అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధానికి తెరపడిందనే ఆశలపై అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నీళ్లు చల్లారు. చైనా ఉత్పత్తులపై సుంకాలు ఎత్తివేసే దిశగా ఎలాంటి ఒప్పందం కుదరలేదని ప్రకటించారు.
అమెరికాతో తొలి దశ ఒప్పందం కుదిరిందని.. తద్వారా దశలవారీగా ఒకరి వస్తువులపై ఒకరు సుంకాలు వెనక్కి తీసుకోనున్నామని చైనా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీన్ని ట్రంప్ కొట్టిపారేశారు.
"‘సుంకాల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు (చైనా) కోరుకున్నారు. అయితే పూర్తిస్థాయి సుంకాల ఎత్తివేతపై మాత్రం వారు చర్చించలేదు. ఎందుకంటే నేను చేయనని వారికి తెలుసు. నేను మాత్రం ఇంకా ఎలాంటి ఒప్పందానికి అంగీకారం తెలపలేదు" అని శ్వేతసౌధంలో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించారు.
చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటోందని.. అందుకే ఒప్పందానికి ఉబలాటపడుతోందన్నారు.