తెలంగాణ

telangana

ETV Bharat / business

పెట్టుబడులు వెనక్కి.. ఇవన్నీ ఆలోచించాకే.. - మార్కెట్ల రికార్డులకు కారణాలు

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు జీవన కాల గరిష్ఠాలను చేరుకున్నాయి. ఎంతోమంది పెట్టుబడులు (Stock market investment) లాభాల్లోకి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో తమ మదుపు మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మరి, దీనికి ఇప్పుడు సరైన సమయమేనా? లేదా కొంతకాలం కొనసాగాలా? అనే సందేహం కొందరిది. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Tips for Stock Market Investors
పెట్టుబడులను ఎప్పుడు వెనక్కి తీసుకోవాలి

By

Published : Aug 20, 2021, 9:16 AM IST

ప్రతి పెట్టుబడికీ ఒక లక్ష్యం ఉంటుంది. అందుకు అనుగుణంగానే వ్యూహాత్మకంగా మదుపు కొనసాగాలి. అందుకే, ఆర్థిక నిపుణులు ఎప్పుడూ చెప్పే మాట ఏమిటంటే.. క్రమశిక్షణ, దీర్ఘకాలం.. సమయానుకూల సమీక్ష.. మార్కెట్లో విజయం సాధించేందుకు ఇవే కీలకం. కాబట్టి, మార్కెట్లో నుంచి పెట్టుబడులను(Stock market investment) వెనక్కి తీసుకునే ముందు కొన్ని విషయాలను ఆలోచించుకోవాలి.

ఇప్పుడు అవసరమా?

సాధారణంగా పెట్టుబడిదారులు(Stock market investment) తమ పదవీ విరమణ, పిల్లల ఉన్నత చదువులు, వారి వివాహం.. ఇలా కొన్ని నిర్ణీత లక్ష్యాలను ఏర్పరచుకొని, అందుకు ఉపయుక్తంగా ఉండే పథకాల్లో మదుపు చేస్తుంటారు. లక్ష్యాలకూ.. పెట్టుబడి పథకాలకూ సంబంధం కచ్చితంగా ఉండాలి. అందుకే, అవి నెరవేరే వరకూ పెట్టుబడులను కొనసాగించాలి కానీ.. వెనక్కి తీసుకోవాలనే ఆలోచన వద్దు. మీరు పెట్టిన పెట్టుబడి మంచి లాభాలు ఆర్జించింది అని భావిస్తే.. అందులో మీ పెట్టుబడుల కేటాయింపు వ్యూహం ప్రకారం కొంత తీసి, తక్కువ నష్టభయం ఉన్న పథకాలకు మళ్లించాలి.

ఇప్పుడు చాలామంది తమ ఈపీఎఫ్‌ నుంచి డబ్బును వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొవిడ్‌-19 తొలి, రెండో దశల నేపథ్యంలో ఈపీఎఫ్‌ నుంచి నిర్ణీత మొత్తాన్ని తీసుకునేందుకు అనుమతిచ్చారు. చాలామంది ఈ వెసులుబాటును వినియోగించుకున్నారు. కానీ, ఈ నిధి పదవీ విరమణ తర్వాత అవసరాలకు ప్రత్యేకించింది. ముందుగానే తీసుకోవడం వల్ల భవిష్యత్‌ లక్ష్యం నెరవేరదు. నిజంగా మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడే ఈపీఎఫ్‌ నుంచి డబ్బును వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయండి. ఇల్లు, ప్లాటు కొనుగోలు సమయంలోనూ అవసరమైనంత మేరకే ఈ నిధిని వెనక్కి తీసుకోవడం మంచిది.

మార్పులు మంచివే..

నేరుగా షేర్లలో మదుపు చేసినా.. మ్యూచువల్‌ ఫండ్ల ద్వారా మార్కెట్లో పెట్టుబడులు పెట్టినా(Stock market investment).. మంచి లాభాలు ఆర్జించడమే మన వ్యూహం. అయితే, దీనికి దీర్ఘకాలం వేచి ఉండటం అనేది తప్పనిసరి. అదే సమయంలో మీ పెట్టుబడులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాల్సిందే. మీరు ఎంచుకున్న షేరు/ఫండ్‌ పథకం ప్రామాణిక సూచీ మేరకు పనితీరు చూపించడం లేదని తేలితే.. అందులో నుంచి పెట్టుబడిని ఉపసంహరించుకోవచ్చు. మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న ఇతర ఫండ్లకు ఆ మొత్తాన్ని మళ్లించాలి. ఫండ్‌ గత పనితీరు.. ఇప్పుడు ఎందుకు ఇబ్బంది ఎదుర్కొంటోంది.. ఆ షేరులో తాత్కాలిక ఇబ్బంది ఏమైనా ఉందాలాంటి ప్రాథమిక అంశాలను గమనించడం మర్చిపోవద్దు. అవసరమైతే ఆర్థిక సలహాదారు సూచనలు తీసుకోవాలి.

సరైన సమయంలోనే..

మార్కెట్‌లో మదుపు చేసేందుకు సరైన సమయం ‘ఇప్పుడే..’ దిద్దుబాటు వచ్చినప్పుడు మదుపు చేస్తాం.. అని వేచి చూస్తూ ఉంటే.. మనం అనుకుంటున్న పరిస్థితి ఎప్పటికీ రాకపోవచ్చు. అనిశ్చితి ఎక్కువగా ఉన్నప్పుడు చాలామంది భయపడి, పెట్టుబడులకు దూరంగా ఉంటారు. పెరుగుతున్నప్పుడు తగ్గుతుందా అని చూస్తారు.. ఈ రెండూ పెట్టుబడికి శత్రువులే. వ్యూహాత్మకంగా పెట్టుబడులను వైవిధ్యంగా కేటాయిస్తూ.. ముందుకు సాగాలి. చరిత్రను పరిశీలిస్తే.. ఏ సమయంలోనైనా మార్కెట్లో కొనసాగిన వారే మంచి లాభాలను కళ్లచూశారనేది చరిత్ర.

ఆర్థిక లక్ష్యాలు దగ్గరగా..

మీరు సాధించాల్సిన ఆర్థిక లక్ష్యాలు మరో ఏడాది నుంచి ఆరు నెలల వ్యవధిలోపే ఉన్నప్పుడు ఈక్విటీల నుంచి పెట్టుబడులను క్రమానుగతంగా వెనక్కి తీసుకోవాలి. వీటిని తక్కువ నష్టభయం ఉన్న లిక్విడ్‌ ఫండ్లలోకి మారుస్తూ ఉండాలి. దీనివల్ల మార్కెట్లో దిద్దుబాటు వచ్చినా మీ పెట్టుబడికీ.. వచ్చిన లాభాలకూ ఇబ్బంది ఉండదు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details