వాట్సాప్ ద్వారా యూపీఐ పేమెంట్స్(Whatsapp Payment India) చేసే సౌలభ్యం ఇది వరకే అందుబాటులోకి వచ్చింది. అయితే.. ఇప్పుడు ఈ సౌకర్యాన్ని మరింత సులభతరం చేసింది వాట్సాప్. ఇంతకుముందు ఎవరికైనా వాట్సాప్ ద్వారా పేమెంట్(Whatsapp Payment India) చేయాలంటే సంబంధిత ఛాట్‌లోకి వెళ్లి.. పిన్ సింబల్ క్లిక్ చేసి పేమెంట్స్‌లోకి వెళ్లాల్సి వచ్చేది.
ఇకపై ఛాట్ కంపోజర్‌లోనే రూపీ సింబల్‌ను క్లిక్ చేయడం ద్వారా పేమెంట్స్‌ను పూర్తి చేయొచ్చని వాట్సాప్ తెలిపింది. అంతేకాకుండా వాట్సాప్‌లో కెమెరాను ఉపయోగించి ఇకపై క్యూఆర్ కోడ్లను కూడా స్కాన్ చేయొచ్చని పేర్కొంది. ఈ మేరకు వాట్సాప్ ఇండియా డైరెక్టర్ మనేశ్ మహాత్మే ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
"రోజూ వాట్సాప్ యూజర్లు వందలాది సందేశాలు పంపుకుంటున్నట్లే.. సులువుగా పేమెంట్లు చేసేందుకు వీలుగా రూపీ సింబల్‌ను యాడ్ చేశాం. త్వరలో అందరికీ ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది."
-మనేశ్ మహాత్మే, వాట్సాప్ ఇండియా డైరెక్టర్