తెలంగాణ

telangana

ETV Bharat / business

Nirav Modi: నీరవ్‌కు షాక్‌.. భారత్‌కు వెళ్లాల్సిందే! - నీరవ్​ మోదీపై యూకే కోర్టు తీర్పు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు నీరవ్‌ మోదీకి లండన్​ కోర్టులో చుక్కెదురైంది. ఆయన్ని భారత్​కి అప్పగించాలన్న యూకే కోర్టు తీర్పుపై అప్పీల్‌ చేసుకున్న లిఖితపూర్వక అభ్యర్థనను లండన్​ కోర్డు తిరస్కరించింది.

nirav modi
నీరవ్​ మోదీ

By

Published : Jun 23, 2021, 8:17 PM IST

భారత్‌కు రాకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి మరో షాక్‌ తగిలింది. తనను భారత్‌కు అప్పగించాలన్న యూకే కోర్టు తీర్పుపై అప్పీల్‌ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నీరవ్‌ చేసిన లిఖిత పూర్వక అభ్యర్థనను లండన్‌ కోర్టు తిరస్కరించింది.

అలా అయితే.. తప్పదు..

అయితే అప్పగింతపై అప్పీల్‌ చేసుకునేందుకు నీరవ్‌కు మరో అవకాశం ఉంది. న్యాయపరమైన మార్గదర్శకాల ప్రకారం.. ఐదు రోజుల్లోగా ఆయన మౌఖికంగా అభ్యర్థన చేసుకోవచ్చు. ఆ అభ్యర్థనను కోర్టు అంగీకరిస్తే దానిపై విచారణ చేపడుతుంది. అది కూడా తిరస్కరిస్తే నీరవ్‌ ఇక భారత్‌కు రాక తప్పదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మౌఖిక అభ్యర్థన కోసం నీరవ్‌ యోచన చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు నీరవ్‌ అప్పగింతపై భారత అధికారుల తరఫున వాదనలు వినిపిస్తున్న క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌ తాజా పరిణామాలపై స్పందించింది. ''ఒకవేళ తీర్పుపై అప్పీల్‌ చేసుకునేందుకు వారికి(నీరవ్‌) అనుమతి లభిస్తే.. దానికి అనుగుణంగా మేం చర్యలు చేపడతాం" అని పేర్కొంది.

యూకే కోర్టు తీర్పు..

పీఎన్‌బీను రూ.13,500కోట్ల మేర మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలంటూ యూకే కోర్టు తీర్పు వెలువరించింది. భారత్‌కు తిరిగి రాకుండా ఉండేందుకు నీరవ్‌ అనేక ప్రయత్నాలు చేశారు. భారత్‌లో తనకు న్యాయం జరగదని, తన మానసిక స్థితి సరిగా లేదంటూ నీరవ్‌ మోదీ బ్రిటన్‌ కోర్టుకు విన్నవించారు. అయితే, ఆయన చేసిన వాదనలను అక్కడి కోర్టు తోసిపుచ్చింది. భారత్‌కు అప్పగించడం వల్ల.. అన్యాయం జరగదని న్యాయస్థానం స్పష్టం చేసింది. మనీలాండరింగ్‌ కేసులో భారత్‌ సమర్పించిన ఆధారాలు సరిపోతాయని.. అతడిని అప్పగించాలని ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తీర్పు వెలువరించింది. యూకే హోంమంత్రిత్వశాఖ కూడా ఇందుకు అంగీకారం తెలిపింది.

తప్పుడు ఎల్‌ఓయూలతో పీఎన్‌బీని నీరవ్‌ మోదీ మోసగించిన వ్యవహారం 2018 జనవరిలో బయటపడింది. అయితే అప్పటికే అతడు దేశం విడిచి పారిపోయారు. 2018 డిసెంబర్‌లో నీరవ్‌ తమ దేశంలోనే నివసిస్తున్నాడని బ్రిటన్‌ ప్రభుత్వం భారత్‌కు తెలియజేసింది. దీంతో అతడిని అప్పగించాలని భారత్‌ విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో 2019 మార్చిలో నీరవ్‌ను అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి అక్కడి వాండ్స్‌వర్త్‌ జైల్లో నీరవ్‌ ఉంటున్నాడు. తనకు బెయిల్‌ మంజూరు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ బ్రిటన్‌ కోర్టు తిరస్కరిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ, ఈడీ సంస్థలు.. ఇప్పటికే అతడికి చెందిన పలు ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి.
ఇదీ చదవండి:రూ.5.8వేల కోట్ల 'మాల్యా' షేర్లు విక్రయం

ABOUT THE AUTHOR

...view details