రుణ సంక్షోభంతో సతమతమవుతున్న వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) లిమిటెడ్ (వీఐఎల్) సెప్టెంబరు త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.7,144.60 కోట్ల నికర నష్టాన్ని(Vodafone Idea Results) ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసిక నష్టం రూ.7,218.20 కోట్లతో పోలిస్తే ఈసారి స్వల్పంగా తగ్గింది. ఏకీకృత ఆదాయమూ రూ.10,791.20 కోట్ల నుంచి 13 శాతం తగ్గి రూ.9,406.40 కోట్లకు చేరింది. సమీక్షా త్రైమాసికంలో ప్రీపెయిడ్ ప్రారంభ పథకం ధరను దశలవారీగా రూ.49 నుంచి రూ.79కు కంపెనీ(Vodafone Idea) పెంచింది. కొన్ని పోస్ట్ పెయిడ్ పథకాల టారిఫ్‌లనూ పెంచింది. త్రైమాసికం చివర్లో ప్రభుత్వ ఉద్దీపన పథకం ప్రకటించినందున, ఆ ప్రభావం కంపెనీ ఆర్థిక ఫలితాలపై కనిపించలేదు.
- ఏడాది వ్యవధిలో చందాదార్ల సంఖ్య 27.18 కోట్ల నుంచి 25.18 కోట్లకు తగ్గింది.
- ఏప్రిల్- జూన్‌తో పోలిస్తే 4జీ చందాదార్లు 33 లక్షల పెరిగి 11.62 కోట్లకు చేరారు.
- డేటా సగటు వినియోగం నెలకు 11.8 జీబీ నుంచి 27.1 శాతం పెరిగి 14.5 జీబీకి చేరింది.
- ఒక్కో వినియోగదారుపై సగటు ఆర్జన (ఆర్పు) రూ.119 నుంచి రూ.109కి తగ్గింది. అయితే ఏప్రిల్- జూన్‌తో పోలిస్తే పెరిగింది.
- 2021 సెప్టెంబరు 30 నాటికి వొడాఫోన్ ఐడియా స్థూల రుణాలు రూ.1,94,780 కోట్లుగా (అద్దె బకాయిలు, వడ్డీలు మినహా) ఉన్నాయి.