కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ వివరాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసోచామ్, ఫిక్కీ వంటి ఆర్థిక సమాఖ్యలు ప్రభుత్వ ప్రకటనపై సంతృప్తి వ్యక్తం చేయగా.. పలువురు రాజకీయ నేతలు ప్యాకేజీపై విమర్శలు గుప్పించారు.
పారిశ్రామిక వర్గాల హర్షం
ఆత్మ నిర్భర భారత్ అభియాన్‌లో భాగంగా కేంద్రం అత్యంత ప్రభావవంతమైన ప్యాకేజీని ప్రకటించినట్లు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. కొవిడ్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అత్యవసరమైన చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు.
ఉపశమనం
ఆత్మ నిర్భర భారత్ తొలి విడతలో భాగంగా నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపన చర్యలు.. కరోనాతో భారీగా నష్టపోయిన ఎంఎస్ఎంఈలకు సత్వరమే ఉపశమనం కలిగిస్తాయని అసోచామ్ సెక్రెటరీ జనరల్ దీపక్ సూద్ వ్యాఖ్యానించారు. సూక్ష్మ ఆర్థిక సంస్థలు, గృహ ఫైనాన్స్ కంపెనీలు, తీవ్ర ఒత్తిడిలో ఉన్న రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు దీని వల్ల ప్రయోజనం పొందుతాయని అన్నారు.
ఫిక్కీ
కొవిడ్ కారణంగా మందగమనంలో కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థను పైకి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఫిక్కీ అధ్యక్షురాలు సంగీతా రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆర్థికమంత్రి చేసిన ప్రకటన ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోందని వ్యాఖ్యానించారు.
ఎసీఎంఏ
ఎంఎస్ఎంఈ నిర్వచనం మార్చాలని సుదీర్ఘ కాలంగా ఆటోమోటివ్ కాంపోనెంట్ మానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎసీఎంఏ) సిఫార్సు చేసిందని ఆ సమాఖ్య అధ్యక్షుడు దీపక్ జైన్ గుర్తు చేశారు. తాజా సవరణ ద్వారా ఎసీఎంఏలోని మెజారిటీ సభ్యులకు మేలు కలుగుతుందని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాల విమర్శలు
మరోవైపు ప్రభుత్వం వెల్లడించిన వివరాలపై రాజకీయ పక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ప్యాకేజీపై విమర్శలు సంధించాయి.
లాక్డౌన్ కారణంగా ఎక్కడికక్కడే చిక్కుకుపోయి సొంతూళ్లకు బయలుదేరిన వలస కార్మికులకు ప్రయోజనం చేకూరే విధంగా ఎలాంటి ప్రకటనలు లేవని కాంగ్రెస్ నేత పీ చిదంబరం ఆరోపించారు. కష్టపడి సంపాదించే కార్మికులపై ఇది క్రూరమైన దెబ్బ అని వ్యాఖ్యానించారు. సొంత భయాలు, అజ్ఞానం మధ్య ప్రభుత్వం ఖైదీగా మారిందని చురకలు అంటించారు.
బూటకం
మరోవైపు.. మోదీ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ వట్టి బూటకమని వామపక్షాలు ఎద్దేవా చేశాయి. ప్రజల తక్షణ సమస్యలను పరిష్కరించడంలో ఈ ప్యాకేజీ విఫలమైందని ఆరోపించాయి. నిధుల కోసం పరితపిస్తున్న రాష్ట్రాలకు మేలు కలిగే విధంగా ఎలాంటి ప్రకటనలు లేవని సీపీఐ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శించారు.
రాష్ట్రాలకు పెద్ద సున్నా
కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలో రాష్ట్రాలకు ఏమీ లేదని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ప్యాకేజీని 'పెద్ద సున్నా'గా అభివర్ణించారు. కరోనా సమయంలో ప్రజలను మోదీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని విమర్శలు గుప్పించారు.