అసత్య వార్తలు, పోస్టులపై సామాజిక మాధ్యమాల దిగ్గజం.. ట్విట్టర్ ఘాటుగా స్పందించింది. ప్రజలను తప్పుదోవ పట్టించే నకిలీ వార్తలను అరికట్టేందుకు కఠిన నిబంధనలు రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. భౌతిక దాడులకు ఆస్కారం కలిగించేలా ఉండే నకిలీ వార్తలపైనా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
ఏదైనా తారుమారు చేసిన వీడియోలను లైక్, షేర్ చేసే ముందు వినియోగదారులను హెచ్చరించేలా.. నకిలీ వార్తలపై మరింత సమాచారం అందించేలా న్యూస్ ఆర్టికల్స్ లింకులు పెట్టేందుకు సిద్ధమైంది. వీటి ద్వారా నకిలీ వార్తలేవో, నిజమైనవి ఏవో.. నిర్ధరించుకునేలా కార్యచరణ రూపొందిస్తున్నట్లు ట్విట్టర్ పేర్కొంది.
ప్రజల అభిప్రాయాలతో ముందుకు
ప్రతిపాదిత నిబంధనలపై ట్విట్టర్ ప్రజల అభిప్రాయాలను కోరింది. ఈ అభిప్రాయ సేకరణలను నవంబరు 27 వరకు తీసుకోనుంది. వినియోగదారుల అభిప్రాయాలను బట్టి.. దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ విధానం అమల్లోకి తీసుకొచ్చే 30 రోజుల ముందు మరో ప్రకటన చేస్తామని ట్విట్టర్ వివరించింది.
ఘాటు విమర్శలతో ఫేక్
గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై బరాక్ ఒబామా.. అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఓ వీడియో ట్విట్టర్లో హల్చల్ చేసింది. ఇటువంటి అసత్య సమాచారం ఎన్నో విపత్కర పరిస్థితులకు దారి తీసే అవకాశం ఉందని ట్విట్టర్ తెలిపింది. ఫొటో, ఆడియో, వీడియోను మార్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ట్వీట్లను అరికట్టేందుకు నిపుణులు, పరిశోధకులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి:వీడియో: బాగ్దాదీని ఎలా మట్టుబెట్టారో తెలుసా..?