ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్‌గా పేరున్న మహారాష్ట్రలోని లాసల్గావ్లో హోల్‌సేల్ ఉల్లి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం కిలో ఉల్లి ధర ఇక్కడ రూ.30 దిగువకు చేరింది. దేశంలో ఉల్లి లభ్యత పెంచేందుకు.. ఎగుమతులపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ధరలు తగ్గుముఖం పట్టాయి.
నాసిక్ జిల్లాలో ఉన్న లాసల్గావ్ మార్కెట్లో సెప్టెంబర్‌లో పెరిగిన డిమాండుతో కిలో ఉల్లి ధర రూ.51 దాటింది. జాతీయ హార్టికల్చర్ పరిశోధన, అభివృద్ధి సంస్థ గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.
లాసల్గావ్ ఉల్లి ధరలకు ఎందుకంత ప్రాముఖ్యం?
దేశంలోని ప్రధాన ప్రాంతాలకు లాసల్గావ్ మార్కెట్ నుంచే ఎక్కువగా ఉల్లి సరఫరా అవుతుంది. ఇక్కడ ఉల్లి ధరల్లో ఉండే హెచ్చుతగ్గులు దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతాయి. లాసల్గావ్ వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీ ప్రకారం.. గురువారం కిలో ఉల్లి ధర స్థానిక మార్కెట్లో గరిష్ఠంగా రూ. 30.20 వద్ద ఉంది. కనీస మద్దతు ధర రూ.15గా ఉంది.