చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎస్ఎంఈ)లపై ఆర్బీఐ గతవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రామాణిక వర్గీకరణ కింద ఉన్న ఖాతాల వన్‌టైం రుణ పునర్నిర్మాణానికి అనుమతిస్తూ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో నిర్ణయించింది. 2021 మార్చి వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు.
ఇది అమలు చేయగలిగితే కరోనా సంక్షోభంతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఎస్ఎంఈలకు ఊరట కలుగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రుణ పునర్నిర్మాణ ప్రక్రియ అంత సులభంగా అమలు చేయలేమని ప్రముఖ బ్యాంకింగ్ రంగ నిపుణుడు జస్పాల్ బింద్రా అభిప్రాయపడ్డారు.
రుణ పునర్నిర్మాణం సాధ్యమేనా?
అయితే మారటోరియం కాకుండా వన్‌టైం సెటిల్మెంట్, పునర్నిర్మాణాన్నే చాలా మంది కోరుకుంటున్నారని సెంట్రమ్ గ్రూప్ ఛైర్మన్ జస్పాల్ బింద్రా చెబుతున్నారు. కానీ, ప్రస్తుత కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్బీఐ ఆమోదించిన వన్‌టైం పునర్నిర్మాణ పథకం అమలుకు సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు.
"పునర్నిర్మాణ ప్రక్రియను ఒక్కరోజులో ఎలా చేయగలుగుతారు. ఈ ప్రక్రియలో రుణ దాతలు, గ్రహీతలు చాలా చర్చించాల్సి ఉంటుంది. రుణ గ్రహీతల అవసరాలను బ్యాంకింగ్ సంస్థలు అర్థం చేసుకోవాలి. డిమాండ్ అనిశ్చితిలో ఉన్న వేళ భవిష్యత్తులో ఏం జరుగుతుందో గ్రహీతలు మదింపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది."
- జస్పాల్ బింద్రా, ప్రముఖ బ్యాంకిగ్ రంగ నిపుణుడు
భవిష్యత్తు అంచనా కష్టమే!
జస్పాల్ బింద్రాకు బ్యాంక్ ఆఫ్ అమెరికా, యూబీఎస్, స్డాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకుల్లో పని చేసిన అనుభవం ఉంది. లాక్డౌన్ పూర్తిగా ఎత్తేసిన తర్వాత ఎలాంటి వ్యాపారాలు మనుగడ సాగిస్తాయో ముందుగా అంచనా వేయటం చాలా కష్టమని ఈటీవీ భారత్‌తో తెలిపారు బింద్రా.
"లాక్డౌన్ తర్వాత తమ వ్యాపారాలు ఎలా సాగుతాయో యజమానులు అంచనా వేయటం కష్టం. ఉదాహరణకు ఒక రెస్టారెంట్ యజమానిని తీసుకుంటే.. కరోనాకు ముందు రోజుకు 100 మంది వినియోగదారులు వస్తారనుకోండి. లాక్డౌన్ తర్వాత ఆ సంఖ్య 80-60కి ఉండవచ్చు. లేదా 30కి పడిపోవచ్చు. రుణ పునర్నిర్మాణానికి భవిష్యత్తు అంచనాలు తప్పనిసరి. ఈ పరిస్థితుల్లో పునర్నిర్మాణం ఎలా సాధ్యమవుతుంది?"
- జస్పాల్ బింద్రా
ఏమిటీ రుణ ఖాతాల పునర్నిర్మాణం?