తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెరికా జీడీపీ రికార్డు- క్యూ3లో 33.1 శాతం వృద్ధి

రెండో త్రైమాసికంలో 31.4 శాతం క్షీణించిన అమెరికా ఆర్థిక వ్యవస్థ.. ప్రస్తుతం పుంజుకుంది. మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 33.1 శాతంగా నమోదైందని ఆ దేశ వాణిజ్య శాఖ వెల్లడించింది. అయితే ఈ వృద్ధి వచ్చే ఏడాది మరింత పెరుగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఫలితాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు, సంపన్నులకే ఈ వృద్ధి ప్రయోజనకరంగా ఉందని డెమొక్రాటిక్ నేత జో బైడెన్ ఆరోపించారు.

us-gdp-grows-33-dot-1-percent-in-third-quarter-of-2020
అమెరికా జీడీపీ రికార్డు- క్యూ3లో 33.1 శాతం వృద్ధి

By

Published : Oct 30, 2020, 5:41 AM IST

అమెరికా ఆర్థిక వ్యవస్థ గణనీయంగా వృద్ధి చెందింది. కరోనా సంక్షోభంతో రెండో త్రైమాసికంలో 31.4 శాతం పడిపోయిన జీడీపీ వృద్ధి.. మూడో త్రైమాసికంలో రికార్డు స్థాయిలో పెరిగింది. ముందస్తు అంచనాల ప్రకారం క్యూ3లో వాస్తవ జీడీపీ 33.1 శాతం వృద్ధి నమోదు చేసిందని అమెరికా వాణిజ్య శాఖ విభాగం వెల్లడించింది. కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ కోలుకోవడాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని కోరుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ ఈ అంచనాలపై స్పందించారు. వాణిజ్య శాఖ ప్రకటించిన ఫలితాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

"జీడీపీ ఫలితాలు ఇప్పుడే వెలువడ్డాయి. ఈ సంఖ్య దేశ చరిత్రలోనే భారీది. వచ్చే ఏడాది మరింత అమోఘంగా ఉంటుంది. కానీ జో బైడెన్ పన్ను పెరుగుదల ప్రతిపాదన దీన్ని నాశనం చేస్తుంది. నవంబర్ 3కు ముందే జీడీపీ అంచనాలు వెలువడటం ఆనందం కలిగిస్తోంది."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

అయితే ఈ రికవరీ సంపన్నులకు మాత్రమే ప్రయోజనం కలిగిస్తోందని డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ ఆరోపించారు. లక్షల మంది శ్రామిక కుటుంబాలకు, చిన్న వ్యాపారాలకు ఇది ఏమాత్రం ఉపయోగపడదని విమర్శించారు. ఈ వృద్ధి రేటు ట్రంప్ వైఫల్యాల నుంచి బయటపడేందుకు సరిపోదని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details