రస్తుత మార్పుల వల్ల సమీప భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు మహిళలు చేరుకునే అవకాశాలు ఏర్పడినట్లు ఐటీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి:సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇవి తెలుసుకోండి...