తెలంగాణ

telangana

ETV Bharat / business

పింఛను పాలసీలు... ఎవరికి అవసరం? - యాన్యుటీ పాలసీలు

పెట్టుబడులపై క్రమం తప్పకుండా ఆదాయం రావాలని కోరుకునే వారు యాన్యుటీ ప్లాన్లు (పింఛను పాలసీలు) ఎంచుకుంటుంటారు. నిజానికి ఈ పాలసీలు ఎవరికి అవసరం? పదవీ విరమణకు దగ్గరలో ఉన్నవారికా.. ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారికా.. 30-40 ఏళ్ల వయసులో ఉన్నవారికా.. ఈ పాలసీల్లో మదుపు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? ఇలాంటి సందేహాలు మీకూ ఉన్నాయా? అయితే.. వాటికి సమాధానాలు తెలుసుకుందాం..

who needs annuity plan
పింఛను పాలసీ

By

Published : Jun 4, 2021, 2:24 PM IST

పదవీ విరమణ తర్వాత క్రమం తప్పని ఆదాయం వస్తేనే.. జీవితం గడుస్తుంది. అందుకే, ప్రతి ఒక్కరూ ఇలాంటి ఏర్పాట్లు చేసుకునేందుకు సిద్ధమవుతుంటారు. ఈ క్రమంలో యాన్యుటీ ప్లాన్లను ఎంచుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తుంటారు. అయితే, అందరికీ ఇవి నప్పకపోవచ్చు.. అసలు ఎవరు ఈ పాలసీలు తీసుకోవాలో చూద్దాం..

ఆధారపడిన వారుంటే..

పదవీ విరమణ తర్వాత జీవితాంతం వరకూ క్రమం తప్పకుండా స్థిరాదాయాన్ని అందించేందుకు యాన్యుటీ ప్లాన్లు ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యులు తమ ఆర్థిక అవసరాలకు మీపైనే ఆధారపడినప్పుడు యాన్యుటీ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల ఆదాయాన్ని ఆర్జించేందుకు వీలవుతుంది. ఉదాహరణకు మీపై ఆధారపడి పిల్లలు, జీవిత భాగస్వామి, మీ తల్లిదండ్రులు ఉన్నారనుకోండి.. ఈ ప్లాన్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని వారి అవసరాలను తీర్చేందుకు వాడుకోవచ్చు.

ఖర్చులను తట్టుకునేందుకు..

ఇంటి అద్దె.. రుణ వాయిదాల్లాంటి ఖర్చులు నెలనెలా ఉంటాయి. ఇలాంటి వాటికోసం ఒక క్రమానుగత ఆదాయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలాంటి ఏర్పాటు లేకపోతే.. పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంది. ఇలాంటి ఇబ్బంది లేకుండా.. పదవీ విరమణ సురక్షిత పెట్టుబడి పథకంగా యాన్యుటీ ప్లాన్లను ఎంచుకోవచ్చు.

దీర్ఘకాలిక లక్ష్యంతో..

యాన్యుటీ ప్లాన్లలో అనేక వెసులుబాట్లు ఉంటాయి. చాలా ప్లాన్లలో 40 ఏళ్ల వయసు నుంచే పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. వీటిలో దీర్ఘకాలం మదుపు చేయడం వల్ల అధిక రాబడి పొందేందుకు అవకాశం కల్పిస్తాయి. త్వరలో పదవీ విరమణ చేయబోతున్న వారూ.. లేక ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారికీ ఈ ప్లాన్లు అనుకూలంగానే ఉంటాయి. పదవీ విరమణ నాటికి ప్రావిడెంట్‌ ఫండ్‌, పింఛను ఫండ్‌, గ్రాట్యుటీ చెల్లింపులు ఇలా పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది. ఈ మొత్తాన్ని మీ భవిష్యత్‌కు ఉపయోగపడేలా మదుపు చేసుకోవాలి. ఇమ్మీడియట్‌ యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేసినప్పుడు వెంటనే పింఛను అందుకునే ఏర్పాటు చేసుకోవచ్చు.

జీవిత భాగస్వామికీ..

చాలామటుకు యాన్యుటీ ప్లాన్లను దంపతులిద్దరికీ పింఛను ఇచ్చే ఏర్పాటు ఉంటుంది. తొలుత యాన్యుటీదారుడి పేరుమీద చెల్లింపులు వస్తాయి. అతను/ఆమె తదనంతరం జీవిత భాగస్వామికి జీవితాంతం వరకూ పింఛను చెల్లిస్తారు. దీనివల్ల చివరి దశలో ఎవరిపైనా ఆధారపడకుండా వారు ఆర్థికంగా భరోసాగా ఉండేందుకు వీలవుతుంది. రెండో యాన్యుటీదారుడి తదనంతరం నామినీకి యాన్యుటీ విలువను చెల్లించే ఏర్పాటు చేసుకోచ్చు. జీవితాంతం వరకూ పింఛను తీసుకునే ఏర్పాటు చేసుకోవడం సహా తన తర్వాత.. పిల్లలకు ఆ మొత్తం చేరేలా చేయొచ్చు. దీనికి యాన్యుటీ ప్లాన్లు ఎంతో సులభంగా ఉంటాయి.

-భరత్‌ కల్సీ

చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌, బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌

ఇదీ చూడండి:సంక్షోభంలో పిల్లల భవితకు భరోసానిచ్చేలా...

ABOUT THE AUTHOR

...view details