తెలంగాణ

telangana

ETV Bharat / business

Union Budget 2022: 'మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లు' - నిర్మలా సీతారామన్​

Union Budget 2022: కేంద్ర బడ్జెట్​ను పార్లమెంటు ముందుకు తీసుకొచ్చారు విత్త మంత్రి నిర్మలా సీతారామన్​. వచ్చే మూడేళ్లలో 400 వందే భారత్​ రైళ్లను తీసుకురానున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా పీఎం గతిశక్తి కార్యక్రమం ద్వారా 100 కార్గో టర్మినళ్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

union-budget-2022
మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లు

By

Published : Feb 1, 2022, 11:51 AM IST

Updated : Feb 1, 2022, 4:18 PM IST

Union budget 2022: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి ప్రధాని మోదీ విజన్ మేరకు నవ భారత నిర్మాణానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో బ్లూప్రింట్‌ ప్రకటించారు. 2022 ఆగస్టు నాటికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుండగా.. 2047 నాటికి ఈ 25 ఏళ్ల కాలాన్ని ఆమె అమృత కాలంగా అభివర్ణించారు. ఈ సమయంలో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రణాళికలను ఆవిష్కరించారు. దేశంలో మౌలిక వసతులను ప్రపంచ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దడం, అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యమని స్పష్టం చేశారు. అభివృద్ధి పథంలో పయనించే క్రమంలో పెద్దఎత్తున ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో పెట్టుబడులను ఆకర్షిస్తూ, అత్యాధునిక మౌలిక వసతుల కోసం ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేయనున్నట్లు వివరించారు. ఇందుకోసం నాలుగు ప్రాధాన్యాలను ఎంచుకున్నట్లు వెల్లడించారు. ఇందులో ప్రధానమంత్రి గతిశక్తి, సంతులిత అభివృద్ధి, ఉద్పాదకతను పెంచడం, పెట్టుబడులు, సౌరశక్తి అవకాశాలు అందిపుచ్చుకోవడం, ఇంధన వరివర్తన, వాతావరణ మార్పులపై అధ్యయనం, పెట్టుబడులకు చేయూత అనే అంశాలు అభివృద్ధికి మూల స్తంభాలుగా ఉంటాయని చెప్పారు.

Nirmala sitharaman budget speech

"పీఎం గతిశక్తి అనే బృహత్తర ప్రణాళికను ఏడు ప్రగతి రథాలను ఆధారంగా చేసుకొని రూపొందించాం. పీఎం గతిశక్తిలో సంతులిత అభివృద్ధిపై దృష్టిసారిస్తాం. ఇందులో ఆర్థిక పరివర్తన, బహుళవిధమైన అనుసంధానం, లాజిస్టిక్స్‌ సామర్థ్యాన్ని పెంచడమనేవి ముఖ్యమైన అంశాలు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో తయారీ రంగంలో 60లక్షల ఉద్యోగాలు వస్తాయి. అత్యాధునిక సదుపాయాలతో 400 వందే భారత్‌ రైళ్లు, వచ్చే మూడేళ్లలో 100 గతిశక్తి కార్గో టెర్మినల్స్‌ అభివృద్ధి, జాతీయ రహదారులను మరో 25వేల కిలోమీటర్ల మేర విస్తరిస్తాం. దేశంలోని 4 ప్రాంతాల్లో మల్టీమోడల్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌లను పీపీపీ విధానంలో ఏర్పాటు చేస్తాం. రైతులు, ఎంఎస్​ఎంఈలకు ప్రయోజనకరంగా ఉండేలా రైల్వేలను తీర్చిదిద్దుతాం. రైల్వేలు, పోస్టల్‌ నెట్‌వర్క్‌ను అనుసంధానం చేసి పార్సిళ్లను మరింత వేగంగా తరలిస్తాం. ఒక స్టేషన్‌-ఒక వస్తువు అనే విధానికి ప్రాచుర్యం కల్పించి స్థానిక వ్యాపారాలకు సహాయకారిగా ఉంటాం."

--నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆర్థికమంత్రి

ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా రక్షణకు సంబంధించి దేశీయ తయారీకి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. మెట్రో రైల్‌ నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తామని వివరించారు.

"పట్టణ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలను పెంచేందుకు ఆయా ప్రాంతాలకు తగిన ఏర్పాట్లు చేస్తాం. రైల్వే స్టేషన్లతో వాటిని అనుసంధానం చేస్తాం. పర్వత ప్రాంతాల్లో మెరుగైన రవాణాతోపాటు పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు, పట్టణాలు, నగరాల్లోని ఇరుకైన ప్రాంతాల్లో ఎనిమిది రోప్‌వేలను అభివృద్ధి చేస్తాం. ఒక్కోటి 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పీఎం గతి శక్తి అమలు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కోసం ఓ కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం. ప్రైవేటీకరణలో భాగంగా ఎయిర్ ఇండియా యాజమాన్యం బదలాయింపు సజావుగా పూర్తయింది. త్వరలోనే నీలాచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెట్‌ను కూడా ప్రైవేటుపరం చేస్తాం."

--నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆర్థికమంత్రి

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:Union budget 2022: నవ భారత్​ కోసం 'బూస్టర్​ డోస్​' బడ్జెట్​!

Last Updated : Feb 1, 2022, 4:18 PM IST

ABOUT THE AUTHOR

...view details