ఎయిర్ ఇండియా పగ్గాలు మళ్లీ టాటా సన్స్ చేతికి వెళ్లడాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్వాగతించారు. ఈ విమానయాన సంస్థ నుంచి ప్రభుత్వం పెట్టుబడులు ఉపసంహరించుకోవడంతో భారత్‌లో వ్యాపార వాతావరణం పునర్‌వైభవాన్ని సంతరించుకోనుందని అభిప్రాయపడ్డారు. అప్పుల్లో కూరుకుపోయిన ఈ సంస్థను ప్రభుత్వం వదులుకోవడమే కాకుండా.. ప్రైవేటు రంగంపై ఉన్న విశ్వాసాన్ని పునరుద్ధరిస్తోందని వ్యాఖ్యానించారు.
"ఈ టేకోవర్ ప్రాముఖ్యతపై నేను చేసే వ్యాఖ్యలు కొంచెం అతిశయోక్తిగా అనిపించొచ్చు. ఈ పెట్టుబడుల ఉపసంహరణ వల్ల భారత వ్యాపార వాతావరణానికి ప్రభుత్వం పునర్‌వైభవం తీసుకొస్తోందని నేను భావిస్తున్నాను. అప్పుల్లో కూరుకుపోయిన సంస్థను ప్రభుత్వం వదులుకుంటోంది. అంతేకాదు, దశాబ్దాల తర్వాత ప్రైవేటురంగ సామర్థ్యంపై ఉన్న విశ్వాసాన్ని పునరుద్ధరిస్తోంది"