తెలంగాణ

telangana

ETV Bharat / business

'బాయ్‌కాట్‌ చైనా' వల్ల ఎవరికి లాభం?.. ఎవరికి నష్టం?

భారత్‌- చైనా సరిహద్దుల్లో భారత జవాన్ల వీరమరణం ఏ భారతీయుడి రక్తాన్నయినా మరిగించే అంశమే. భావోద్వేగాన్ని నింపే విషయమే. మనతో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా ఉత్పత్తులు మనమెందుకు ఉపయోగించాలన్న వాదనా సబబే. 'బాయ్‌కాట్‌ చైనా' అనే నినాదాన్నీ తప్పుపట్టలేం. మరి ద్వైపాక్షిక ఆర్థిక బంధాలను తెగదెంపులు చేసుకుంటే ఎవరికి నష్టం.. ఎవరికి లాభం? మనం చైనాపై ఎంత ఆధారపడి ఉన్నాం? చైనా మనపై ఎంత మేర ఆధారపడి ఉంది? మనం దిగుమతులపై ఆధారపడకుండా ఎప్పటికి నిలదొక్కుకోగలం?

Who benefits from boycott China? Whose loss?
'బాయ్‌కాట్‌ చైనా' వల్ల ఎవరికి లాభం?

By

Published : Jun 25, 2020, 7:06 AM IST

భారత్‌-చైనా సంఘర్షణల వాతావరణం నేపథ్యంలో ద్వైపాక్షిక వాణిజ్యం అంశంపై ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. నిజం చెప్పాలంటే.. భారత్‌కు చైనా ఒక ప్రధాన వాణిజ్య భాగస్వామి అనే చెప్పాలి. భారత మొత్తం ఎగుమతుల్లో చైనా వాటా 9 శాతంగా ఉండగా.. మొత్తం దిగుమతుల్లో డ్రాగన్‌ వాటా 18 శాతంపైనే.

గణాంకాల ప్రకారం చూస్తే చిన్నగానే అనిపించవచ్చు కానీ.. అవి ఇక్కడకు రాకుండా మన కంపెనీలు దేశీయంగా కొన్ని ఉత్పత్తులను చేయలేని పరిస్థితి అయితే ఉంది. అందువల్లే చైనా దిగుమతులపై భారత్‌ ఎక్కువగానే ఆధారపడి ఉందని చెప్పాల్సి వస్తుంది.

ఈ రంగాలు ఎక్కువ ఆధారపడ్డాయ్‌..

ఏపీఐలు, ప్రాథమిక రసాయనాలు, వ్యవసాయ ఇంటర్మీడియటరీల వంటి ముడి పదార్థాలతో పాటు.. వాహన, మన్నికైన వస్తువుల, యంత్ర పరికరాలకు సంబంధించిన కీలక విడిభాగాలు మనకు ఆ దేశం నుంచే వస్తాయి. దిగుమతి గణాంకాల్లో చెప్పాలంటే.. వాహన విడిభాగాల్లో 20%; ఎలక్ట్రానిక్స్‌ విడిభాగాల్లో 70% వరకు ఆధారపడి ఉన్నాం. అదే విధంగా.. చైనా నుంచి 45% మన్నికైన వినియోగదారు వస్తువులు(టీవీలు, ఫ్రిడ్జ్‌లు, మొబైళ్లు..); 70% ఏపీఐలు; 40% తోలు వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాం.

చైనా నుంచి భారత దిగుమతులు 2018-19లో 13.7 శాతంగా ఉండగా.. 2019-20 నాటికి 14.1 శాతానికి పెరిగాయి. ఫిబ్రవరిలో మొత్తం దిగుమతుల్లో నాలుగో వంతు(18 బి. డాలర్లు) ఎలక్ట్రానిక్స్‌ పరికరాలదే కావడం గమనార్హం. ఇక న్యూక్లియర్‌ రియాక్టర్లు, మెషనరీ, విడిభాగాల దిగుమతి విలువ 12 బిలియన్‌ డాలర్ల మేర ఉన్నాయి.

ఎప్పటి నుంచో ఈ వివాదం

అసలు చైనాపై ఆధారపడే ధోరణిని తగ్గించుకోవాలన్న మాట ఇప్పటిది కాదు. పలు సందర్భాల్లో ఈ అంశం చర్చకు వస్తూనే ఉంది. ఆ దిశగా అడుగులు కూడా పడ్డాయి. వివిధ కంపెనీలు ప్రత్యామ్నాయాలను అన్వేషించాయి కూడా. రసాయనాల రంగానికే వస్తే అమైన్‌, రబ్బర్‌ కెమికల్స్‌, కార్బన్‌ బ్లాక్‌, ఇంజినీరింగ్‌ ప్లాస్టిక్స్‌ తయారీ కంపెనీలు దేశీయ తయారీకే ప్రాధాన్యమిచ్చాయి. దిగుమతులపై ఆధారపడడం తగ్గించాయి.

  • ఇక ఫార్మా రంగంలో ఏపీఐల దిగుమతి తగ్గించుకునే విషయంలో ఆర్తి డ్రగ్స్‌, గ్రాన్యూల్స్‌ ఇండియా, జేబీ కెమికల్స్‌, ఐఓఎల్‌ కెమికల్స్‌ వంటివి గణనీయమైన అభివృద్ధినే సాధించాయి.
  • మన్నికైన వినియోగదారు వస్తువుల రంగంలో హావెల్స్‌, వోల్టాస్‌ వంటి దేశీయ కంపెనీలు సొంతంగా తయారీ సదుపాయాలను ఏర్పాటు చేసుకుని దిగుమతిపై ఆధారపడడం తగ్గించుకున్నాయి.
  • వాహన విడిభాగాల విభాగంలో.. దేశీయంగా విడిభాగాలను తయారు చేయడం కోసం ఒక ఎలక్ట్రానిక్స్‌ ప్లాంటును లుమాక్స్‌ ఇండస్ట్రీస్‌ ఏర్పాటు చేసింది. మారుతీ కూడా వివిధ ఎలక్ట్రానిక్స్‌ భాగాలను దిగుమతికి బదులుగా ఇక్కడే తయారు చేయడంపై దృష్టి సారించింది.
  • తాజాగా భారత ఆభరణాల వర్తకుల చైనా బదులుగా జపాన్‌, వెనుజువెలా, ఆస్ట్రేలియాల నుంచి ముత్యాలను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించాయి. ఆ దిశగా బెంగళూరుకు చెందిన సి క్రిష్ణయ్య షట్టి గ్రూప్‌ ఆఫ్‌ జువెలర్స్‌ తొలి అడుగు వేసింది. భారత రూ.35,000 కోట్ల ఫ్యాషన్‌ జువెలరీ వ్యాపారంలో చైనాకు 35-40 శాతం వాటా ఉండడం గమనార్హం. ఆ వాటాను క్రమం తగ్గించడానికి కంపెనీలు కంకణం కట్టుకున్నాయి.
    చైనాతో మన గణాంకాలు(2019)

ఏం ఎగుమతి చేస్తున్నాం

చైనాకు భారత ఎగుమతులు కూడా పెరిగాయి. 2018-19లో ఇవి 5.1 శాతంగా ఉండగా.. 2019-20 నాటికి 5.3 శాతానికి చేరాయి. ముఖ్యంగా ఆర్గానిక్‌ రసాయనాలు, స్లాగ్‌ అండ్‌ యాష్‌, మినరల్‌ ఆయిల్స్‌, మినరల్‌ ఫ్యూయల్స్‌, ఇతరత్రా పారిశ్రామిక ఉత్పత్తులను మనం పంపుతున్నాం.

ఎగుమతుల వివరాలు

ప్రణాళికాబద్ధంగా వెళితేనే..

చైనాతో ఇప్పటికిప్పుడు తెగదెంపులు చేసుకుంటే భారత కంపెనీలకే నష్టం. అలా కాకుండా.. సమయం తీసుకుని దేశీయంగా తయారు చేసే సామర్థ్యాన్ని పెంచుకున్నాక చైనా అనే కాదు.. ఇతర ఏ దేశంపైనా ఆధారపడకుండా ఉంటే కరోనా వంటి ఎన్ని సంక్షోభాలు, సరిహద్దు సంఘర్షణలు జరిగినా పెద్దగా ఇబ్బంది ఉండదనేది పారిశ్రామిక వర్గాల మాట.

ఇదీ చూడండి: 'ముకేశ్‌ జీ రండి.. చైనా వస్తువులను బహిష్కరిద్దాం'

ABOUT THE AUTHOR

...view details