దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా ఎంతకాలం ఈ ధరల పెరుగుదల కొనసాగుతుందోనని ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.
తగ్గినా తగ్గలేదు..
కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ స్తంభించి పోయింది. రోడ్లపై వాహనాలు తిరగలేదు. పారిశ్రామిక డిమాండ్ కూడా పడిపోయింది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ డిమాండ్ తగ్గిపోయి.. వాటి ధరలు తగ్గాయి. బ్యారెల్ ముడిచమురు ధర భారీగా పడిపోయింది. గతేడాది ఏప్రిల్లో బ్యారెల్ ధర 20 డాలర్ల వద్దకు చేరుకుంది.
కరోనా సమయంలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది. దాన్ని భర్తీ చేసుకునేందుకు.. పెట్రోల్, డీజిల్పై సుంకాలను పెంచి ప్రభుత్వం సొమ్ము చేసుకుంది. దీనివల్ల ముడి చమురు తగ్గిన సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదు. ఇప్పుడు అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నప్పుడు కూడా పెంచిన పన్ను ఉపసంహరణ జరగలేదు. దీంతో అంతిమంగా వినియోగదారులపై భారం పడుతోంది.
ఎలా తగ్గాలి?
పెట్రోల్, డీజిల్పై పన్నులు ప్రస్తుతం భారీగా ఉన్నాయి. కేంద్రం, రాష్ట్రం పన్నులు దాదాపు చెరో 30 శాతం ఉన్నాయి. పెట్రోల్ ధరలు తగించాలంటే పన్ను తగ్గించాలని చాలా వరకు ప్రజలు, నిపుణులు కోరుతున్నారు. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలని, దీనివల్ల అంతిమంగా 28 శాతం జీఎస్టీ ఉండటం వల్ల.. భారీగా తగ్గుతుందని వారు అంటున్నారు. ఈక్విలైజేషన్ ఫండ్ పెట్టి ధరల నియంత్రణ చేపట్టాలని కొందరు కోరుతున్నారు. దీని ద్వారా రోజువారీ ధరల పెరుగుదల, తగ్గుదల ఉండదని వారు సూచిస్తున్నారు.
"ఈక్విలైజేషన్ ఫండ్ ద్వారా ముడి చమురు ధరలు తగ్గినపుడు.. ఆ ప్రయోజనం వినియోగదారులకు బదిలీ చేయకుండా.. ఆ ఫండ్ నిధులు జమ చేయవచ్చు. ముడి చమురు పెరిగినప్పుడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకుండా.. ఈ ఫండ్ నిధులు ఉపయోగించుకోవాలి. ఈ ఫండ్ ఆధారంగా నెలకోసారి నిర్ణయం తీసుకోవచ్చు."