సర్టిఫికెట్లు, లైసెన్సులు, క్లియరెన్సుల జారీని తెలంగాణ ప్రభుత్వం వేగవంతంచేసిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ పేర్కొంది(Reduced burden of regulations in Telangana). దీనివల్ల వ్యాపారాల ప్రారంభం, నిర్వహణను సులభతరంగా మార్చినట్లు వెల్లడించింది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 22 వేల నిబంధనలను తొలగించినట్లు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌గోయల్ చెప్పారు (Union Minister Piyush Goyal). ‘‘మొత్తం 103 అపరాధాలను నేరాల పరిధిలోంచి తప్పించాం. 327 నిరుపయోగ నిబంధనలు, చట్టాలను రద్దుచేశాం. వ్యాపార యాజమాన్యాల విశ్వాసాన్ని పెంపొందించేందుకే నిబంధనల భారాన్ని తగ్గించాం’’ అని తెలిపారు. మంత్రి విడుదల చేసిన ‘ఏ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆన్ రిడక్షన్ ఆఫ్ కంప్లయన్స్ బర్డన్’ (A Progress Report on Reduction of Compliance Burden) నివేదిక ప్రకారం తెలంగాణలో సరళీకృత వ్యాపార వాతావరణాన్ని సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకొంది.
ముఖ్యాంశాలు ఇలా...
*వివిధ చట్టాల కింద ప్రభుత్వ సంస్థలు జారీచేసే ధ్రువీకరణ పత్రాలను భౌతిక రూపంలో చూపాల్సిన నిబంధనలను తొలగించారు. డిజిటల్ సర్టిఫికెట్లు చూపే వీలు కల్పించారు.
*18 రిజిష్టర్లు, రికార్డుల నిబంధలను సరళీకృతంచేసి వాటిని ఎలక్ట్రానిక్ రూపంలో నిర్వహించడానికి అనుమతి ఇచ్చారు.
*45 సర్టిఫికెట్లకోసం దరఖాస్తు చేసుకొనే విధానాన్నీ, వాటి జారీని సులభతరం చేశారు. ఇంటర్‌స్టేట్ మైగ్రెంట్ వర్క్‌మెన్ యాక్ట్ 1979, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యాక్ట్ 1961 కింద ఆన్‌లైన్ లైసెన్సులను ఆటో రెన్యువల్ చేసుకొనే విధానాన్ని ప్రవేశపెట్టారు.