తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనాతో ఐటీ కంపెనీలకు కొత్త చిక్కులు..! - భారత్​లో ఐటీ కంపెనీ

ప్రపంచ దేశాలతో పాటు భారత్​లోనూ కరోనా వేగంగా విస్తరిస్తున్న సంకేతాలతో ఐటీ రంగం ఆందోళనకు గురవుతోంది. తాజాగా హైదరాబాద్​కు చెందిన ఓ ఐటీ కంపెనీ ఉద్యోగికి కరోనా సోకిన లక్షణాలు కనిపించటం వల్ల స్థానిక ఐటీ రంగం ఉల్కికిపడింది. ఈ నేపథ్యంలో ఐటీ కార్యకలాపాలపై మాత్రం దీని ప్రభావం పడుతోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

What about onsite projects?
ఆన్‌సైట్‌ ప్రాజెక్టుల సంగతేంటి?

By

Published : Mar 5, 2020, 9:20 AM IST

ఇన్నాళ్లూ చైనా, దక్షిణ కొరియా, ఇటలీకే పరిమితమైన కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) ఇప్పుడు అటు అమెరికా, ఇటు మనదేశంలో విస్తరిస్తున్న సంకేతాలతో ఐటీ రంగం ఆందోళనకు గురవుతోంది. మనదేశంలో బెంగుళూరు, పుణే ముంబయి, చెన్నై, ఎన్‌సీఆర్‌, హైదరాబాద్‌ ప్రధాన ఐటీ కేంద్రాలనే విషయం తెలిసిందే. తాజాగా అటు దిల్లీలో, ఇటు హైదరాబాద్‌లో కొన్ని కరోనా వైరస్‌ కేసులు వెలుగు చూడటం, హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌ అయిన మాదాపూర్‌ ప్రాంతంలోని ఐటీ కంపెనీ ఉద్యోగి ఒకరికి కరోనా వైరస్‌ సోకిన లక్షణాలు కనిపించటంతో ఒక్కసారిగా స్థానిక ఐటీ రంగం ఉలిక్కిపడింది. ఏ ఇద్దరు ఐటీ ఉద్యోగులు కలిసినా దీనిపైనే చర్చించుకోవటం కనిపించింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, హార్డ్‌వేర్‌ పార్క్‌, ఉప్పల్‌, పోచారం ప్రాంతాల్లోని ఐటీ, ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ తయారీ కంపెనీల యాజమాన్యాలు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యాయి. ఐటీ కంపెనీల్లోని పని స్థలాల్లోనే కాకుండా క్యాంటిన్‌, ఇతర ప్రదేశాల్లో పూర్తి పరిశుభ్రతను పాటిస్తున్నారు.

శానిటైజర్లు, మాస్క్‌లు, చేతి గ్లౌజులు అందుబాటులో పెట్టారు. ఉద్యోగుల్లో ఎవరికైనా ఏమాత్రం జలుబు- దగ్గు, జ్వర లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స చేయించేందుకు పంపుతున్నారు. ఉద్యోగులకు ‘వర్క్‌ ప్రమ్‌ హోమ్‌’ సదుపాయాన్ని కల్పించేందుకు కూడా సిద్దపడుతున్నాయి. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు అడిగితే ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతి ఇస్తున్నాయి. ఇప్పటికి అయితే ఇబ్బందుల లేవు కానీ ఐటీ కార్యకలాపాలపై మాత్రం దీని ప్రభావం పడుతోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మనదేశంలోని ఐటీ కంపెనీలు అత్యధికంగా యూఎస్‌లోని క్లయింట్లకు ప్రాజెక్టులు నిర్వహిస్తుంటాయి. ఆయా ప్రాజెక్టుల పనుల మీద ఇతర దేశాలకు వెళ్లటం, అక్కడి నుంచి సంబంధిత కంపెనీల ప్రతినిధులు ఇక్కడకు రావటం సర్వసాధారణంగా జరిగేదే.

అంతేగాక కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ‘ఇంప్లిమెంటేషన్‌’ పనులను క్లయింట్ల వద్దే నిర్వహించాలి. ‘ఆన్‌సైట్‌’ ప్రాజెక్టులని పేర్కొనే ఇటువంటి పనుల కోసం విదేశాలకు ఇక్కడి కంపెనీల ప్రతినిధులు వెళ్లాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర దేశాలకు రాకపోకలు నిలిచిపోయి ‘ఆన్‌సైట్‌’ ప్రాజెక్టులు సకాలంలో పూర్తికాని పరిస్థితులు ఏర్పడతాయని ఐటీ కంపెనీల ప్రతినిధులు కొందరు అభిప్రాయపడుతున్నారు. దాదాపు వచ్చే రెండు నెలల పాటు ఎక్కడికీ కదల్లేని పరిస్థితులు ఉన్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఉద్యోగులను కొంతకాలం పాటు ఇతర ప్రాంతాలకు పంపకపోవటమే మేలని ప్రభుత్వం కూడా ఐటీ కంపెనీలకు సూచిస్తోంది. దీని ప్రభావం ప్రాజెక్టులపై పడుతుందని అంటున్నారు. అదే సమయంలో కొత్త కాంట్రాక్టులు కుదుర్చుకోవటం, కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టటం కూడా మందగిస్తుందని పేర్కొంటున్నారు.

కరోనా వైరస్‌ సమస్య అగ్ర రాజ్యమైన అమెరికాతో సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నందున ప్రాజెక్టులు పూర్తి చేయటంలో కొంత జాప్యం జరిగినప్పటికీ విదేశీ క్లయింట్లు ఆ జాప్యాన్ని ఆమోదించే పరిస్థితి ఉన్నట్లు స్ధానిక ఐటీ కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. కానీ అదే సమయంలో కొంత కాలం పాటు కొత్త కాంట్రాక్టులు కుదుర్చుకోలేని పరిస్థితి ఉండవచ్చని అన్నారు. అదేవిధంగా క్లయింట్లతో సమావేశాలు, మార్కెటింగ్‌ కార్యక్రమాలు కూడా నిలిచిపోతాయనే ఆందోళన వెలిబుచ్చారు.

ABOUT THE AUTHOR

...view details