ట్రూకాలర్.. ప్రస్తుతం చాలా ఫోన్లో ఉండే యాప్. తాజాగా ఈ యాప్ యూజర్స్ కోసం సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రూప్ వాయిస్ కాలింగ్, స్మార్ట్ ఎస్ఎంఎస్ ఫిల్టర్, ఇన్‌బాక్స్ క్లీనర్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యూజర్స్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఫీచర్స్‌ను పరిచయం చేసినట్లు ట్రూకాలర్ తెలిపింది. మరి ఈ ఫీచర్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం!
గ్రూప్ వాయిస్ కాలింగ్..
ఇందులో యూజర్ ఒకేసారి 8 మందితో గ్రూప్ వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇది హై వాయిస్ క్లారిటీ కాలింగ్ అనుభూతిని యూజర్‌కి అందిస్తుంది. గ్రూప్ వాయిస్ కాలింగ్‌లో పాల్గొనే వారిలో స్పామ్ యూజర్స్‌ని గుర్తించి, తొలగించడంతో పాటు, కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తులతో కూడా కాల్స్ మాట్లాడుకునే సదుపాయం ఉంది. కాల్ మధ్యలో అవతలి వ్యక్తులు ఆఫ్‌లైన్‌లో ఉన్నా యూజర్‌కి తెలియజేస్తుంది. అంతేకాకుండా కాల్స్‌లో పాల్గొనేవారి లొకేషన్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. భద్రతపరంగా కూడా ఈ గ్రూప్ వాయిస్ కాల్స్ ఫీచర్‌కు సిమెట్రిక్ ఎన్క్రిప్షన్తో రక్షణ కల్పించినట్లు ట్రూకాలర్ తెలిపింది.
స్మార్ట్ ఎస్ఎంఎస్ ఫిల్టర్..
ఈ ఫీచర్ సాయంతో యూజర్స్ వాణిజ్యపరమైన స్పామ్ ఎస్ఎంఎస్లను సులభంగా గుర్తించొచ్చని ట్రూకాలర్ చెబుతోంది. రోజులో సగటున యూజర్ ఫోన్‌కి వచ్చే సందేశాల్లో 80 శాతం వాణిజ్యపరమైనవే ఉంటన్నాయనేది ట్రూకాలర్ వాదన. కొత్తగా తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఈ ఫీచర్, స్పామ్ కాలర్స్‌ను గుర్తించి వారి నుంచి వచ్చే సందేశాలను సులువుగా ఫిల్టర్ చెయ్యొచ్చు.