అమెరికా మార్కెట్లో చమురు ధర క్షీణించినా.. మన దగ్గర పెట్రో ధరలు తగ్గకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా అనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంతో గిరాకీ భారీగా తగ్గింది. లాక్‌డౌన్‌లు, షట్‌డౌన్‌ల కారణంగా ఉన్న నిల్వలు అయిపోకపోవడం వల్ల.. అదనపు చమురును దాచుకోలేక.. దాచుకోవడానికియ్యే ఖర్చుతో పోలిస్తే ఎదురు డబ్బులిచ్చి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇందుకు ఒక విధంగా కొవిడ్-19తో అమెరికా, రష్యా, ఒపెక్ దేశాల మధ్య చమురు యుద్ధం కూడా ఒక కారణం.
ఇక మన విషయానికొస్తే..మనం ఎక్కువగా ఒపెక్ బ్లాక్‌లోని బ్రెంట్ చమురును దిగుమతి చేసుకుంటాం. అది నార్వేకు దగ్గరలోని నార్త్ సీ నుంచి వస్తుంది. డబ్ల్యూటీఐ చమురుతో పోలిస్తే బ్రెంట్ ధరలు చాలా స్థిరంగా ఉంటాయి. ఇక భారత చమురు ధరలను ఒమన్, దుబాయ్, బ్రెంట్ చమురుల సగటుతో లెక్కిస్తారు. బ్రెంట్ ధర ప్రస్తుతం 20 డాలర్లుగా ఉండగా.. ఈ మూడింటి సగటు ధర 20.56 డాలర్లు(ఏప్రిల్ 17)గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఇంధనాల ధరలను బట్టే భారత్‌లో పెట్రోలు, డీజిల్‌ల రిటైల్ ధరను లెక్కగడతారు. ఇవి తగ్గినపుడే భారత్‌లో పెట్రోలు బంకుల్లో ధరలు కాస్త కిందకు దిగివచ్చు. అది కూడా మాట వరసకే. ఎందుకంటే ముడి చమురు ధరలు తగ్గినా.. పన్ను బాగా ఎక్కువగా ఉండడం వల్ల వినియోగదారులు అనుకున్నంతగా ఇక్కడి పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గవు. తగ్గడం లేదు కూడా.
మన దగ్గర లెక్క ఇదీ..
చమురు మార్కెట్లో అంటే.. మనం అనుకున్న మూడు మార్కెట్లలో ధరలు తగ్గినా.. ఆ ప్రయోజనాన్ని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు కమ్మేస్తున్నాయి. అదెలాగో చూద్దాం.. ప్రస్తుతం పెట్రోలు అసలు ధర(ప్రాథమిక ధర) లీటరుకు రూ.27.96 మాత్రమే. డీజిల్ లీటరు ప్రాథమిక ధర రూ.31.49 మాత్రమే(దిల్లీలో మార్చి 16, 2020 నాటికి). అయితే బంకుల్లో ధర వరుసగా రూ.69.59; రూ.62.29 చొప్పున కట్టాల్సి వస్తోంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు కలవడం వల్ల ఆ స్థాయికి ధరలు వెళ్లాయన్నమాట.
పన్నులు ఇలా: పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర పన్నులు(ఎక్సైజ్‌సుంకం) వరుసగా లీటరుకు రూ.22.98; రూ.18.83గా ఉన్నాయి. ఇక దిల్లీలో వ్యాట్ లీటరుకు వరుసగా రూ.14.79; రూ.9.19గా కట్టాల్సి వస్తోంది. అంటే పెట్రోలు మీద 54 శాతం మేర పన్ను; డీజిల్ మీద 45 శాతం మేర పన్ను కడుతున్నామన్నమాట. ఇది దిల్లీ సంగతి మాత్రమే. మహారాష్ట్ర, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అక్కడి రాష్ట్రాల్లో పన్నులు అధికం. అందుకే జనవరి 2020 నుంచి ఇప్పటిదాకా పెట్రోలు, డీజిల్ ప్రాథమిక ధరలు రూ.7-8 వరకు తగ్గినా.. అధిక పన్నుల కారణంగా రిటైల్ ధరలు ఆ స్థాయిలో కిందకు దిగిరాలేదు. మార్చి 14 నుంచి అమల్లోకి వచ్చేలా పెట్రోలు, డీజిల్‌పై రూ.3 చొప్పున కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని సైతం పెంచిన విషయం ఇక్కడ గుర్తించుకోదగ్గ అంశం.
కంపెనీలకు ఎంత లాభం
వినియోగదార్లకు ప్రయోజనాలను బదిలీ చేయట్లేదు కాబట్టి లాభం కంపెనీలకే. ఒక వేళ ఏప్రిల్ వరకు కంపెనీలు ధరలను తగ్గించకపోతే మాత్రం లీటరుకు రూ.11.63 మేర నికర మార్కెటింగ్ మార్జిన్ లభిస్తుందని ఒక బ్రోకరేజీ అంచనా వేస్తోంది. ఏప్రిల్ 1 వరకు రోజువారీ 15 పైసల నుంచి 30 పైసల వరకు తగ్గింపు ఉన్నా.. మార్జిన్ రూ.8-10 వరకైనా ఉంటుంది. ఈ అధిక మార్జిన్ కూడా వినియోగదార్ల జేబు నుంచి డబ్బులు ఎగిరి పోయేలా చేస్తోంది. అయితే కొవిడ్ తర్వాత ముఖ్యంగా లాక్‌డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా బంకుల్లో విక్రయాలు 60 శాతం దాకా తగ్గాయి. ఈ నేపథ్యంలో కంపెనీలు ప్రస్తుతం నష్టాల బాట పట్టాయి.
నాణేనికి రెండో వైపూ ఉంటుంది. అలాగే తక్కువ స్థాయి ధరలు స్వల్పకాలానికి మంచిదే కానీ.. దీర్ఘకాలంలో చమురు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. తయారీదార్ల వద్ద తవ్వకం, ఉత్పత్తికి అదనపు నిధులేమీ ఉండవు. అపుడు ఉత్పత్తి తగ్గుతుంది. కంపెనీలు మళ్లీ నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఎదురవుతుంది.
మే నెలలో తగ్గవచ్చు!