జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వేగన్ 2016లో డీజిల్ గేట్ కుంభకోణం బయటకు వచ్చినప్పటి నుంచి సుమారు 9.5 బిలియన్ డాలర్లను డ్రైవర్లకు పరిహారంగా చెల్లించిందని యుఎస్ ఫెడరల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
2015లో ఈ సంస్థ తయారు చేసిన ఇంజిన్ల నుంచి ఉద్గారాలు తక్కువగా వస్తున్నట్లు మభ్యపెట్టామని అంగీకరించింది. అప్పట్లో దీనిని డీజిల్‌గేట్ కుంభకోణంగా అభివర్ణించారు.
ఈ కుంభకోణం బయటకు వచ్చాక ఫోక్స్‌వేగన్ ప్రతిష్ఠ మసకబారింది. దీంతో అప్పట్లో ఈ సంస్థ వినియోగదారులను కార్లు వాపస్ ఇవ్వవచ్చని.. లేకపోతే సంస్థ వాటిలో ఉచితంగా నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసి ఇస్తుందని పేర్కొంది. దీనిలో 86శాతం మంది వినియోగదారులు బైబ్యాక్ ఆఫర్‌ను ఎంచుకొన్నట్లు ది ఫెడరల్ ట్రేడ్ కమిషన్ పేర్కొంది. అంతేకాదు చాలా కేసుల్లో ఫోక్స్‌వేగన్ ఒప్పందాలు చేసుకోవాల్సి వచ్చింది. ఈ మొత్తం కుంభకోణంలో ఫోక్స్‌వేగన్ దాదాపు 35 బిలియన్ డాలర్ల వరకు చెల్లించాల్సి రావచ్చని అంచనావేస్తున్నారు. వీటిల్లో ఇప్పటికే అమెరికాలో 9.5 బిలియన్ డాలర్లను చెల్లించింది.
ఇదీ చూడండి'ప్రపంచంలో అత్యుత్తమ పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానం'