ప్రస్తుతం వానాకాలం కొనసాగుతోంది. వర్షాలు తరచుగా కురుస్తున్నాయి. వరద ప్రవాహంతో సమస్యలు తలెత్తుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ సమస్య ఉన్నప్పటికీ.. నగరాల్లో చాలా ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంది. హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో వరద, లోతట్టు ప్రాంతాల్లో ముప్పు అధికం. దీనితో ఇంటి ముందు పార్క్ చేసిన కార్లు నీటిలో తేలిపోతాయి. కొన్ని మునిగిపోతాయి(Flood damage vehicles). సెల్లార్లోకి నీరు ప్రవేశిస్తే అవి కూడా మునిగిపోతాయి. అంతే కాకుండా బురద వల్ల మట్టిలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది. సాధారణంగానే ఎక్కువ ఖర్చు పెట్టి కొన్న వాహనం రిపేరుకు కూడా కొన్ని సార్లు ఎక్కువ వెచ్చించాల్సి రావొచ్చు. వరదల సమయంలో నీట మునిగిన వాహనాలకు డ్యామేజీ ఎక్కువగానే అవుతుంటుంది. ఇంజిన్ పాడైపోతే జేబుకు చిల్లు పడాల్సిందే. దీన్ని నివారించేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వాహన నిపుణులు చెబుతున్నారు.
స్టార్ట్ చేయొద్దు..
పార్క్ చేసి ఉన్న వాహనం నీట మునిగినట్లయితే ఇంజిన్లోకి నీరు(Flood-damaged vehicles problems) ప్రవేశించదు. ఒకవేళ దాన్ని స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించినట్లయితే ఇంజిన్లోకి నీరు చేరుతుంది. దానివల్ల ఇంజిన్ డ్యామేజీ అవుతుంది. దీన్నే హైడ్రో స్టాటిక్ లాక్ అంటారు. ఇలాంటపుడు చాలా ఎక్కువ మొత్తం ఇంజిన్ రిపేరుకు భరించాల్సి ఉంటుంది. కాబట్టి నీట మునిగిన వాహనాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేయొద్దు. నీట మునిగిన వాహనాన్ని గ్యారేజీకి తరలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
రోడ్డుపై పారే వరద నీటిలో ప్రయాణం చేసినట్లయితే కారు డ్యామేజీ అయ్యే ఆస్కారం ఉంది. ఎక్కువ దూరం ప్రయాణించినట్లయితే హైడ్రో స్టాటిక్ లాక్ అవ్వొచ్చు అని వాహన సర్వీస్ సెంటర్ ప్రతినిధులు చెబుతున్నారు. వాహనం నీటి గుండా పోతున్నప్పుడు ఆగిపోయినట్లయితే... స్టార్ట్ చేసేందుకు ఎక్కువ సార్లు ప్రయత్నించొద్దని వారు సూచిస్తున్నారు. ఈ సందర్భాల్లో కూడా వాహనాన్ని పక్కకు తీసి.. గ్యారేజీకి తరలించాలని చెబుతున్నారు.
నీట మునిగినట్లయితే కారులో విడిభాగాలు డ్యామేజీ అవుతాయి. దీనితో పాటు ఎలక్ట్రికల్స్ పాడవుతాయి. వీటికి సంబంధించిన రిపేరును తప్పించే ఆస్కారం లేదు. కానీ భారం పడకుండా.. బీమాను ఉపయోగించుకోవచ్చు. ఇందులో కూడా పూర్తిగా కవరేజీని ఇచ్చే విధంగా పాలసీ ఎంచుకోవాలని కోరుతున్నారు.