ఉల్లి... కిలో ధర రూ.100 దాటిపోవడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దేశమంతటా, మన పొరుగు దేశాల్లోనూ సమస్య ఇలాగే ఉంది. ఈ సంక్షోభం ఎందుకొచ్చింది? ఉల్లి ధర ఎందుకిలా భయపెడుతోంది? ప్రభుత్వం ఏం చేస్తోంది.
దేశంలో ఉల్లి సాగు ఇలా...
దేశంలో ఏటా 1.20 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో ఉల్లి వేస్తున్నారు. హెక్టారుకు 16 టన్నుల చొప్పున సరాసరిన 19.40 మిలియన్ టన్నుల దిగుబడి వస్తోంది. దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణలలో అత్యధికంగా ఉల్లి సాగవుతోంది. ఒక్క మహారాష్ట్రలోనే ప్రస్తుత ఖరీఫ్‌లో 76,279 హెక్టార్లలో వేశారు. కర్నూలు మార్కెట్‌లో సోమవారం క్వింటా గరిష్ఠంగా రూ.10,150 పలికింది.
సమస్య ఎందుకొచ్చింది?
ఉల్లి సాగు రాష్ట్రాల్లో వర్షాకాలంలో భారీ నుంచి అతిభారీ వానలు కురిశాయి. సాధారణ పరిస్థితితో పోలిస్తే మహారాష్ట్రలో ఒకటిన్నర రెట్లు, గుజరాత్‌లో రెండు రెట్లు, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో 70 శాతం, తెలంగాణలో 65 శాతం అధికంగా నమోదయ్యాయి. దాంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ అతివృష్ఠి కారణంగా మహారాష్ట్రలోని చాలాచోట్ల రైతులు తమ పొలాల్లో రెండుసార్లు విత్తనాలు వేయాల్సి వచ్చింది. కాస్త ఆలస్యంగా సాగుచేసిన చోట్ల పంట బతికినా ఉల్లిగడ్డ ఊరడంలేదు. సాధారణంగా అక్టోబరు మొదటి వారం నుంచి మార్కెట్‌లోకి రావాల్సిన దిగుబడి ఇంకా పొలంలోనే ఉంది. అదే సమయంలో గిరాకీ పెరిగి ధరలు అమాంతం వృద్ధి చెందాయి.
ప్రభుత్వం ఏం చేస్తోంది?
మన దేశం ఈ నవంబరు మొదటి వారం వరకు రూ.3,467 కోట్ల విలువైన ఉల్లిని ఎగుమతి చేసింది. తాజా సమస్య కారణంగా దేశీయ అవసరాలు తీర్చి, ధరల్ని నియంత్రించడానికి జనవరి వరకు ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. దీంతో మనపై ఆధారపడిన దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఎగుమతి చేయకపోగా.. ఇప్పుడు మనమే దిగుమతి చేసుకుంటున్నాం. అఫ్గానిస్థాన్, టర్కీ, ఇరాన్, ఈజిప్టు దేశాల నుంచి లక్ష టన్నులను కొంటున్నాం.
చుట్టుపక్కల దేశాల్లో పరిస్థితి
- బంగ్లాదేశ్: తమ వంటల్లో ఉల్లి వాడకాన్ని ఆదేశ ప్రధాని నిషేధించారు. భారత్ నుంచి ఎగుమతులు ఆగిపోవడంతో కిలో ధర 30 బంగ్లా టాకా(రూ.25) నుంచి ఏకంగా 260 టాకా(రూ.218)లకు చేరింది.
- మయన్మార్: గత ఏడాది గరిష్ఠంగా ఒక విస(1.6 కిలోలు) ఉల్లి ధర 450 క్యాట్‌లు ఉండేది. ప్రస్తుతం అది 850 క్యాట్లకు చేరింది. ఒక క్యాట్... భారత రూపాయికి 0.47 తో సమానం.
- నేపాల్: నేపాల్‌లో కిలో ఉల్లి 150 ఎన్‌ఆర్‌గా ఉంది. నవంబరులో ఇది 100 ఎన్‌ఆర్‌లు పలకడం గమనార్హం. దాంతో భారత్ సరిహద్దులో ఉన్న బిహార్ నుంచి ఉల్లి స్మగ్లింగ్ పెరిగింది. ఒక నేపాలీసీ రూపాయి.. భారత రూపాయికి 0.62తో సమానం.
- పాకిస్థాన్‌లో కిలో మధ్య రకం ఉల్లి ధర 70పీఆర్ పలుకుతోంది. ధరను కట్టడి చేయడానికి ప్రభుత్వం తంటాలు పడుతోంది. ఒక పాకిస్థానీ రూపాయి.. భారత రూపాయికి 0.46తో సమానం.
- శ్రీలంకలోనూ ధర మండిపోతోంది. అక్కడ కిలో ధర 158 ఎస్‌ఎల్‌ఆర్(రూ.62)గా పలుకుతోంది. నిరుడు 95 ఎస్‌ఎల్‌ఆర్‌గా ఉండేది.
వినియోగం ఇదీ...
జనం కంట కన్నీరు! ఎందుకీ ఉల్లికిపాటు? దేశంలో ప్రతి పౌరుడు ఏటా సగటున 19 కిలోల వరకు ఉల్లిని వినియోగిస్తున్నాడు.
ఇదీ చూడండి:భాజపా ఎంపీల గైర్హాజరుపై మోదీ అసంతృప్తి: రాజ్‌నాథ్