Health Insurance Bonus: పాలసీ ఏడాదిలో ఎలాంటి క్లెయిం చేసుకోనప్పుడు బీమా సంస్థలు తమ పాలసీదారులకు కొన్ని ప్రయోజనాలను అందించేందుకు ప్రయత్నిస్తాయి. ఇందులో క్యుములేటివ్ బోనస్ ఒకటి. వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు రెండింటికీ ఇది వర్తిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే.. బీమా సంస్థ మీ పాలసీ విలువను పెంచడమే బోనస్ అన్నమాట. దీనికోసం ఎలాంటి ప్రీమియం అదనంగా చెల్లించక్కర్లేదు.
ఉదాహరణకు మీరు రూ.10లక్షల విలువైన పాలసీ తీసుకున్నారనుకుందాం.. క్లెయిం చేసుకోని ఏడాదికి మీ బీమా సంస్థ 5శాతం బోనస్ ఇస్తుందనుకుందాం. అప్పుడు మీ పాలసీ విలువ రూ.10,50,000 అవుతుంది. రెండో ఏడాదీ ఎలాంటి క్లెయిం లేకపోతే.. పాలసీ విలువ రూ.11లక్షలకు చేరుతుంది. పాలసీ విలువ పెరిగేందుకు ఒక స్థిరమైన శ్లాబు విధానం ఏదీ ఉండదు. పైగా ఇది బీమా సంస్థలను బట్టి, మారుతుంది. ప్రస్తుతం కొన్ని బీమా సంస్థలు అందించే ఆరోగ్య బీమా పాలసీల్లో 150-200 శాతం వరకూ బీమా పాలసీ విలువను బోనస్‌గా అందిస్తున్నాయి.
cumulative bonus in health insurance
క్యుములేటివ్ బోనస్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పాలసీ ఏడాదిలో ఒక క్లెయిం చేశారనుకోండి.. మొత్తం బోనస్ తగ్గించరు. బోనస్‌ను అందించిన నిష్పత్తిలోనే దానిని తగ్గిస్తారు. ఉదాహరణకు మీ బీమా సంస్థ క్లెయిం చేయని సంవత్సరానికి 10 శాతం బోనస్ ఇస్తుందనుకుందాం. వరుసగా అయిదేళ్ల పాటు మీరు ఎలాంటి క్లెయిం చేయలేదు. అప్పుడు మీ పాలసీ విలువ 50 శాతం పెరుగుతుంది. ఆరో ఏట క్లెయిం చేసినప్పుడు మీ పాలసీ మొత్తం విలువ 10 శాతం మేరకే తగ్గుతుంది. మీరు రూ.10లక్షల పాలసీ తీసుకున్నారనుకుంటే.. అయిదేళ్లపాటు క్లెయిం చేసుకోకపోతే అప్పుడు పాలసీ రూ.15,00,000 అవుతుంది. ఇప్పుడు క్లెయిం చేసుకున్నా.. బీమా సంస్థ 10 శాతం మొత్తాన్నే తగ్గిస్తుంది. అంటే, మీ పాలసీ విలువ రూ.14,00,000 అవుతుందన్నమాట.