తెలంగాణ

telangana

ETV Bharat / business

వడ్డీ రేట్ల పెంపు ఖాయమా? నిపుణుల మాటేంటి? - ఆర్​బీఐ కీలక వడ్డీ రేట్ల పెంపు

RBI mpc meeting: ప్రపంచవ్యాప్తంగా ఉండే వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులన్నీ కీలక వడ్డీరేట్లను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్​ కూడా అదే బాటలో పయనిస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

rbi
ఆర్​బీఐ

By

Published : Feb 7, 2022, 1:11 PM IST

RBI mpc meeting: మదుపర్లు, ఆర్థికవేత్తల చూపంతా ఇప్పుడు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్​బీఐ) పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంపైనే ఉంది. ఈ కమిటీ భేటీ 8న ప్రారంభం కానుంది. 10న నిర్ణయాలు ప్రకటించనుంది. ఈ సమావేశం సోమవారం జరగాల్సి ఉండగా.. లతా మంగేష్కర్​ మృతి సంతాపంగా మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. దీంతో ఎంపీసీ మీటింగ్ మంగళవారానికి వాయిదా పడింది. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్‌ బ్యాంకులన్నీ కీలక వడ్డీరేట్లు పెంచే పనిలో పడ్డాయి. మన ఆర్‌బీఐ సైతం అదే బాటలో పయనిస్తుందా? లేక దేశీయ పరిస్థితులకు అనుగుణంగా భిన్నమైన నిర్ణయం తీసుకుంటుందా? అనే విషయాన్ని పరిశీలించాల్సి ఉంది.

ఇదే విషయంపై ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వే ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. కీలక రేట్లను మరికొన్ని నెలల పాటు యథాతథంగా కొనసాగించొచ్చనన్నది ఆ సర్వే సారాంశం. కరోనా సంక్షోభం నుంచి కోలుకుంటున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఒమిక్రాన్‌ రూపంలో కాస్త బ్రేకులు పడిన విషయం తెలిసిందే. అయినప్పటికీ.. వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు మరీ దిగజారిన పరిస్థితులైతే లేవని నిపుణులు చెబుతున్నారు. అయితే, కొవిడ్‌ మూడో దశ వ్యాప్తి కొనసాగుతున్నందున ఇప్పుడప్పుడే వైఖరిని సమూలంగా మార్చే అవకాశం మాత్రం లేదని పేర్కొన్నారు. ఇక ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ద్రవ్యోల్బణం కాస్త అదుపులోనే ఉందని చెప్పొచ్చు! అదే సమయంలో ముడి చమురు ధరలు పెరుగుతుండడం కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో రేట్ల పెంపునకు ఆర్‌బీఐకి మరికొంత సమయం అందుబాటులో ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్‌లో భారీ ఉద్దీపనలేవీ ప్రకటించని కారణంగా ఇప్పుడే రేట్లను పెంచడం వల్ల స్టాక్‌ మార్కెట్లు భారీ కుదుపునకు లోనయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఫిబ్రవరిలో కాకుండా.. ఏప్రిల్‌ లేదా జూన్‌ వరకు ఆర్‌బీఐ రేట్ల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ అయిన ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్లను పెంచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అగ్రరాజ్యంలో ద్రవ్యోల్బణం 1982 నాటి గరిష్ఠానికి చేరుకుంది. దీంతో అక్కడ రేట్ల పెంపు అనివార్యమైంది. మరోవైపు బ్రెజిల్‌ వంటి వర్ధమాన దేశాలు సైతం ఇప్పటికే రేట్ల పెంపునకు శ్రీకారం చుట్టాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ తన వైఖరిని సర్దుబాటు నుంచి తటస్థం వైపైనా మార్చాలని మరికొంత మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో గత రెండేళ్లుగా రెపో రేటును ఆర్‌బీఐ 4 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

ఇదీ చూడండి:'జీఎస్‌టీ పరిధిలోకి విమాన ఇంధనంపై మండలిదే తుది నిర్ణయం'

ABOUT THE AUTHOR

...view details