తెలంగాణ

telangana

ETV Bharat / business

స్టాక్​ మార్కెట్​కు సారథి.. కానీ 'అదృశ్య' యోగి చేతిలో కీలుబొమ్మ.. ఇది ఓ 'చిత్ర' కథ! - nse ceo it raids

Chitra Ramkrishna NSE: ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌ ట్రేడింగ్‌కు సారథ్యం వహించిన ఘనత ఆమెది. వ్యాపార రంగంలో మహిళా లీడర్‌గా ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కించుకున్న వ్యక్తి ఆమె. అలా వ్యాపార రంగంలో రారాణిగా వెలిగిన ఆమె.. కేవలం ఓ 'అదృశ్య' యోగి చెప్పాడని అర్హత లేని వ్యక్తిని అందలం ఎక్కించారు. ఆయన చేతిలో 'కీలుబొమ్మ'గా మారి తన హోదాకే కళంకం తెచ్చారు. ఇప్పుడు ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నారు. కెరీర్‌ ఆరంభం నుంచే శరవేగంగా దూసుకెళ్లిన ఆమె ఇప్పుడు అంతే వేగంగా అమాంతం కిందపడే పరిస్థితికి చేరుకున్నారు. ఆమే జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఎన్‌ఎస్‌ఈ మాజీ ఎండీ, సీఈఓ చిత్రా రామకృష్ణ.

Chitra Ramakrishna
Chitra Ramakrishna

By

Published : Feb 17, 2022, 6:45 PM IST

ఎవరీ చిత్రా రామకృష్ణ..

ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌గా కెరీర్‌ ఆరంభించిన చిత్ర అంచెలంచెలుగా ఎదిగారు. 1985లో ఐడీబీఐ బ్యాంక్‌కు చెందిన ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ డివిజన్‌లో చేరారు. ఆ తర్వాత కొంతకాలం పాటు సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ)లో పనిచేసి ఆ తర్వాత మళ్లీ ఐడీబీఐ బ్యాంక్‌కు తిరిగొచ్చారు. తన వృత్తి నైపుణ్యాలు, ప్రతిభతో ఐడీబీఐ ఛైర్మన్‌ ఎస్‌ఎస్‌ నదకర్ణీ దృష్టిలో పడి జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ వైపు అడుగులు వేశారు.

ఎన్‌ఎస్‌ఈ ఏర్పాటులో కీలక సభ్యురాలిగా..

బీఎస్‌ఈలో హర్షద్‌ మెహతా కుంభకోణం తర్వాత ఓ పారదర్శక ట్రేడింగ్‌ మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం భావించింది. ఇందుకోసం ఐదుగురు కీలక సభ్యులను ఎంచుకోగా.. అందులో చిత్ర రామకృష్ణ ఒకరు. ఈమెను ఐడీబీఐ ఛైర్మన్‌ నదకర్ణీనే ప్రభుత్వానికి సూచించారు. అలా ఎన్‌ఎస్‌ఈ ఏర్పాటులో కీలక సభ్యురాలిగా మారారు. ఎన్‌ఎస్‌ఈకి ఆర్‌హెచ్‌ పాటిల్‌ తొలి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉండగా.. రవి నరైన్‌, చిత్ర కోర్‌ టీంలో సభ్యులుగా ఉన్నారు. 2009లో రవి నరైన్‌ పదవీకాలం పూర్తయిన తర్వాత చిత్ర ఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈకి తొలి మహిళా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఈమే. ఎన్‌ఎస్‌ఈ దేశంలోనే అతిపెద్ద స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌గా మారడంలో చిత్ర కీలక పాత్ర పోషించారని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతారు. 2013లో ఆమె ఎన్‌ఎస్‌ఈ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఓ ట్రేడ్‌ ఎక్స్ఛేంజ్‌కు నాయకత్వం వహించిన మూడో మహిళగా చిత్ర అరుదైన ఘనత దక్కించుకున్నారు. ఆమె కంటే ముందు శ్రీలంక కొలంబో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌, చైనా షెంజెన్‌ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు మహిళా సారథులు ఉన్నారు.

ఉత్తమ నాయకురాలిగా..

తన కెరీర్‌లో ఎన్నో బాధ్యతలు చేపట్టిన చిత్ర అనేక అవార్డులు కూడా దక్కించుకున్నారు. 2013లో ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ ఆమెను బిజినెస్‌ లీడర్‌షిప్‌ అవార్డుల్లో 'విమన్‌ ఆఫ్ ది ఇయర్‌'గా ఎంపిక చేసింది. ప్రతిష్ఠాత్మక ఫార్చ్యూన్‌ మ్యాగజీన్‌ ప్రకటించే గ్లోబల్ విమెన్‌ బిజినెస్‌ లీడర్స్‌ జాబితాలో చిత్ర 17వ స్థానంలో నిలిచారు. భారత్‌లో రెండో శక్తిమంతమైన మహిళా వ్యాపారవేత్తగానూ పేరుగాంచారు.

అవినీతి మరకలు..

రెండున్నర దశాబ్దాల పాటు ఎన్‌ఎస్‌ఈకి సేవలందించిన చిత్ర.. 2016 డిసెంబరులో అనూహ్యంగా ఎండీ, సీఈఓ పదవి నుంచి వైదొలిగారు. బోర్డు సభ్యులతో విభేదాల కారణంగా తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆ తర్వాత ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో సెబీ ఆమెపై చర్యలు చేపట్టింది. కో-లొకేషన్‌ కేసులో బ్రోకర్లకు అక్రమంగా లబ్ధి చేకూర్చినట్లు ఆమెపై ఆరోపణలు రావడంతో 2013-14లో ఆమె డ్రా చేసుకున్న జీతంలో 25శాతం ఇన్వెస్టర్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఫండ్‌(ఐపీఈఎఫ్‌)లో జమ చేయాలని సెబీ ఆదేశించింది. అంతేగాక, ఏ లిస్టెడ్‌ కంపెనీ లేదా మార్కెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇనిస్టి్ట్యూట్‌తో కలిసి పనిచేయకుండా ఐదేళ్ల పాటు ఆమెపై నిషేధం విధించింది.

తెరపైకి 'యోగి..

చిత్ర రామకృష్ణ హయాంలో ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌ స్ట్రాటజిక్‌ అడ్వైజర్‌గా ఆనంద్‌ సుబ్రమణియన్‌ను అనూహ్యంగా నియమించడం, తిరిగి గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, ఎండీ సలహాదారుగా మార్చడం వంటి విషయాల్లో పాలనాపరమైన అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సెబీ ఇటీవల దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే సంచలన విషయాలు బయటకొచ్చాయి. చిత్ర గత 20 ఏళ్లుగా ఓ 'అదృశ్య' యోగి ప్రభావానికి లోనైనట్లు తెలిసింది. హిమాలయాల్లో ఉండే ఆ యోగితో ఎన్‌ఎస్‌ఈకి సంబంధించిన కీలక విషయాలను పంచుకుని ఆయన నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే ఆయన చేతిలో కీలుబొమ్మగా మారి యోగి చెప్పినట్లు నిర్ణయాలు తీసుకున్నారని దర్యాప్తులో వెలుగుచూసింది.

యోగి చెప్పారని ఆయన జీతం 9 రెట్లు పెంచి..

నిజానికి ఎస్‌ఎస్‌ఈలో చీఫ్‌ స్ట్రాటజిక్‌ అడ్వైజర్‌ పదవి లేదు. యోగి చెప్పారనే ఆ పదవిని సృష్టించిన చిత్ర.. ఆ బాధ్యతల్లో బాల్మెర్‌ లౌరీ కో అండ్‌ లిమిటెడ్‌ సంస్థలో పనిచేసే ఆనంద్‌ సుబ్రమణియన్‌ను తీసుకున్నారు. బాల్మెర్‌లో ఆనంద్‌ జీతం రూ.15లక్షలు ఉంటే.. ఎన్‌ఎస్‌ఈలో రూ.1.38 కోట్ల ప్యాకేజీని ఆఫర్‌ చేశారు. ఆ తర్వాత ఏడాదికే అతడి జీతాన్ని 20 శాతం పెంచి ప్రమోషన్‌పై గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా నియమించారు. అంతేనా.. వారానికి మూడు రోజులు మాత్రమే పనిచేసేలా ఆయనకు మినహాయింపులు కూడా కల్పించారు. దాదాపు ఎండీ స్థాయి హోదా కల్పించారు. ఇదంతా యోగి సూచనల మేరకే చేసినట్లు సెబీ దర్యాప్తులో తేలింది.

నిరాకార వ్యక్తి.. సిద్ధపురుషుడు..

తాను హిమాలయ యోగి నిర్ణయాల మేరకు నడుచుకున్నట్లు చిత్ర రామకృష్ణ కూడా అంగీకరించడం గమనార్హం. సెబీకి ఇచ్చిన వివరణలో ఆ వ్యక్తి ఓ నిరాకారుడని, సిద్ధ పురుషుడు, శిరోణ్మని అని అభివర్ణించారు. తన వృత్తి, వ్యక్తిగత విషయాల్లో ఆయన నుంచి మార్గనిర్దేశం పొందినట్లు చెప్పారు. ఆ యోగికి భౌతిక రూపం అంటూ ఏదీ లేదని, ఆయన ఎలా కావాలంటే అలా మారుతాడని చెప్పడం గమనార్హం.

అయితే సెబీ దర్యాప్తులో ఆ వ్యక్తి మనిషేనని తేలింది. అంతేగాక, ఆ వ్యక్తి ఆనంద్‌ సుబ్రమణియన్‌కు కూడా తెలిసే ఉంటుందని సెబీ భావిస్తోంది. మరి ఆ యోగి ఎవరో సెబీ బయటపెడుతుందో లేదో చూడాలి..!

ఇవీ చూడండి:'చిత్రా.. నీ కురులు సూపర్'.. బాబాజీ ఇ-మెయిళ్లు లీక్!

It raid news: ఎన్​ఎస్​ఈ మాజీ సీఈఓ ఇంట్లో ఐటీ సోదాలు​

ABOUT THE AUTHOR

...view details