తెలంగాణ

telangana

ETV Bharat / business

కూరగాయలకూ డిజిటల్‌ చెల్లింపులే - UPI payment precautions

కరోనా నేపథ్యంలో కరెన్సీ నోట్లకు చెక్​పెట్టి డిజిటల్​ చెల్లింపులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కూరగాయలు, ఇతర నిత్యావసరాల కొనుగోలుతో సహా అన్ని డిజిటల్​ లావాదేవీలే. అయితే ఈ చెల్లింపులు మరింత సురక్షితంగా సాగేందుకు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామంటున్నారు ఎన్‌పీసీఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ దిలీప్‌ ఆస్బే.

NPCI MD DILEEP ASBEY
కూరగాయలకూ డిజిటల్‌ చెల్లింపులే

By

Published : Apr 24, 2020, 7:55 AM IST

'కరోనా వైరస్‌(కొవిడ్‌-19) లాక్‌డౌన్‌ వల్ల కూరగాయలు, ఇతర నిత్యావసరాల కొనుగోలులో డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బ్యాంకులు, మొబైల్‌ వాలెట్‌ సంస్థలన్నీ యూపీఐ ఆధారిత చెల్లింపులను విస్తృతంగా అందుబాటులోకి తేవడం ఇందుకు ప్రధాన కారణం. ఇక చిల్లర సమస్యే లేకపోవడం అనుకూలించే అంశం. వేరే ప్రాంతాల్లో ఉండిపోయిన సన్నిహితులకు నగదు బదిలీకీ, బాధితులకు విరాళాలు అందించేందుకూ డిజిటల్‌ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కొత్తగా అనేక మంది ఈ వేదికలను వినియోగించుకుంటున్నారు' అని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ దిలీప్‌ ఆస్బే తెలిపారు. డిజిటల్‌ చెల్లింపులు మరింత సురక్షితంగా సాగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ముఖ్యాంశాలివీ..

  • కొవిడ్‌-19 నేపథ్యంలో డిజిటల్‌ లావాదేవీలు పెరిగాయా?

2019 మొదటి మూడు నెలలతో పోలిస్తే ఈసారి జనవరి-మార్చిలో డిజిటల్‌ లావాదేవీల సంఖ్య, నగదు పరిమాణం దాదాపు రెట్టింపయ్యాయి.. 2019 జనవరిలో రూ.1,09,932 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,06,737 కోట్లు, మార్చిలో రూ.1,33,460 కోట్ల విలువైన డిజిటల్‌ చెల్లింపులు జరిగాయి. అదే ఈ ఏడాది జనవరిలో రూ. 2,16,243 కోట్లు, ఫిబ్రవరిలో రూ.2,22,517 కోట్లు, మార్చిలో రూ.2,06,462 కోట్ల విలువైన నగదు డిజిటల్‌ రూపంలో చేతులు మారింది. మరింత బాగా వినియోగించుకునేందుకు ఇంకొంత సమయం పడుతుంది.

  • డిజిటల్‌ చెల్లింపులు ఇంత బాగా పెరిగేందుకు ఏయే అంశాలు కారణమయ్యాయి?

అత్యవసరాలు, నిత్యావసరాలు విక్రయించే వారితోపాటు, కొనుగోలుదారులూ డిజిటల్‌ చెల్లింపు వేదికలను వినియోగించుకోవాలని ఎన్‌పీసీఐ సూచిస్తూనే ఉంది. యూపీఐ చెల్లింపులు స్వీకరించేందుకు అవసరమైన నమోదు ప్రక్రియనూ సులభతరం చేశాం. డిజిటల్‌ చెల్లింపుల్లో ఉన్న ప్రయోజనాలు, సౌకర్యాలను చాలామంది గుర్తించారు. నిత్యావసరాల కొనుగోలులో డిజిటల్‌ చెల్లింపులు అధికంగా జరుగుతున్నాయి. నగదు తీసుకోవడం కన్నా డిజిటల్‌ చెల్లింపులే క్షేమమని వ్యాపారులూ భావిస్తున్నారు. పెరుగుతున్న లావాదేవీల సంఖ్యను తట్టుకునేందుకు వీలుగా మేమూ తగిన ఏర్పాట్లు చేసుకున్నాం.

  • గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్‌ చెల్లింపుల పరిస్థితి ఏమిటి?

గ్రామాల్లోనూ డిజిటల్‌ చెల్లింపులు, స్వీకరణల వినియోగం బాగా పెరిగింది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఇళ్లల్లో పనిచేసే వారికీ, చిన్న సంస్థల ఉద్యోగులకూ వారి యజమానులు డిజిటల్‌ రూపంలో చెల్లింపులు చేస్తున్నారు. ప్రభుత్వం అర్హులైన వారికి నగదు బదిలీ చేస్తున్న సందర్భంలో ఆధార్‌ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఏఈపీఎస్‌) ముఖ్యపాత్ర పోషిస్తోంది.

  • దేశ పౌరులంతా డిజిటల్‌ లావాదేవీలవైపు మళ్లేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? వారు సైబర్‌ మోసాలబారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

సామాజిక దూరం పాటించడం తప్పనిసరి కనుక సురక్షిత చెల్లింపులు చేసేందుకు ప్రజలను ప్రోత్సహిస్తున్నాం ‘యూపీఐ చలేగా’ పేరుతో ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాం. ఇప్పటికీ నగదు ఉపయోగిస్తున్న వారిని.. డిజిటల్‌ చెల్లింపులకు అలవాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. సులభంగా వినియోగించుకోవడంతో పాటు, ఇందులో ఉన్న లాభాలనూ తెలియజేస్తున్నాం. పలువురు ప్రముఖులతో దీనిపై ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రత్యేకంగా వెబ్‌సైటునూ అందుబాటులోకి తెచ్చి, దానిద్వారా సందేహాలు నివృత్తి చేస్తున్నాం. మోసాలబారిన పడకుండా ప్రతి ఒక్కరూ తమ యూపీఐ పిన్‌ రహస్యంగా ఉంచుకోవాలి. నమ్మకమైన యాప్‌లను మాత్రమే వినియోగించాలి. వీటిపైనా పలు వీడియోలను రూపొందించి, వాటి ద్వారా వినియోగదారులను చైతన్యపరుస్తున్నాం.

ఇదీ చదవండి:అదను చూసి రెచ్చిపోతున్న సైబర్‌ కేటుగాళ్లు!

ABOUT THE AUTHOR

...view details