తెలంగాణ

telangana

ETV Bharat / business

Ganesh Chaturthi: వినాయకుడి ఆర్థిక పాఠాలు.. తెలుసుకుందామా? - వినాయక చవితి తెలుగు

వినాయక చవితి(Ganesh Chaturthi 2021) అంటే అందరికీ ఇష్టమే. మండపాలు కట్టి ఊరేగించినా.. ఇంట్లో పెట్టుకుని పూజించినా.. గణేశుడిపై నమ్మకం ఉంచితే ఏ విఘ్నాలు కలగకుండా మనల్ని కాపాడతాడనేది భక్తుల విశ్వాసం. అంతేకాదు.. వినాయకుడి నుంచి మనం తెలుసుకోవాల్సిన ఎన్నో ఆర్థిక పాఠాలూ ఉన్నాయి.

lord ganesha
lord ganesha

By

Published : Sep 10, 2021, 7:20 AM IST

గణపతి... ఆదిదంపతుల తనయుడైన వినాయకుణ్ని (Ganesh Chaturthi 2021) సర్వ విఘ్నాలను తొలగించే స్వామిగా ప్రతి కార్య ఆరంభంలోనూ పూజించుకోవడం సంప్రదాయం. మరి ఆదిదేవుడు చెప్పే ఆర్థిక పాఠాలను తెలుసుకుందామా?

ఎలుక..ఏనుగు: వినాయకుడి వాహనం ఎలుక. ఏనుగు తల ఉన్న ఆ గణపతి ఎందుకు అంత చిన్న ఎలుక మీద పయనిస్తాడు? అది వినయానికి సూచిక.. జీవితంలో అత్యంత విలువైన పాఠం అది. జీవితం చాలా సరళంగా ఉంటూనే.. ఆలోచనలు లోతుగా ఉండాలని మనకు వినాయకుడు చెప్పకనే చెబుతాడు.

మన వ్యయాలతో పోలిస్తే..మన పొదుపు చాలా ఎక్కువగా ఉండాలని పరోక్షంగా మనకు పాఠాలు చెబుతాడాయన. కచ్చితంగా మీ బడ్జెట్‌ ఎంతో తెలుసుకోండి. దానికే కట్టుబడి ఉండండి. మీ అవసరాలకు తగ్గట్లుగా ఖర్చు చేస్తూ భవిష్యత్‌ కోసం పెట్టుబడులు పెట్టండి. అంతే తప్ప అప్పుల వలలో పడకండి.

పెద్ద తల.. పెద్ద ఆలోచనలు

వినాకుడిది పెద్ద ఏనుగు తల. దాని కథ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన తల ఆలోచనలు, విజ్ఞానం, దూరదృష్టికి నిదర్శనమని తెలుసుకోవాలి.

కొంత మంది పెట్టుబడుదార్లు.. తమను తాము ఆర్థిక నిపుణులుగా భావిస్తుంటారు. మార్కెట్లు బాగా పెరిగాయనో లేదా తగ్గాయనో ఉన్నదంతా ఊడ్చి పెట్టుబడులు పెడుతుంటారు. సొంత పద్ధతులు పాటిస్తుంటారు. స్టాక్‌ మార్కెట్‌ను అంచనా వేయడం ఎవరి తరమూ కాదు. అందుకే మార్కెట్‌ చలనాలతో సంబంధం లేకుండా క్రమంగా మదుపు చేస్తుంటే నష్టభయం తగ్గుతుందని అర్థం చేసుకోవాలి. దీర్ఘకాలం అనేది ఒక మంత్రం కావాలి.

చెవులారా వినండి..

గజకర్ణుడు తనకున్న పెద్ద చెవుల ద్వారా మనకు మరో విషయం చెబుతుంటాడు. ఎవరు చెప్పినా శ్రద్ధగా వినాలని.

మంచి మదుపరి చెవులు పెద్దవి చేసి మరీ నిపుణుల సలహాలను వినాలి. ఆర్థిక విషయాలపై కుటుంబ సభ్యులు చెప్పేదీ ఆలకించాలి. వినడం నేర్చుకుంటే మార్కెట్‌ వార్తలకు ఎలా స్పందించాలో తెలుస్తుంది. అంతర్జాతీయ సంక్షోభాలు, కరోనా ప్రభావాలు, ప్రభుత్వ విధానాలు.. ఇలా అన్నిటికీ మార్కెట్‌ ఎలా చలిస్తుందో తెలుస్తుంది. గత పనితీరును బట్టి ఇప్పటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. వైవిధ్యీకరణను పాటించండి. ఇందుకు మీ రిస్క్‌ ప్రొఫైల్‌ ఎలా ఉందో ముందు తెలుసుకోవాలి.

లంబోదరుడు... జీర్ణించుకోవాలి మరి..

ఎటువంటిదైనా సరే.. లంబోదరుడి బొజ్జలోకి వెళ్లిపోవాల్సిందే.. అరిగిపోవాల్సిందే. మార్పులను త్వరగా ఆకలింపు చేసుకోవాలని ఆయన మనకు చెప్పకనే చెబుతాడు.

మంచి పెట్టుబడుదారు కూడా తన బడ్జెట్‌లకు తగ్గట్లుగా పెట్టుబడులను పెంచుకుంటూ పోతాడు. అంతేకాదు క్రమం తప్పకుండా వాటిని పరిశీలిస్తుంటాడు. అపుడే ప్రయోజనాలు అందుతాయి. మీ పెట్టుబడులనేవి మీ లక్ష్యాల దిశగా వెళ్లట్లేదని గమనిస్తే.. వెంటనే మార్పు చేర్పులు చేయడానికి రంగంలోకి దిగాల్సిందే.

విఘ్నాలు తొలగాల్సిందే..

వినాయడిని విఘ్నేశ్వరుడంటారు. అంటే అన్ని విఘ్నాలను తొలగిస్తాడని.

మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మీ ఆర్థిక ప్రణాళికలకు కట్టుబడి ఉండండి. ఏది అత్యంత ముఖ్యం అని ఎపుడూ ప్రశ్నించుకోండి. గణేశుడిలాగే జీవితంలో అత్యంత ప్రాధాన్య విషయాలనే పట్టించుకోండి. అపుడు ఆ దారిలో వచ్చే అడ్డంకులతో పోరాడడానికి మీకు సరైన శక్తి అందుతుంది. ఒక్కోసారి జీవితం అనుకోని ఆశ్చర్యాలను ఇస్తుంటుంది. కాబట్టి అందుకు తగ్గట్లుగా అత్యవసర నిధిని ఉంచుకోండి. మీ కుటుంబాన్ని ఆర్థికంగా భద్రంగా ఉంచడానికి.. సరైన బీమాను ముందే చేయించండి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details