సర్వం బంద్! పరిశ్రమల్లో ఉత్పత్తి లేదు. చేసేందుకు ఉద్యోగం లేదు. డబ్బులు ఉన్నా ఖర్చు చేసేందుకు అవకాశం లేదు. అసలు బయట తిరిగేందుకే వీలే లేదు. ఏ ఒక్క ప్రాంతంలోనో, ఏ ఒక్క సందర్భంలోనో నెలకొన్న పరిస్థితి కాదిది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. చరిత్ర ఎరుగని ఇంతటి విపత్తుకు కారణం... కరోనా. ఆ ప్రమాదకర వైరస్ దెబ్బకు అగ్రదేశాల్లోనే జనజీవనం స్తంభించిపోయింది. ప్రపంచ ప్రగతి రథం నిలిచిపోయింది.
ఇలా ఎంతకాలం? కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లిపోనుందా? ప్రపంచం కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని చవిచూడనుందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిస్థితులు.
అక్కడ మొదలై...
అసలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అంతంతమాత్రం. గతేడాది చివర్లో చైనాలో మొదలైన కరోనా మహమ్మారితో ఈ కష్టాలు మరింత పెరిగాయి. ప్రపంచ వాహన రంగానికి ఆయువు పట్టయిన వుహాన్లో చాలా వరకు సంస్థలు మూతపడ్డాయి. కరోనా కేంద్రబిందువైన ఈ ప్రాంతంలోని ఎలక్ట్రానిక్ సంస్థలు ఉత్పత్తులను నిలిపివేశాయి. మొబైల్ ఫోన్ల విడిభాగాల ఉత్పత్తితో పాటు ఎగుమతి ఒక్కసారిగా క్షీణించింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వాహన, స్మార్ట్ఫోన్ల రంగాలు నేలచూపులు చూస్తున్నాయి.
కరోనా వ్యాప్తి అంతకంతకూ ఎక్కువవుతున్న కారణంగా భారత్, అమెరికా, చైనా, ఇటలీ, రష్యా సహా పలు దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశాయి. క్యాసినోలు, హోటళ్లు, పార్కులు, సినిమా హాళ్లు, పబ్బులు ఇలా ఒక్కటేమిటి అన్నింటినీ మూసేశాయి. ఫలితంగా ఆయా రంగాల్లోని లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరమైంది.
డిమాండ్ లేక ముడిచమురు ధరలూ క్షీణిస్తున్నాయి. ఫలితంగా చమురు మార్కెటింగ్ సంస్థలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. విమానం, పర్యటకం, కార్పొరేట్ రంగాలు ఊహించని నష్టాల ఊబిలో చిక్కుకున్నాయి. మరోవైపు క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ క్రీడల మెగా ఈవెంట్లతో పాటు ఈ ఏడాదిలో జరగాల్సిన టోక్యో ఒలింపింక్స్ నిర్వహణ కూడా సందిగ్ధంలో పడింది.
కొవిడ్-19 సంక్షోభంతో ప్రపంచదేశాల స్టాక్ మార్కెట్లపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, డౌజోన్స్, నాస్డాక్, షాంఘై, నిక్కీ, సియోల్, హాంగ్సింగ్, మాస్కో ఎక్స్ఛేంజీ లాంటి స్టాక్ మార్కెట్లు కనీవినీ ఎరుగని తిరోగమనం బాటపట్టాయి. ఫలితంగా ముకేశ్ అంబానీ, మార్క్ జూకర్బర్గ్, లారీపేజ్ సహా పలువురు కుబేరుల సంపద రోజుల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలు ఆవిరైంది.
భారత వృద్ధిరేటు అంచనాలు తగ్గింపు..
ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్ అండ్ పీ) 2020 ఏడాదికిగానూ భారత వృద్ధిరేటును 5.2శాతానికి తగ్గించింది. కొవిడ్-19 కారణంగా ఆసియా పసిఫిక్ దేశాలు ఆర్థిక మాంద్యంలో చిక్కుకొనే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వృద్ధి రేటు అంచనాను 5.1శాతానికి తగ్గించింది ఫిచ్.
మూడీస్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ)లు కూడా ఇటీవల భారత్ వృద్ధిరేటు అంచనాను తగ్గించి 5.1శాతంగా లెక్కగట్టాయి.