రుణ ఊబిలో కూరుకుపోయిన టెలికాం సేవల సంస్థ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్(వీఐఎల్)ను నిలబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నిధుల కొరతతో సతమతమవుతున్న వొడాఫోన్ విషయమై టెలికాం విభాగం బ్యాంకర్లతో చర్చలు జరుపుతోంది. నిర్దేశిత మార్గదర్శకాల మేరకు వొడాఫోన్ సమస్యకు పరిష్కారం కనుగొనాలని శుక్రవారం జరిగిన చర్చల్లో టెలికాం విభాగం అధికారులు.. బ్యాంకర్లకు సూచించారు. స్టేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకుల అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇలాంటి సమావేశాలు మరిన్ని జరిగే అవకాశముంది.
ఆ బ్యాంకులదే సింహభాగం..
వొడాఫోన్ సంస్థ సహా టెలికాం రంగానికి ఇచ్చిన రుణాలపై డేటా సమర్పించాలని ప్రభుత్వరంగ బ్యాంకుల్ని ఇటీవల ఆర్థికశాఖ కోరింది. వొడాఫోన్ ఐడియా కుప్పకూలితే ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు దాదాపు రూ.1.8లక్షల కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. వొడాఫోన్‌కు ఇచ్చిన రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులదే సింహ భాగం. ఐడీఎఫ్‌సీ వంటి ప్రైవేటు బ్యాంకులు ఇప్పటికే వొడాఫోన్ ఖాతాను ఒత్తిడి ఖాతాగా పేర్కొంటూ తదనంతర చర్యలు చేపట్టాయి.