తెలంగాణ

telangana

ETV Bharat / business

సిరి: సంపద సృష్టికి మార్కెట్ మార్గం! - వాణిజ్య సలహాలు

మార్కెట్​లో అవకాశాలను ఏ మేరకు మనం వినియోగించుకుంటున్నామనే విషయమే సంపద సృష్టికి కీలకాంశం. సంపద సృష్టి ఒక్క రోజులో సాధ్యమయ్యే పని కాదు. క్రమశిక్షణ, దీర్ఘకాలిక పెట్టుబడులను కొనసాగించాలని యూటీఐ మ్యూచువల్ ఫండ్​ ఎగ్జిక్యూటివ్​ వైస్ ప్రెసిడెంట్​ లలిత్​ నంబియార్ చెబుతున్నారు. ఆయన చెప్పిన మరిన్ని విషయాలు మీకోసం..

siri
సిరి

By

Published : Feb 19, 2020, 1:18 PM IST

Updated : Mar 1, 2020, 8:11 PM IST

మార్కెట్‌ ఎప్పుడూ అవకాశాలను ఇస్తూనే ఉంటుంది. దానిని మనం ఏ మేరకు అందిపుచ్చుకున్నామనే అంశమే కీలకం. సంపద సృష్టించాలంటే ఒక్క రోజులో సాధ్యం కాదు.. దానికి క్రమశిక్షణతో పాటు దీర్ఘకాలిక పెట్టుబడులను కొనసాగించాలి’అని అంటున్నారు యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ లలిత్‌ నంబియార్‌. ప్రస్తుత మార్కెట్‌ పనితీరు, మున్ముందు ఎలా ఉండబోతోంది? మదుపరులు పాటించాల్సిన జాగ్రత్తలేమిటి అనే విషయాలను ఆయన ఇలా వివరిస్తున్నారు...

ప్రస్తుతం మార్కెట్లు ఎలా స్పందిస్తున్నాయి?

మార్కెట్లు జీవన కాల గరిష్ఠ స్థాయులను చేరుకుంటున్నాయి. రానున్న ఆరు నెలల కాలాన్ని కీలకంగా చూడొచ్చు. వస్తు, సేవల పన్ను అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. ఏయే కంపెనీలు ఎలాంటి లాభాలు పొందుతాయి.. వేటిపై ఎక్కువ ప్రభావం ఉంటుందిలాంటివి ఇప్పుడు గమనించాల్సిన విషయాలు. ఈ నేపథ్యంలో మార్కెట్లు స్థిరంగానే ఉన్నప్పటికీ.. కంపెనీలను విడివిడిగా గమనించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి, నేరుగా షేర్లలో మదుపు చేసే వారు ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.

గతంతో పోలిస్తే చిన్న మదుపరులు మార్కెట్‌పై దృష్టి సారిస్తున్నారా? మ్యూచువల్‌ ఫండ్లపై ఆసక్తి చూపిస్తున్నారా?

బంగారం, స్థిరాస్తి రంగాల్లో అంతగా వృద్ధి కనిపించకపోవడంతో చాలామంది మార్కెట్‌ పెట్టుబడులపై ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ చిన్న మదుపరులు క్రమానుగత పెట్టుబడి విధానంలో అధికంగా మదుపు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మ్యూచువల్‌ ఫండ్లకు వస్తున్న పెట్టుబడులు పెరిగాయి. అధిక ఆదాయం ఉన్నవారు ఈక్విటీ పెట్టుబడులతోపాటు, ఇతర పెట్టుబడి మార్గాలవైపూ చూస్తున్నారు.

పెట్టుబడులతో ధనవంతులుగా మారాలని ఆలోచిస్తూ.. చాలామంది స్వల్పకాలిక పెట్టుబడుల వైపు మొగ్గు చూపిస్తుంటారు కదా! ఇది సాధ్యమవుతుందా?

సంపద సృష్టించాలంటే ఒక్క రోజులో సాధ్యం కాదు. ప్రపంచంలో ఏ ధనవంతుడిని తీసుకున్నా.. వారంతా ఏళ్ల తరబడి కృషి చేసిన వారే. కొంతమంది సొంతంగా వ్యాపారం చేస్తారు.. అలా వీలు కాని వారు.. ఆయా వ్యాపారాల్లో భాగస్వామ్యం తీసుకుంటారు. దీనికి ఈక్విటీలో పెట్టుబడులు ఒక మార్గం. అంటే, సంపద పెరగాలంటే.. వృద్ధి చెందే వ్యాపారాల్లో భాగస్వామ్యం తీసుకోవాలి. కేవలం లాటరీ తగిలిన వారు మాత్రమే రాత్రికి రాత్రి సంపన్నులు అవుతారు. అయితే, ఇది అందరికీ సాధ్యం కాదు కదా!

మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు మంచి సమయం కోసం వేచి చూస్తుంటారు చాలామంది? అసలు ఏది సరైన సమయం?

స్టాక్‌ మార్కెట్ల గమనాన్ని వూహించడం అసాధ్యం. మ్యూచువల్‌ ఫండ్లలో.. క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేసేవారు.. ఎప్పుడూ మార్కెట్లో కొనసాగేందుకే ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేకానీ, మార్కెట్‌ బాగుంది.. బాగాలేదనే లెక్కలు అనవసరమనే చెప్పాలి. పెట్టుబడి వృద్ధి చెందాలంటే.. అన్ని సమయాల్లోనూ మార్కెట్లో ఉన్నామా? లేదా అనేదే కీలకం. సొంతంగా మదుపు చేసే వారు అనేక అంశాలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ఫండ్‌ మేనేజర్లు నిరంతరం మార్కెట్‌ను పర్యవేక్షిస్తుంటారు. కాబట్టి, సొంతంగా మదుపు చేసుకునే వారితో పోలిస్తే.. నిపుణుల పర్యవేక్షణలో ఉండే మ్యూచువల్‌ ఫండ్లలో నష్టభయం కాస్త తక్కువగా ఉంటుంది. కనీసం 5-6ఏళ్లు ఎదురుచూస్తేనే మంచి రాబడులు వస్తాయి.

మార్కెట్లు రానున్న రెండేళ్లలో ఎలా ఉండబోతున్నాయి?

ప్రస్తుతం మార్కెట్‌కు అనేక సానుకూల అంశాలున్నాయి. అందువల్ల భారత ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెరిగింది. అంతర్జాతీయ పరిణామాల వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తే తప్ప.. దేశీయంగా ఎలాంటి ప్రతికూలతలూ కనిపించడం లేదు. రానున్న ఏడాదిన్నర కాలం పెట్టుబడులు పెట్టే వారికి కీలకం. ఈ దశలో మదుపు చేసిన వారు ఏడెనిమిదేళ్ల వరకూ మంచి ఫలితాలు అందుకుంటారని చెప్పవచ్చు.

Last Updated : Mar 1, 2020, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details