కరోనా వచ్చిన కొత్తలో ప్రజలు ఖర్చు పెట్టే తీరు మారిపోయింది. ఆ సమయంలో కేవలం కిరాణా సరుకుల, మందులు లాంటి నిత్యావసరాలను మాత్రమే ప్రజలు కొనుగోలు చేశారు. కొన్ని నెలల నుంచి లాక్డౌన్ ఆంక్షలను ప్రభుత్వం సడలిస్తుండటం వల్ల వినియోగదారు వ్యయం పెరుగుతోంది.
కరోనాను కట్టడి చేసేందుకు మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. ఇది ప్రపంచంలోనే కఠినమైన లాక్డౌన్ అని చాలా మంది అభిప్రాయపడ్డారు. కొన్ని రంగాలు మినహా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయి. చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. ఫలితంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది. ప్రజలు డబ్బులను పొదుపు చేసేందుకు మొగ్గుచూపారు. అందువల్ల కొనుగోలు తీరులో ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల్లో మార్పు అధికంగా కనిపించింది.
మూడు నెలల్లో వినియోగదారుల వ్యయం పెరిగిందని ఫెడరల్ బ్యాంకు కార్యనిర్వహక డైరెక్టర్ శాలిని వారియర్ తెలిపారు. ముంబయికి చెందిన ఈపీఎస్ ఇండియా నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన శాలిని పలు విషయాలను పంచుకున్నారు. లాక్డౌన్ తొలినాళ్లలో వినియోగదారుడు చేసే వ్యయం తగ్గినట్లు గుర్తించామని... వంట సరుకులు, మెడిసిన్, ఇతర అవసరాలపై పరిమితంగా ఖర్చు చేశారని స్పష్టం చేశారు.
"ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి వినియోగదారుడి వ్యయం పెరుగుతోంది. క్రెడిట్, డెబిట్ కార్డు సంబంధించిన వ్యయాన్ని జనవరితో పోల్చితే ప్రస్తుతం 80-90 శాతానికి చేరుకుంది. ఇది మార్కెట్ గమనానికి ఒక మంచి సూచిక. "
- శాలిని వారియర్, కార్యనిర్వహక డైరెక్టర్, ఫెడరల్ బ్యాంకు
కరోనాకు ముందున్న స్థాయికి వినియోగదారుడి వ్యయం వచ్చినప్పటికీ... ఖర్చు పెట్టే తీరు మారిపోయింది. ప్రయాణాలు, హోటళ్లు, హాస్పిటాలిటీ బాగా తగ్గిపోగా.. నిత్యవసరాలు, ఇతర గృహ వినియోగ వస్తువులకు గిరాకీ పెరిగింది.
వ్యక్తిగత వాహనాలకు గిరాకీ..
వినియోగదారుల వ్యయానికి సంబంధించిన సమాచారాన్ని బిగ్ డాటా ద్వారా విశ్లేషిస్తుంటాయి బ్యాంకులు. ఫెడరల్ బ్యాంకుకు సంబంధించి సమాచారాన్ని శాలిని వారియర్ పరిశీలిస్తుంటారు.