సాధారణంగా యాప్‌ల వల్ల యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగినా.. దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ప్రభుత్వం భావించినా వాటిపై పాక్షికంగా లేదా పూర్తిగా నిషేధం విధించొచ్చు. ఇప్పటికే ఈ తరహా పద్ధతులను అమెరికా, ఇండోనేసియా, బంగ్లాదేశ్, చైనా వంటి దేశాలు అవలంబించాయి. తాజాగా భారత్ కూడా చైనాకు చెందిన 59 యాప్‌లపై వేటు వేసింది. ఫలితంగా ప్లేస్టోర్, యాపిల్ స్టోర్లలో ఈ జాబితాలోని యాప్‌లు అందుబాటులో ఉండవు. మరి ఇప్పటికే ఇన్స్టాల్ చేసుకున్న యూజర్లకు కంపెనీలు సేవలు అందిస్తాయా? నిషేధం ఎలా అమలవుతుంది? కంపెనీలు మూతపడటమేనా? అనేది చర్చనీయాంశంగా మారింది.
ఇలా అమలు...
నిషేధిత జాబితాలోని యాప్‌లను యాక్సెస్ చేసే అవకాశాన్ని నిలిపేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది. ఇంటర్నెట్ అవసరం లేని క్యామ్‌స్కానర్‌లాంటి యాప్‌లు ఇప్పటికే డౌన్‌లోడ్ అయి ఉంటే పని చేసే అవకాశం ఉంది. అయితే కొత్తగా వాటిని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉండదు. ఇప్పటికే డౌన్‌లోడ్ అయి ఉన్నా.. ఇంటర్నెట్ అవసరమయ్యే టిక్‌టాక్, హలో, యూసీ న్యూస్ వంటి యాప్‌లు పని చేయవు.
మరిన్ని పెరిగే అవకాశం...
ఇప్పటికే 59 యాప్‌లపై నిషేధం విధించిన భారత ప్రభుత్వం.. మరికొన్నింటిపై సమీక్ష జరుపుతోంది. మరిన్ని యాప్‌లు నిషేధిత జాబితాలో చేరతాయని సమాచారం. ప్రభుత్వం నిషేధం అమలుపై ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు ఇచ్చిన తర్వాత రోజు నుంచి యాప్ డేటాను నిలిపివేస్తారు. వాటిని గూగుల్ ప్లే స్టోర్, ఐ స్టోర్‌లోనూ తొలగిస్తారు. అప్డేట్ ఆప్షన్ కూడా ఉండదు. ఫలితంగా కొత్త ఫీడ్ చూడలేరు. యాప్ ఫోన్లో ఉన్నంతవరకు పాత వీడియోలు కనిపిస్తాయి.
ఈ దేశాలు నిషేధం...
టిక్‌టాక్.. పిల్లల్లో లైంగిక హింసను ప్రేరేపిస్తోందని గతంలో అమెరికాలో కేసు నమోదైంది. అందులో 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల ఖాతా గురించి పలు ప్రశ్నలు అడిగింది న్యాయస్థానం. అయితే వాటిలో లోపాలు గమనించిన కోర్టు.. 2019 ఫిబ్రవరిలో టిక్‌టాక్‌కు 5.7 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. అగ్రరాజ్యంతో పాటు ఇండోనేసియా కొన్నిరోజులు, బంగ్లాదేశ్‌లో పూర్తిగా టిక్‌టాక్‌ను బ్యాన్ చేశారు.