Udaan investments: భారత్‌లో అతిపెద్ద బిజినెస్-టు-బిజినెస్ ఈ-కామర్స్ సంస్థ ఉడాన్ తాజాగా 250 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించింది. కన్వర్టబుల్ నోట్, డెట్ మార్గాన ఈ నిధులను తీసుకొచ్చింది. దీంతో సంస్థ విలువ 3.12 బిలియన్ డాలర్లకు చేరింది. మరో ఏడాదిన్నర వ్యవధిలో పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు ఈ సంస్థ సిద్ధమవుతోంది. అప్పటి కల్లా కంపెనీ విలువను వీలైనంత పెంచి ఐపీఓలో ప్రయోజనం పొందాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉడాన్ గత ఏడాది జనవరిలోనూ 280 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది.
వాటితో పోటీ..
Community grocery ecommerce: తాజా నిధుల సమీకరణలో కొత్త సంస్థలతో పాటు పాత పెట్టుబడిదారులు కూడా పాల్గొన్నట్లు ఉడాన్ ప్రకటించింది. ఈ నిధులతో తమ వ్యూహాత్మక అజెండాను ముందుకు తీసుకెళ్తామని సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆదిత్య పాండే తెలిపారు. ఇప్పటికే భారత్‌లో నిత్యావసర సరకుల మార్కెట్‌లో బలమైన నెట్‌వర్క్ కలిగిన అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్‌కు చెందిన జియోమార్ట్‌తో ఉడాన్ పోటీ పడుతోంది. 2025 నాటికి ఈ మార్కెట్ విలువ 850 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తోంది. దీంతో 'కమ్యూనిటీ గ్రోసరీ ఈ-కామర్స్' అనే కొత్త విధానంలో సరకుల డెలివరీపై దృష్టి సారించింది.