తెలంగాణ

telangana

ETV Bharat / business

జన్‌ధన్‌ ఖాతాల్లో 55శాతం వారివే..! - జన్‌ధన్‌ యోజన బ్యాంకు ఖాతాలు

జన్‌ధన్‌ యోజన కింద తెరిచిన బ్యాంకు ఖాతాల్లో సగానికిపైగా మహిళలవే ఉన్నట్లు కేంద్రం తెలిపింది. 2020, సెప్టెంబర్‌ 9 నాటికి దేశవ్యాప్తంగా పీఎం జన్‌ధన్‌ యోజన కింద 40.63కోట్ల బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. వీటిలో 22.44కోట్ల ఖాతాలు మహిళలవే కాగా మరో 18.19కోట్ల ఖాతాలు పురుషులవి ఉన్నాయి.

Women beneficiaries comprise maximum number of a/c holders under PMJDY at 55pc
జన్‌ధన్‌ ఖాతాల్లో 55శాతం వారివే..!

By

Published : Oct 18, 2020, 10:39 PM IST

ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన (పీఎంజేడీవై)లో భాగంగా తెరిచిన బ్యాంకు ఖాతాల్లో సగానికిపైగా మహిళా లబ్దిదారులే ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం ఖాతాల్లో 55శాతం మహిళలవే ఉన్నట్లు తెలిపింది. సెప్టెంబర్‌ 9, 2020 నాటికి దేశవ్యాప్తంగా పీఎం జన్‌ధన్‌ యోజన కింద 40.63కోట్ల బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. వీటిలో 22.44కోట్ల ఖాతాలు మహిళలవే కాగా మరో 18.19కోట్ల ఖాతాలు పురుషులవి ఉన్నాయి. సమాచార హక్కు చట్టం కింద మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్త కోరగా ప్రభుత్వం ఈ విషయాలను వెల్లడించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ నెలలో వీటి డిపాజిట్ల మొత్తం 8.5శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. జన్‌ధన్‌ యోజన కింద ఏప్రిల్‌ 1, 2020 నాటికి రూ.లక్షా 19వేల కోట్ల (1,19,680) నగదు ఉండగా ప్రస్తుతం అవి రూ.లక్షా 30వేల కోట్లకు పెరిగినట్లు తెలిపింది. అయితే, పురుషులు, మహిళల ఖాతాల్లో ఉన్న డిపాజిట్ల మొత్తం విలువకు సంబంధించిన వేర్వేరు సమాచారం మాత్రం అందుబాటులో లేదని స్పష్టం చేసింది. మొత్తం ఖాతాల్లో దాదాపు 3కోట్ల అకౌంట్లలో నగదు లేనివని (జీరో బ్యాలెన్స్‌) ప్రభుత్వం పేర్కొంది.

మొత్తం ఖాతాల్లో జాతీయ బ్యాంకుల్లోనే 32.48కోట్ల జన్‌ధన్‌ అకౌంట్లున్నాయి. వీటిలో మొత్తం రూ.లక్షకోట్ల (1,00,869) నగదు ఉంది. రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో 7.24కోట్ల ఖాతాలు ఉండగా, వీటిలో రూ.25వేల కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. ఇక ప్రైవేటు బ్యాంకుల్లో 1.27కోట్ల ఖాతాలుంటే వీటిలో కేవలం రూ.4వేల కోట్ల నగదు మాత్రమే ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details