జీవితంలో అతిపెద్ద పెట్టుబడి ఇల్లే. నెలనెలా ఈఎంఐలు చెల్లిస్తూ.. జీవితాంతం దీనికోసం కష్టపడుతుంటాం. తరచూ ప్రకృతి వైపరీత్యాలు పలకరించడం ఇటీవల కాలంలో ఎక్కువయ్యింది. గతంలో మనం చూసిన ప్రమాదకరమైన వరదల్లాంటివి మళ్లీ రావని చెప్పలేం. దీనికితోడు రాబోయేది ఎండాకాలం. అగ్నిప్రమాదాలూ పలకరిస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లో నిర్మాణానికీ, ఇంట్లోని వస్తువులకూ నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. ఇంట్లోని విలువైన వస్తువులూ దొంగతనం కావొచ్చు. ఇలా అనేక సందర్భాల్లో మనకు జరిగే ఆర్థిక నష్టం నుంచి గృహ బీమా రక్షణ కల్పిస్తుంది.
ప్రస్తుతం ఎన్నో రకాల గృహ బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఇంటికి మాత్రమే రక్షణ కల్పించేవి కొన్ని, ఇంటితోపాటు వస్తువుల నష్టానికీ పరిహారం ఇచ్చేవి మరికొన్ని. ఇందులో మన అవసరాలకు ఏది సరిపోతుందో చూసి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. గృహ బీమా పాలసీని తీసుకోబోయే ముందుగా ఆ పాలసీలోని నియమ నిబంధనలు, మినహాయింపులను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దీంతోపాటు అవసరం వచ్చినప్పుడు దాన్ని ఎలా క్లెయిం చేసుకోవాలనే విషయంపైనా అవగాహన ఉండాలి. చాలా బీమా సంస్థలు గృహ బీమా క్లెయిం కోసం కచ్చితమైన నిబంధనలు పాటిస్తున్నాయి. సాధారణంగా అవి పాటించే విధివిధానాలు ఎలా ఉంటాయంటే..
- ఇప్పుడు చాలా బీమా సంస్థలు క్లెయిం లావాదేవీని మొత్తం డిజిటల్ రూపంలోనే నిర్వహిస్తున్నాయి. కాబట్టి, మీ దగ్గర పాలసీ డాక్యుమెంట్‌కు సంబంధించిన ఒక సాఫ్ట్ కాపీ ఉండేటట్లు చూసుకోండి. ఏదైనా నష్టం జరిగిన వెంటనే బీమా సంస్థకు ఫోన్ ద్వారా లేదా ఇ-మెయిల్‌లో సంఘటనకు సంబంధించిన సమాచారం తెలియజేయాలి.
- గృహోపకరణాలకు ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు.. బీమా సంస్థ వాటిని మరమ్మతు చేయించేందుకు నగదు రహిత సేవలను అందిస్తుందా? లేదా ఆయా వస్తువులను ఇంటి నుంచి సర్వీస్ సెంటర్‌కు అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చేందుకు ఏదైనా ఏర్పాటు చేస్తుందా తెలుసుకోండి.
- పాలసీలో దేనికి పరిహారం ఇవ్వరు అనేది మీకు స్పష్టంగా తెలిసి ఉండాలి. పాలసీ క్లెయిం ఫారాన్ని పూర్తి చేసేటప్పుడు నష్టం వివరాలు తెలియజేస్తూ.. ఏయే వస్తువులకు పరిహారం ఎంత కోరుతున్నారో పేర్కొనాలి. అవసరమైన అన్ని ఆధారాలనూ దానికి జత చేయాలి. క్లెయింను డిజిటల్ రూపంలో సమర్పించాల్సి వస్తే.. అవసరమైన పత్రాలన్నీ ముందే డిజిటల్‌లోకి మార్చుకోండి.
దీంతోపాటు ఏం చేయాలంటే..
- వస్తువుకు జరిగిన నష్టానికి సంబంధించిన వివరణ, కొనుగోలు రశీదు, మరమ్మతు అంచనా, బిల్లు, డబ్బు చెల్లించిన రశీదు తప్పనిసరిగా ఉండాలి.
- దొంగతనం జరిగినప్పుడు ఆ వస్తువు కొనుగోలు రశీదు, సంఘటనకు సంబంధించి వివరణ, పోలీసులు జారీ చేసిన ఎఫ్‌ఐఆర్ కాపీని జత చేయాలి.
ఒకవేళ నష్టం రూ.లక్షకు మించి ఉన్నప్పుడు బీమా సంస్థ ఒక సర్వేయరును నియమించి, జరిగిన నష్టాన్ని అంచనా వేయిస్తుంది. సర్వేయరు ఇంటికి వచ్చినప్పుడు జరిగిన నష్టానికి సంబంధించిన పూర్తి సమాచారం అతనికి అందించాలి. అతడు/ఆమె అడిగిన వివరాలను తెలియజేయాలి. ఆ తర్వాత సర్వేయరు తన సర్వే నివేదికను బీమా సంస్థకు అందిస్తారు.