తెలంగాణ

telangana

ETV Bharat / business

అన్నదాతకు అప్పుల మోత.. భరోసా ఏదీ? - eenadu editirial

దేశానికి రైతే రాజు అనేది నానుడి. నిజానికి మాత్రం కర్షకుడు ఏటా అప్పుల ఊబిలోనే చిక్కుకుపోతున్నాడు. 130 కోట్ల మంది జనాభా కలిగిన భారత్​లో దాదాపు 87 కోట్ల ప్రజలు ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. దేశంలో ఉత్పత్తయ్యే మొత్తం ఆహారధాన్యాల్లో సగానికి పైగా ఈ చిన్న రైతుల శ్రమఫలమే. 2022-23 నాటికి అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని సంకల్పించింది కేంద్రం. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే మాత్రం కేంద్రం ఆశయం నెరవేరే సూచనలు కానరావడం లేదు. ఆశయ సాధనకు తాజా బడ్జెట్‌లో 16 అంశాల ప్రణాళికను కేంద్రం ప్రకటించింది. కానీ, ఏ ఒక్కదానికీ దీటైన కేటాయింపులు చేయలేదు.

What are the ways to show income to the farmer?
అన్నదాత అప్పుల మోత.. ఆదాయాన్ని మార్గాలు ఏవీ?

By

Published : Mar 9, 2020, 9:28 AM IST

దేశవ్యాప్తంగా వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. హరిత విప్లవ ప్రయోగంతో భారీస్థాయిలో విజయవంతమైన దేశ వ్యవసాయరంగం, నేడు కష్టాల కడలిలో ఈదుతోంది. దేశ ఆర్థికవ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నెముక వంటిది. దేశంలో నివసిస్తున్న 130కోట్ల మంది ప్రజల్లో దాదాపు 87కోట్లు ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చేనాటికి స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 55శాతం ఉన్న వ్యవసాయరంగం వాటా నేడు 13శాతానికి దిగజారింది. నేటికీ దేశంలో 85శాతానికి పైగా సన్న చిన్నకారు రైతులే ఉన్నారు. దేశంలో ఉత్పత్తయ్యే మొత్తం ఆహారధాన్యాల్లో సగానికి పైగా ఈ చిన్న రైతుల శ్రమఫలమే. ఆహార భద్రత కల్పించడంలో, ఎగుమతుల ద్వారా విదేశ మారక ద్రవ్య ఆర్జనలో, పరిశ్రమలకు ముడిపదార్థాలు సమకూర్చడంలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠపరచడంలో వ్యవసాయ రంగానిదే కీలక పాత్ర. అలాంటి సేద్య రంగం నేడు పలుసమస్యలతో అన్నదాతల జీవితాన్ని ఛిద్రం చేస్తోంది.

2023 నాటికి రెట్టింపు...

ఇంతటి విపత్కర సమయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్నదాతల ఆదాయాన్ని 2022-23 నాటికి రెట్టింపు చేయాలని సంకల్పించింది. అందుకోసం ఏడు అంశాల వ్యూహాన్ని రూపొందించింది. అశోక్‌ దల్వాయి నేతృత్వంలో కమిటీని నియమించింది. 2015-16లో నమోదైన రైతుల వార్షికాదాయం రూ.96,703ను 2022-23నాటికి రూ.1,92,694గా పెంచడమే లక్ష్యంగా కమిటీ విధివిధానాలను రూపొందించుకుంది. రైతుల వాస్తవాదాయం రెట్టింపు కావాలంటే రానున్న రెండేళ్లలో ఏటా వృద్ధిరేటు 15శాతం ఉండాలని కమిటీ సూచించింది. దీన్నిబట్టి రానున్న రెండేళ్లు కేంద్రానికి సవాలుగానే పరిగణించాలి. గత నాలుగేళ్లుగా దేశంలో వర్షపాతం ఆశాజనకంగా లేకపోవడంతో కేంద్రం ఆశయం నెరవేరే సూచనలు కానరావడం లేదు. ఆశయ సాధనకు తాజా బడ్జెట్‌లో 16 అంశాల ప్రణాళికను కేంద్రం ప్రకటించింది. కానీ, ఏ ఒక్కదానికీ దీటైన కేటాయింపులు చేయలేదు.

కేటాయింపుల్లో కోత...

సంక్లిష్ట సమయంలో వ్యవసాయరంగానికి, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్‌లో గతంకన్నా అధిక నిధులు కేటాయిస్తారని అందరూ భావించారు. 2020-21 బడ్జెట్‌ తీరు అందుకు భిన్న దృశ్యాన్ని ఆవిష్కరించింది. రైతుల ఆదాయాన్ని పెంచే పథకాలైన కనీస మద్దతు ధర, పీఎం కిసాన్‌ వంటి ప్రత్యక్ష నగదు బదిలీ పథకానికి బడ్జెట్‌లో నిధులు భారీగా పెంచుతారని భావించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు కావాలంటే అదనంగా రూ.6.4లక్షల కోట్లు కావాలని కమిటీ సూచించింది. కానీ, రైతులకు ఉపకరించే పలు పథకాలకు నిధుల కేటాయింపు పెంచకపోగా తగ్గించడం ఆశ్చర్యకరం. ఉదాహరణకు వ్యవసాయం- దాని అనుబంధ రంగాలు, ఇరిగేషన్‌ పద్దు కింద రూ.1.58లక్షల కోట్లు మాత్రమే కేటాయించారు. నిరుడు ఇది రూ.1.52లక్షల కోట్లు. అంటే పెంపుదల ఆరు లక్షల కోట్లు మాత్రమే. ఇలాంటి అరకొర పెంపుదలతో రైతు ఆదాయం రెట్టింపు కాదన్నది నిష్ఠుర సత్యం. దీనికి గ్రామీణఅభివృద్ధికి కేటాయించిన నిధులు కలిపితే ఆ మొత్తం రూ.2.83లక్షల కోట్లు అవుతుంది. మొత్తం బడ్జెట్‌ రూ.30.4లక్షల కోట్లలో ఇది 9.3శాతమే. అయితే 2019-20 బడ్జెట్‌ మొత్తం కేటాయింపులో ఇది 9.83శాతం. అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థల మెరుగుదలకు కేంద్రం 0.5శాతం మేర నిధులు తగ్గించిందని అర్థమవుతుంది.

పీఎం కిసాన్‌ ...

పీఎం కిసాన్‌ కింద గత ఏడాది రూ.75 వేలకోట్లు కేటాయించి 8.46కోట్ల కుటుంబాలకు రూ.42,440కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈసారి బడ్జెట్‌లోనూ మళ్ళీ 75వేల కోట్లే కేటాయించారు. దేశవ్యాప్తంగా సుమారు 14.5కోట్ల మంది రైతులున్నారు. ఒక్కొక్కరికి రూ.6,000 చొప్పున రూ.87వేల కోట్లు ఉండాలి. త్వరగా చెడిపోయే వస్తువుల విషయంలో రైతులు నష్టపోకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకు ‘మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌’ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. మద్దతు ధర పథకమూ ఉంది. ఈ రెండింటికీ నిరుడు రూ.3,000కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది రూ.వెయ్యి కోట్లు కోత పెట్టి, రూ.2,000కోట్లతో సరిపెట్టారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.3,000కోట్లు ఇందుకు కేటాయించడం గమనార్హం. పప్పు ధాన్యాలు, నూనె గింజలు పండించే కర్షకులకు 2018లో ప్రవేశపెట్టిన పీఎం ఆషా పథకానికి కేటాయింపులు రూ.500కోట్లకు కుదించడం పేద రైతులపట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. అలాగే 2019లో వృద్ధ, సన్నకారు, చిన్నకారు రైతులకు ఉద్దేశించిన పీఎం కిసాన్‌ మాస్‌-ధన్‌ యోజన పథకానికీ రూ.680కోట్ల మేర కోత పడింది. పది వేల రైతు ఉత్పత్తిదారుల సంస్థల ఏర్పాటుకు, వాటి అభివృద్ధికి కేవలం రూ.500కోట్లు ఇవ్వడం ఆశ్చర్యకరం. పాల ఉత్పత్తిని 2025నాటికి రెట్టింపు చేయాలని ప్రణాళిక పేర్కొంది. పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే అగ్రస్థానంలో నిలిచింది.

పాల ఉత్పత్తులు రెట్టింపు దిశగా...

దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల కుటుంబాలు ఈ వృత్తిలో ఉన్నాయి. వీటిలో అత్యధికం పేదరికంలో మగ్గుతున్నవే. ఈ రంగానికి కేవలం రూ.60కోట్లు మాత్రమే కేటాయించారు. పశువుల ఆరోగ్య సంరక్షణ ఖర్చులకు, పశుగ్రాసం కొనుగోలుకు ఈ మొత్తం ఎంతమాత్రం చాలదు. పాల ఉత్పత్తిని రెట్టింపు చేయడం దాదాపు అసాధ్యం. ఎరువుల రాయితీలపై 11శాతం, ఉపాధి హామీ పథకం కింద 15శాతం కోత విధించారు. రైతుల నుంచి ధాన్యసేకరణ ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తున్న భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి కేటాయింపులూ తగ్గిపోయాయి. నిరుడు రూ1,84,220కోట్లు ఇవ్వగా, ఈసారి అది రూ.1,08,688కోట్లకే పరిమితమైంది. అంటే రూ.76,532 కోట్ల మేర కోత పడిందన్నమాట. దీనివల్ల రైతులు తమ మిగిలిన ధాన్యాన్ని ప్రైవేటు వర్తకులకు, మిల్లర్లకు తక్కువ ధరలకు అమ్మవలసిన దుస్థితి ఏర్పడుతోంది. చాలా పంటలకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతుధర కన్నా మార్కెట్‌ ధరలు చాలా తక్కువగా ఉండటం రైతులు నష్టపోవడానికి కారణమవుతోంది. కోట్ల మంది గ్రామీణులకు కూలీలకు ఆసరాగా ఉన్న ఉపాధి హామీ పథకానికీ కేటాయింపులు రూ.71,000కోట్ల నుంచి రూ.61,500కోట్లకు పడిపోయాయి. కార్పొరేట్‌ సంస్థలకు నిరుడు రూ.1.45లక్షల కోట్ల ఆదాయ పన్ను రాయితీలు ప్రకటించడమే కాకుండా 2014-15 నుంచి గల రూ. 6.6 లక్షల కోట్ల పారుబాకీలను కేంద్రం రద్దు చేసింది. రైతులకు మాత్రం కేంద్ర రాష్ట్ర స్థాయుల్లో కేవలం రూ.1.5లక్షల కోట్ల రుణాలనే మాఫీ చేశారు.

ధరలపై దృష్టి పెట్టాలి...

రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలోనూ లక్షల కోట్ల రూపాయల మేర రుణాల మాఫీ జరుగుతోంది. ఇన్ని చేసినా రైతుల జీవితాల్లో వెలుగు కనిపించకపోగా వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోవడాన్ని కేంద్రం తీవ్రంగా తీసుకోవాలి. సమస్యల పరిష్కారానికి అన్నదాతలు రోడ్లెక్కుతున్నారు. రైతుల ద్రవ్య ఆదాయం రెట్టింపు అయినంతమాత్రాన వారి జీవితాలు మెరుగుపడవు. వారి వాస్తవాదాయం రెట్టింపు కావాలి. ద్రవ్య ఆదాయం రెట్టింపుతోపాటు నిత్యావసర వస్తువులు, ఎరువులు, పురుగుమందులు, కూలి రేట్లు రెట్టింపు అవుతుంటే రైతులకు వచ్చే లాభమేమీ ఉండదు. వాస్తవాదాయం తగ్గి, ద్రవ్య ఆదాయం పెరిగినా సుఖం లేదు. పెరిగిన ద్రవ్య ఆదాయాన్ని వాస్తవ ఆదాయస్థాయికి తీసుకురావాలి. రైతుకు పంట తక్కువ పండినా నష్టమే, ఎక్కువ పండినా నష్టమే. ఎక్కువగా పంట పండినప్పుడు విపణిలోకి సరకు సరఫరా పెరగడం వల్ల గిరాకీ-సరఫరా సిద్ధాంతం వల్ల ధర పతనమవుతుంది. త్వరగా చెడిపోయే పంటలకు అయితే ఈ ప్రమాదం మరింత ఎక్కువ.

అప్పుడు గత్యంతరం లేని స్థితిలో తక్కువ ధరకే రైతు శ్రమఫలాన్ని తెగనమ్ముకోవాలి. పాలు, ఉల్లి, చేపలు, టమేటా, కూరగాయలు ఈ కోవకు వస్తాయి. శీతల గిడ్డంగులు విస్తారంగా ఏర్పాటు చేయడమే దీనికి పరిష్కార మార్గం. విమానాల ద్వారా కార్గో రవాణా సదుపాయాల కల్పన అన్నదాతలకు అక్కరకు వచ్చేదే. దళారులు, వడ్డీవ్యాపారులను రైతులు ఆశ్రయించకుండా చూడాలి. తక్కువ వడ్డీకి రుణసదుపాయం కల్పించాలి. ఒకవైపు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెబుతున్న కేంద్రం, మరోవైపు ఫసల్‌ బీమాలో తన ప్రీమియం వాటాను భారీగా తగ్గించడం, ఆ మొత్తాన్ని రైతులే భరించాలనడం శోచనీయం. ఇలాంటి పోకడలవల్ల రైతు ఆదాయం రెట్టింపు చేయాలనే స్వప్నం సాకారం కాదన్న నిజాన్ని కేంద్రం గ్రహించాలి.

అన్నదాత అప్పుల మోత

అనువైన పంటల ఎంపికే కీలకం...

మన దేశంలో అనేకానేక రకాల పంటలు పండించడానికి అనువైన, వైవిధ్యభరితమైన ప్రాంతాలు, వాతావరణ స్థితిగతులు ఉన్నాయి. అనువైన పంటలను వేయడం వల్ల రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ విషయంలో శాస్త్రవేత్తల సలహాలు రైతులకు అందజేయాలి. నిధుల కేటాయింపుల్లో కోత సంగతెలా ఉన్నా, రైతు ఆదాయం రెట్టింపు చేయడానికి కేంద్రం పలుచర్యలు చేపట్టింది. 2014-19 మధ్యకాలంలో 40.45లక్షల హెక్టార్ల భూమిని ‘మైక్రో ఇరిగేషన్‌’ పరిధిలోకి అదనంగా తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 585 మండీలను జాతీయ వ్యవసాయ విపణి (ఇ-నామ్‌) ద్వారా ఒకే గొడుగు కిందకు తెచ్చింది. స్థానిక విపణులు (గ్రామీణ్‌ హాట్స్‌), రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు ఊతమివ్వడం, కనీస మద్దతు ధరను 50శాతం లాభం వచ్చేలా నిర్ణయించడం, పప్పు ధాన్యాలు, నూనె గింజల సేకరణ రాశిని పెంచడం, 22.07కోట్ల భూసారం కార్డుల పంపిణీ వంటివి ఇందుకు కొన్ని ఉదాహరణలు. ఈ కార్డులవల్ల ఎనిమిది నుంచి పది శాతం వ్యయం రైతులకు ఆదా అయింది. అధిక ఉత్పత్తి సాధ్యపడింది. రైతులకు తక్కువ ప్రీమియంతో ఫసల్‌ బీమా యోజన ప్రవేశపెట్టడం, వ్యవసాయ రుణాలు పెంచడం, కిసాన్‌ క్రెడిట్‌ కార్డులపరిధి విస్తరణ, తాజాగా పీఎం కిసాన్‌ పేరిట ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టడం- ఇవన్నీ రైతుల ఆదాయం పెంపుదలకు ఉద్దేశించినవే.

-కేతిరెడ్డి కరుణానిధి (రచయిత- అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో వాణిజ్య విభాగ ఆచార్యులు)

ABOUT THE AUTHOR

...view details