Wealth Creation Tips: నేడు పొదుపు చేస్తే, రేపటి రోజున అనుకోకుండా సంపాదన ఆగిపోతే.. ఆ డబ్బు ఉపయోగపడుతుంది అని చాలా మంది పొదుపు చేసేవారు. ఇది నిజమే. కానీ ప్రస్తుతం యువత ఆలోచనా ధోరణి మారింది. అత్యవసర పరిస్థితులు, పదవీవిరమణ వంటి వాటి కోసం డబ్బు ఆదా చేయాలి అనే రోజులు పోయాయి. ఆర్థిక స్వాతంత్ర్యం, సంపద సృష్టిపై దృష్టి పెడుతున్నారు. ఈ రెండు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక స్వాతంత్ర్యం భవిష్యత్తులో సంపద ఆర్జనకు సహాయపడుతుంది.
ఆర్థిక స్వాతంత్య్రం ఉంటే అవసరమైనప్పుడు ఒకరిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అయితే, సంపద సృష్టికి ఆర్థిక స్వాతంత్ర్యం ఒక్కటే సరిపోదు. సంపాదన కంటే ఖర్చులు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఖర్చుల కంటే పొదుపు ఎక్కువగా ఉండాలి. ఇలా పొదుపు చేసిన మొత్తాన్ని ఒక ప్రణాళిక ప్రకారం మదుపు చేయాలి. ఒకవేళ పొదుపు తక్కువగా ఉంటే సంపద సృష్టి సాధ్యం కాదా? అంటే సాధ్యమే అంటున్నారు నిపుణులు.
ఆర్థిక విషయాలలో రాణించాలంటే మానసిక ప్రశాంత చాలా అవసరం. పొదుపు టార్గెట్‌ను చేరుకునేందుకు తప్పనిసరి ఖర్చులను విస్మరించడం సరికాదు. దీని వల్ల ఒత్తిడి పెరగొచ్చు. డబ్బును చిన్న చిన్న మొత్తాలలో దీర్ఘకాలం పాటు నిలకడగా ఆదా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు అధిగమించడంతో పాటు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పొదుపు అలవాటు రెగ్యులర్ సేవింగ్స్ అవసరాన్ని తెలియజేయడంతో పాటు, కంఫర్ట్ జోన్‌లో ఉంటూనే అనవసరమైన ఖర్చులను నివారించడంలో సహాయపడుతుంది.
పొదుపు చేసేటప్పుడు డబ్బును లిక్విడ్ అసెట్స్ రూపంలో సురక్షిత పథకాలలో ఉంచినప్పటికీ, సంపద సృష్టికి మాత్రం పెట్టుబడులు పెట్టాలి. స్టాక్స్, రియల్ ఎస్టేట్, ఇతర స్థిర ఆస్తుల కొనుగోలు అనేది దీర్ఘకాల ప్రక్రియ. ఈ తరహా పెట్టుబడుల కోసం మెరుగైన దీర్ఘకాలిక ప్రణాళిక, వివిధ రకాల పెట్టుబడి మార్గాలపై అవగాహన అవసరం. కానీ పొదుపును మాత్రం నెలవారి బడ్జెట్‌ను అంచనా వేయడం, ఖర్చులను తగ్గించడం, పొదుపు లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం, ఆర్థిక ప్రాధాన్యతలను నిర్ణయించడం, వృద్ధిని ట్రాక్ చేయడంతో సులభంగా ప్రారంభించవచ్చు.
ఇందుకోసం మీకు ఏయే మార్గాల నుంచి ఆదాయం వస్తుందో అంచనా వేయండి. తప్పనిసరి నెలవారి ఖర్చులు ఇంటి అద్దె, నిత్యవసర వస్తువులు, వైద్య ఖర్చులు వంటి వాటికి కావలసిన నిధులను ప్రక్కన పెట్టండి. తప్పనిసరి కానీ ఇతర ఖర్చులు.. విహారయాత్రలు, సినిమాలు, రిసార్టెంట్ వంటి వాటికి కోసం కొంత మొత్తాన్ని తీసి మిగిలిన మొత్తాన్ని పొదుపు కోసం కూడబెట్టాలి.