రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గొచ్చని అంతర్జాతీయ సంస్థ యూబీఎస్ గ్రూప్ ఏజీ భావిస్తోంది. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు పునరుత్తేజితం అవుతున్నందున, సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై పెట్టుబడులు తగ్గే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాలకు మించి నమోదవగా, ఫెడరల్ రిజర్వు త్వరలోనే తన భారీ ఉద్దీపనలను క్రమంగా వెనక్కి తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గొచ్చని, కమొడిటీ మదుపర్లు నష్టాలు పెరగకముందే బయటకు రావడం మంచిదని యూబీఎస్ గ్రూప్ ఏజీ సూచిస్తోంది. పసిడి ఔన్సు (31.10 గ్రాములు) ధర 1600 డాలర్లకు; వెండి 22 డాలర్లు అంతకంటే తక్కువగా దిగిరావొచ్చని యూబీఎస్ అంచనా వేస్తోంది.
2000 డాలర్లకు: గోల్డ్‌మన్ శాక్స్
వినియోగదారులతో పాటు కేంద్రీయ బ్యాంకులు కొనుగోలు చేసే వీలున్నందున, ఈ ఏడాది చివరకు ఔన్సు బంగారం ధర 2000 డాలర్లకు చేరొచ్చని గోల్డ్‌మన్ శాక్స్ వంటి సంస్థలు పేర్కొంటున్నాయి. కమొడిటీ మదుపర్లు, ట్రేడర్లు జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఔన్సు పసిడి 1785 డాలర్లు, వెండి 23.80 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.