తెలంగాణ

telangana

ETV Bharat / business

What is Bitcoin: కొత్త బిట్​కాయిన్లను సృష్టించడం ఎలా? - what is cryptocurrency

What is Bitcoin: అది 19వ శతాబ్దం. లక్షలాది మంది కెనడాలోని క్లోండిక్‌ దిశగా సాగిపోయారు. ఎందుకో తెలుసా? బంగారాన్ని తవ్వుకోవటానికి. 'గోల్డ్‌ రష్‌'గా పేరొందిన అలనాటి పరుగులో కొందరిని అదృష్టం వరిస్తే, కొందరికి నిరాశే మిగిలింది. ఇప్పుడూ అలాంటి తవ్వకమే మొదలైంది. అయితే ఈసారి పలుగు, పారలతో కాదు. కంప్యూటర్‌తో! బంగారం కోసం కాదు. అంతకన్నా విలువైన క్రిప్టోకరెన్సీ కోసం! అదే 'క్రిప్టో మైనింగ్‌'. తొలి క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ 2009లో వెలుగులోకి వచ్చినప్పట్నుంచే ఇది ఆరంభమైంది.

what is cryptocurrency
What is Bitcoin

By

Published : Dec 8, 2021, 8:59 AM IST

Bitcoin news:క్రిప్టోకరెన్సీ అనగానే బిట్‌కాయినే గుర్తుకొస్తుంది. ఇది అంతగా ప్రాచుర్యం పొందింది మరి. అతి పెద్దది, విలువైంది కూడా. నిజానికి ఒక్క బిట్‌కాయినే కాదు.. ప్రస్తుతం 5వేలకు పైగా క్రిప్టోకరెన్సీలున్నాయి. వీటికోసమే ఎంతోమంది మైనర్లు రాత్రీ పగలు తేడా లేకుండా నిరంతరం శోధిస్తున్నారు.

What is cryptocurrency:

క్రిప్టోకరెన్సీ అంటే కాల్పనిక (వర్చువల్‌) ధనం. మామూలు డబ్బులా బయట చలామణి అయ్యేది కాదు. ప్రభుత్వాలు, బ్యాంకుల నియంత్రణలో ఉండేదీ కాదు. బ్లాక్‌ చెయిన్‌ పరిజ్ఞానం ఆధారంగా పనిచేస్తుంది. సమాచారాన్ని నమోదు చేసుకునే కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ (డేటాబేస్‌) లాంటి వర్చువల్‌ లెడ్జర్‌లో ఇది నిల్వ ఉంటుంది. కాల్పనిక ప్రపంచంలో క్రిప్టోకరెన్సీ ఒకరి నుంచి మరొకరికి చేరుతున్నప్పుడు.. అంటే బిట్‌కాయిన్‌తో ఏదైనా కొంటున్నప్పుడు.. ఆ లావాదేవీని రహస్యలిపి (క్రిప్టోగ్రఫీ) ద్వారా నోడ్స్‌ నెట్‌వర్క్‌ ధ్రువీకరిస్తుంది. ఇతర లావాదేవీలతో కలిసి కొత్త శాఖ (బ్లాక్‌) ఏర్పడుతుంది. ఇది డిస్ట్రిబ్యూటర్‌ లెడ్జర్‌లో (బ్లాక్‌ చెయిన్‌లో) నమోదు అవుతుంది. అప్పటికే ఉన్న బ్లాక్‌ చెయిన్‌కు కొత్త బ్లాక్‌లు వచ్చి జతకూడతాయి. లావాదేవీ పూర్తవుతుంది. ఇలా వాస్తవ ప్రపంచంలో మాదిరిగా క్రిప్టోతో వస్తువులు, సేవలు కొనుక్కోవచ్చు. ఒకసారి బ్లాక్‌ చెయిన్‌లో నమోదైన సమాచారాన్ని (విలువ, తేదీ, సమయం వంటివి) మార్చటం చాలా కష్టం. ఇదే క్రిప్టోకరెన్సీకి ఎనలేని విశ్వసనీయతను తెచ్చిపెడుతోంది. విలువను సంపాదించి పెడుతోంది. ఆన్‌లైన్‌ కరెన్సీ ఎక్స్ఛేంజీలో క్రిప్టోకరెన్సీని కొనుక్కోవచ్చు. అమ్మి సొమ్ము చేసుకోవచ్చు.

Cryptocurrency Bitcoin:

Bitcoin price today:

How to buy Bitcoin:

బిట్​కాయిన్ కొనేందుకు చాలా కారణాలే ఉన్నాయి. బిట్‌కాయిన్‌ ఎవరికీ పూర్తిగా సొంతం కాదు. కాబట్టి ఇది ఎవరిదనేది తెలుసుకోవటానికి వీలుండదు. వాడుకోవటం తేలిక. ఆన్‌లైన్‌లో కొనేవారు, అమ్మేవారి మధ్య వెంటనే బదిలీ అవుతుంది. వడ్దీశాతం పెంచటం, తగ్గించటం వంటి చర్యలతో వివిధ దేశాల కరెన్సీల మాదిరిగా దీని విలువ మారదు. గిరాకీ, లభ్యతను బట్టే విలువ మారుతుంది. ఇలాంటి కారణాలన్నీ బిట్‌కాయిన్‌ను కొనటానికి దారితీస్తున్నాయి. టెక్నాలజీ ప్రియులకు, కాల్పనిక ప్రపంచంలో క్రయవిక్రయాలు చేసేవారినిది ఎంతగానో ఆకట్టుకుంటోంది. మెటావర్స్‌ వంటి కాల్పనిక ప్రపంచాల యుగం పురుడు పోసుకుంటున్న తరుణంలో మున్ముందు ఇంకా ప్రాచుర్యం పొందనుందని భావిస్తున్నారు. అక్కడ మామూలు డబ్బులను వాడుకోవటానికి వీలుండదు మరి.

How to create bitcoin?

బిట్‌కాయిన్‌ తవ్వకం.. అదే మైనింగ్‌ ప్రక్రియ ద్వారా కొత్త బిట్‌కాయిన్లను సృష్టిస్తుంటారు. ఒక నెట్‌వర్క్‌లో ఉన్న కంప్యూటర్లు ఆయా లావాదేవీలను తనిఖీ చేసి, ధ్రువీకరించినప్పుడు కొత్త బిట్‌కాయిన్లు పుట్టుకొస్తాయి. ఇదో సంక్లిష్టమైన కంప్యూటింగ్‌ ప్రక్రియ. బ్లాక్‌చెయిన్‌కు కొత్తగా అనుసంధానమయ్యే బ్లాక్స్‌తో ముడిపడి ఉంటుంది. కొత్త బ్లాక్స్‌ను సృష్టించటం అంత తేలికైన పనికాదు. ముందుగా అతి కష్టమైన లెక్కలను పరిష్కరించాల్సి ఉంటుంది (హ్యాషెస్‌). లెక్కను విజయవంతంగా సాధించినవారికి (మైనర్లకు) రెండు రకాల బహుమతులు లభిస్తాయి. ఒకటి బ్లాక్‌ రివార్డు. ఇది బ్లాక్‌ను పబ్లిష్‌ చేసిన ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. ఒకరకంగా దీన్ని ప్రశంసలాంటిదని చెప్పుకోవచ్చు. రెండో బహుమానం లావాదేవీ రుసుము. ఆయా లావాదేవీలు నిర్వహించేవారు బిట్‌కాయిన్‌లో కొంత భాగాన్ని రుసుముగా చెల్లిస్తారు. అంటే లావాదేవిని నమోదు చేయటానికి చేసే చెల్లింపు అన్నమాట. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బిట్‌కాయిన్లన్నీ ఇలా సృష్టించినవే. ఇవి పరిమిత సంఖ్యలో ఉండటం వల్ల విలువా ఎక్కువే.

bitcoin mining environmental impact

బిట్‌కాయిన్లను వెలికి తీసే ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటం, రోజురోజుకీ వీటి విలువ పెరుగుతుండటం వల్ల వెలికి తీయటానికీ ఎంతోమంది ముందుకొస్తున్నారు. కానీ దీంతో పర్యావరణానికి హని కలిగే ప్రమాదం లేకపోలేదు. బిట్‌కాయిన్లను వెలికి తీయటానికి చాలా విద్యుత్తు అవసరం. ఇది పర్యావరణంపై విపరీత ప్రభావం చూపుతుంది. అందుకే ఇటీవల చైనా వీటి మైనింగ్‌ను, ట్రేడింగ్‌ను నిలిపేసింది. ఫలితంగా బిట్‌కాయిన్‌ మైనింగ్‌ అమెరికా వంటి దేశాలకు మళ్లుతోంది.

bitcoin mining equipment

మొదట్లో మామూలు డెస్క్‌టాప్‌లతోనే బిట్‌కాయిన్లను వెలికి తీసేవారు. కానీ అది చాలా నెమ్మదిగా సాగేది. ఇప్పుడు ప్రత్యేకమైన కంప్యూటర్‌ వ్యవస్థ (మైనింగ్‌ రిగ్‌) ద్వారా వీటిని సృష్టిస్తున్నారు. గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌, అప్లికేషన్‌ స్పెసిఫిక్‌ ఇంటిగ్రేటెడ్‌ చిప్‌తో కూడిన అధునాతన కంప్యూటర్లను దీనికి వాడుతున్నారు. ప్రస్తుతం బిట్‌కాయిన్‌ మైనింగ్‌ను పెద్ద వ్యవస్థలే నిర్వహిస్తున్నాయి. అతిపెద్ద బిట్‌కాయిన్‌ మైనింగ్‌ రిగ్‌లో సుమారు రూ.2,258 కోట్ల విలువైన ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌ కంప్యూటర్లు ఉన్నాయని అంచనా.

ABOUT THE AUTHOR

...view details