Upcoming jobs in 2022: కరోనా సంక్షోభం తర్వాత వ్యాపార పునరుద్ధరణపై భారత కంపెనీలు ఆశాజనకంగా ఉన్నాయని ఓ ప్రముఖ సర్వే తెలిపింది. దాదాపు 49 శాతం కంపెనీలు జనవరి-మార్చి త్రైమాసికంలో భారీ ఎత్తున సిబ్బందిని నియమించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయని పేర్కొంది.
Corporate company jobs:
భారత్‌లో ప్రస్తుతం ఉన్న నియామక సెంటిమెంటు గత ఎనిమిదేళ్లలో ఎప్పుడూ కనిపించలేదని 'మ్యాన్‌పవర్ గ్రూప్ ఎంప్లాయిమెంట్ ఔట్‌లుక్' సర్వే తెలిపింది. క్రితం ఏడాదితో పోలిస్తే 43 శాతం అధికంగా నియామకాలు జరిగే అవకాశం ఉందని పేర్కొంది. సర్వేలో మొత్తం 3040 కంపెనీల యాజమాన్యాలు పాల్గొన్నాయి. దీంట్లో 64 శాతం కంపెనీలు తమ సిబ్బందిని పెంచుతామని తెలిపాయి. 15 శాతం తగ్గిస్తామని పేర్కొన్నాయి. మరో 20 శాతం మాత్రం సిబ్బంది సంఖ్యలో ఎలాంటి మార్పూ ఉండబోదని వెల్లడించాయి.
manpower survey report
భారత్‌లో వి-ఆకారపు పునరుద్ధరణ కనిపిస్తోందని 'మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా' ఎండీ సందీప్ గులాటీ తెలిపారు. కరోనా సంక్షోభం తర్వాత వ్యాపార కార్యలాపాల పునరుద్ధరణపై యాజమాన్యాలు విశ్వాసంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో పాటు 'గ్రేట్ రెసిగ్నేషన్' వంటి సంఘటనలు కూడా నియామక సెంటిమెంటు పెరుగుదలకు దోహదం చేస్తున్నట్లు తెలిపారు. అయితే, నైపుణ్యాల లేమి, కొత్త వేరియంట్ల ఆగమనం కొంత అడ్డంకి సృష్టించే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు.
Employment opportunities
పెద్ద కంపెనీల్లో 51 శాతం యాజమాన్యాలు తొలి త్రైమాసికంలోనే నియామకాలు చేపట్టడానికి సిద్ధంగా ఉండగా.. చిన్న కంపెనీల్లో 25 శాతం మాత్రమే నియామక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక 91 శాతం కంపెనీలు ఉద్యోగులకు రెండు డోసుల వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేయనున్నట్లు ప్రకటించాయి. అలాగే అందుకు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి.
అత్యధికంగా డిజిటల్ రంగంలో నియామకాలు జరిగే అవకాశం ఉందని సర్వే తెలిపింది. ఐటీ, టెక్నాలజీ, టెలికాం, కమ్యూనికేషన్స్, మీడియా రంగంలో అత్యధిక నియామకాలు జరగనున్నట్లు అంచనా వేసింది. తర్వాత రెస్టారెంట్లు, హోటళ్లు, బ్యాంకింగ్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉద్యోగ కల్పన ఉంటుందని వెల్లడించింది. ఇక చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోంతో పాటు కార్యాలయాలకు వచ్చి పనిచేసుకునే సదుపాయాన్ని కల్పించనున్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి:ధరెంతైనా తగ్గేదేలే..! జోర్దార్గా బీఎండబ్ల్యూ 'ఐఎక్స్' కొనుగోళ్లు