కరోనా.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఈ మహమ్మారి గురించే.. ప్రపంచమంతా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని సృష్టించిన ఈ వైరస్‌కన్నా ముందు అనేక కొత్త కొత్త వ్యాధులు మనల్ని చుట్టుముట్టాయి. వాటన్నింటికీ చికిత్స దొరికేదాకా ఆందోళన చెందాం. ఒకదాని తర్వాత ఒకటిగా వైరస్‌లు వస్తూనే ఉంటున్నాయి... వాటికి వైద్య శాస్త్రం సరైన పరిష్కారం కోసం వెతుకుతూనే ఉంటుంది. కానీ, దురదృష్టవశాత్తూ.. వీటి బారిన పడితే... చికిత్స కోసం ఆర్థికంగా సిద్ధంగా ఉన్నామా లేదా అనేదే పెద్ద చిక్కు ప్రశ్న. ఇప్పటికే మనం తీసుకున్న ఆరోగ్య బీమా.. ఈ కొత్త చికిత్సలకు వర్తిస్తుందా? ఇప్పుడు సందేహించే బదులు.. బీమా తీసుకునేటప్పుడే ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాలసీ పరిహారం ఇస్తుందా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
వైద్య ఖర్చులు ఎప్పటకప్పుడు పెరిగిపోతున్న నేపథ్యంలో.. సంపూర్ణ ఆరోగ్య బీమా పాలసీకి ప్రాధాన్యం పెరుగుతోంది. అనుకోని అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే దాచుకున్న డబ్బులన్నీ ధారపోయాల్సిన పరిస్థితి. ఆరోగ్య బీమా పాలసీ ప్రాధాన్యం గురించి తెలుసుకోవడం మాత్రమే సరిపోదిప్పుడు. మన ప్రతి అవసరంలోనూ అది ఆదుకుంటుందా లేదా అనేదీ చూసుకోవాలి. ఇప్పటికీ కరోనాలాంటి వైరస్‌లు వచ్చినప్పుడు అనేక పాలసీలు దానికి పరిహారం లభించదు అన్నట్లుగానే ఉంటున్నాయి. వీటన్నింటినీ మనం మరోసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అనారోగ్యం ఏదైనా సరే.. పాలసీ ఉందంటే రక్షణ ఉండాలి అనే ధీమా కల్పించే వాటినే మనం ఎంచుకోవాలి.
బృంద బీమా ఉన్నా..
మనకు ఏం కావాలి? ఎలాంటి అవసరాలు ఉంటాయి? ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు ప్రాథమికంగా సమాధానం తెలుసుకోవాల్సిన ప్రశ్నలివే. ఇప్పటికే ఉన్న వ్యాధులు, కొత్తగా ముంచుకొచ్చే వైరస్‌లు.. అన్నింటికీ ఇది పరిహారం అందించేలా ఉండాలి. చాలామంది తమ యాజమాన్యాలు అందించే బృంద ఆరోగ్య బీమా పాలసీలపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. కానీ, ఇది సరిపోతుందా? అనేది పెద్ద ప్రశ్నే. బృంద ఆరోగ్య బీమా పాలసీ ఉన్నప్పటికీ సొంతంగా ఒక ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం అవసరం. కనీసం సూపర్ టాపప్ పాలసీనైనా ఎంచుకోవాలి. సరైన మొత్తానికి పాలసీ లేకపోతే.. తర్వాత ఇబ్బంది పడాల్సింది మనమేనని గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీకు పాలసీ ఎంపికలో అనుమానాలుంటే.. మీ బీమా సలహాదారుడు లేదా బీమా కంపెనీ వినియోగదారుల సహాయ కేంద్రాన్ని సంప్రదించండి. అవసరానికి ఆదుకునేలా పాలసీ తీసుకోవడమే మన లక్ష్యం కావాలి.
నిబంధనలు తెలుసుకోండి..
వేటికి పరిహారం వర్తిస్తుంది.. వేటికి వర్తించదు అనే నిబంధనలు ఆరోగ్య బీమా పాలసీలో సహజంగానే ఉంటాయి. కొన్నింటికి వేచి ఉండే కాలం ఉంటుంది. ముందస్తు వ్యాధుల విషయంలో పూర్తిగా మినహాయింపు అని చెబుతుంటాయి. గదుల అద్దె, శస్త్ర చికిత్సల విషయంలోనూ, ఓపీడీలాంటి వాటికి పరిమితులు, ఉప పరిమితులు ఉంటాయి. మీరు పాలసీ తీసుకునేటప్పుడు ఈ నిబంధనలన్నీ స్పష్టంగా తెలుసుకోండి. వీటి గురించి అవగాహన లేకపోతే.. పాలసీని క్లెయిం చేసుకునే సందర్భంలో మన జేబుపై భారం పడుతుంది. ఆసుపత్రిలో చేరినప్పుడు.. కొర్రీలు పెట్టకుండా.. అన్నింటికీ పరిహారం ఇచ్చే పాలసీకే ప్రాధాన్యం ఇవ్వండి. ముఖ్యంగా కరోనాలాంటి అనుకోని వ్యాధులు వచ్చినా.. కొత్త పాలసీ తీసుకోవాల్సిన అవసరం లేకుండా.. ఉన్న పాలసీనే దానికి రక్షణ కల్పించాలి.
వీటితో పాటు..
కొన్ని పాలసీలు.. ఉచిత ఆరోగ్య పరీక్షలకు అనుమతినిస్తాయి. ఏటా ఈ పరీక్షలు చేయించుకోవడం వల్ల మన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసుకునేందుకు వీలవుతుంది. మీరు తీసుకున్న పాలసీలో ఇది ఉందా లేదా తెలుసుకోండి. ఉంటే.. ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి.