Union Budget 2022: ఆర్థిక చక్రం గాడితప్పకుండా.. ఈ పరిస్థితులు ఇలా సాగితే చాలన్న రక్షణాత్మక ధోరణిని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రదర్శించారు. దేశాన్ని డిజిటల్ బాట పట్టించేందుకు పలు ప్రతిపాదనలు చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.39.45 లక్షల కోట్ల అంచనాతో కేంద్ర బడ్జెట్‌ను ఆమె మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 35% వృద్ధితో రూ.7.5 లక్షల కోట్ల మూలధన వ్యయం చేస్తామని ప్రకటించారు. అందులో రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణం సమకూర్చనున్నట్లు భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాది ఖర్చుచేయబోయే మొత్తంలో దాదాపు 42% మొత్తాన్ని అప్పుల రూపంలోనే సమకూర్చుకోవాల్సి రావడంతో ఆచితూచి అడుగులేశారు. మోదీ హయాంలో నిరుద్యోగం పెరిగిపోయిందని విమర్శల జడివాన కురుస్తుండటంతో విత్తమంత్రి తన ప్రసంగంలో 18 సార్లు ఉపాధి, ఉద్యోగాల కల్పన గురించి ప్రస్తావించారు. ప్రధాని మోదీ పదే పదే చెబుతున్న మౌలిక వసతుల అంశాన్ని 28 సార్లు వల్లెవేశారు. ప్రభుత్వ ప్రధాన నినాదాలైన గతిశక్తి గురించి 13 సార్లు, ఆత్మనిర్భరత గురించి 5 సార్లు ప్రస్తావించి తమ ప్రాధాన్యాలేంటో చెప్పకనే చెప్పారు. రక్షణ రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ.. రూ.5.25 లక్షల కోట్లు (పింఛన్లతో కలిపి) కేటాయించారు. గత సంవత్సరం కేటాయింపు కంటే ఇది దాదాపు 10శాతం అదనం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 9.2శాతం ఉంటుందని అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అది కొంత తగ్గి 8-8.5శాతం మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. ద్రవ్యలోటు జీడీపీలో 6.9శాతం ఉంది. దాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరానికి 6.4శాతానికి, 2025-26 నాటికి 4.5శాతానికి తెస్తామని చెప్పారు. మొత్తమ్మీద ద్రవ్య స్థిరీకరణ కంటే ఆర్థికవ్యవస్థ విస్తరణకే ఈ బడ్జెట్ ప్రాధాన్యం ఇచ్చిందన్నది ఆర్థిక నిపుణుల విశ్లేషణ.
అన్ని రంగాలూ డిజిటల్ దారిలోనే.. డిజిటలీకరణకు ఆర్థికమంత్రి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. విద్య, వైద్యం, ఆర్థికం, వ్యవసాయం... ఇలా అన్ని రంగాలనూ డిజిటల్ సాంకేతికత దారిలోకి తీసుకెళ్లనున్నట్లు సంకేతమిచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వర్చువల్ డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తెస్తామన్నారు. దేశంలో క్రిప్టో మార్కెట్ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో క్రిప్టోకరెన్సీలు, ఎన్‌ఎఫ్‌టీ (నాన్ ఫంజిబుల్ టోకెన్లు) లావాదేవీలపై ఏప్రిల్ 1 నుంచి 30% పన్ను విధిస్తామన్నారు. అంకుర సంస్థలకు పన్ను విరామం 2023 మార్చి 31 వరకు కొనసాగిస్తామన్నారు. త్వరలో ఈ-పాస్‌పోర్టు విధానం అమలులోకి రానుంది. దేశంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి వీలుగా ఏకీకృత రిజిస్ట్రేషన్ పథకం అమలుచేస్తామని ప్రకటించారు. వ్యవసాయంలో ఎరువులు, పురుగుమందుల పిచికారీకి డ్రోన్ల వాడకాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇంటి వద్దే నాణ్యమైన విద్యను అందించేందుకు డిజిటల్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. విద్యార్థులకు పాఠాల కోసం 200 టీవీ ఛానళ్లను అందుబాటులోకి తెస్తామన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలోనే దేశంలో 5జీ టెలికాం సర్వీసులకు శ్రీకారం చుట్టేలా అవసరమైన స్పెక్ట్రం వేలం వేయబోతున్నట్లు వెల్లడించారు. ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహకాల వల్ల వచ్చే అయిదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు, రూ.30 లక్షల కోట్ల అదనపు ఉత్పత్తి సాధ్యమవుతుందన్న ఆశలు రేపారు. కేంద్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఇన్నాళ్లూ భావించిన పెట్టుబడుల ఉపసంహరణ ప్రస్తావన ఈ బడ్జెట్‌లో లేకపోవడం ప్రస్తావనార్హం.
ఏడు చోదక శక్తులు
ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించేందుకు ఏడు చోదకశక్తుల్ని నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. అవి..1.రహదారులు, 2.రైల్వే, 3.విమానాశ్రయాలు, 4.ఓడరేవులు, 5.ప్రజారవాణా, 6.జలమార్గాలు, 7.రవాణా మౌలిక సదుపాయాలు. వీటితో పాటు రానున్న రోజుల్లో చేపట్టబోయే ప్రాధాన్య అంశాల్ని ప్రస్తావించారు. 5జీ స్పెక్ట్రం వేలం, నదుల అనుసంధానం, మూడేళ్లలో 400 వందేభారత్ రైళ్ల తయారీ వంటివాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వివరించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయిందని.., వందేళ్ల దిశగా వెళ్లేందుకు ఈ బడ్జెట్ బాటలు వేస్తుందని చెప్పారు.
దేశ 'గతి' మార్చే 'శక్తి'
దేశ ఆర్థికవృద్ధి, సమీకృత అభివృద్ధి తీరును 'పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్‌ప్లాన్' సమూలంగా మార్చేస్తుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఏడు చోదక శక్తులూ దేశ ఆర్థికవ్యవస్థను ఏక రీతిలో ముందుకు తీసుకెళ్తాయని తెలిపారు. వీటికి విద్యుత్ సరఫరా, ఐటీ కమ్యూనికేషన్, నీటిసరఫరా - మురుగునీటి పారుదల, సామాజిక మౌలిక వసతులు మద్దతుగా ఉంటాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13,327 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించగా, 2022-23లో 25వేల కిలోమీటర్ల మేర విస్తరిస్తామన్నారు. యువతకు ఉద్యోగ, వాణిజ్య అవకాశాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు రంగం కలిసే ఉంటాయన్నారు.
కొత్త పన్నులు వేయలేదుగా...
పన్నుల్లో మినహాయింపులు ఇస్తారని చూసిన వేతన జీవులకు నిరాశే మిగిలింది. ఆదాయపు పన్ను శ్లాబులను యథాతథంగా ఉంచారు. ఇదే విషయాన్ని విత్తమంత్రి వద్ద విలేకర్లు ప్రస్తావించినప్పుడు, గత సంవత్సరం కంటే పన్నులేవీ పెంచలేదని గుర్తుచేశారు. మహమ్మారి సమయంలో ప్రజల మీద పన్నుల భారం వేసి ఆదాయం పెంచుకోవాలనుకోలేదని చెప్పుకొచ్చారు.
ఎన్నికల రంగు