కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పర్యటక రంగంపై గతేడాది ఎనలేని ప్రభావం పడింది. రాకపోకలపై నిషేధంతో ఈ రంగం తీవ్రంగా దెబ్బతింది. దీంతో '2020' ఏడాది పర్యటక రంగానికి 'అత్యంత చెత్త సంవత్సరం'గా మిగిలిపోయిందని ఐక్యరాజ్య ప్రపంచ పర్యటక సంస్థ(యూఎన్డబ్ల్యూటీఓ) వెల్లడించింది. సంస్థ నివేదిక ప్రకారం 2020లో అంతర్జాతీయ పర్యటనలు 74 శాతం తగ్గిపోయాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020లో వంద కోట్ల ప్రయాణాలు తక్కువగా జరిగాయి.
అంతర్జాతీయ ప్రయాణాలపై పడిన ప్రభావం వల్ల 1.3 ట్రిలియన్ డాలర్ల(రూ.94.78లక్షల కోట్లు) నష్టం వాటిల్లిందని యూఎన్డబ్ల్యూటీఓ నివేదిక వెల్లడించింది. ఇది 2009 ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే 11రెట్లు అధికమని పేర్కొంది. కరోనా సంక్షోభం వల్ల 10-12 కోట్ల ప్రత్యక్ష ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయని, అందులో ఎక్కువ శాతం చిన్న-మధ్య శ్రేణి సంస్థల్లోనివేనని తెలిపింది.