మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే. భారత సైబర్ స్పేస్‌లో ట్రోజన్ మాల్వేర్ను కనుగొన్నట్లు ఫెడరల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది. ఈ మాల్వేర్ ప్రధానంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో మొబైల్ బ్యాంకింగ్ సేవలు వాడే యూజర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఈ మాల్వేర్ దేశవ్యాప్తంగా ఉన్న 27 ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులను లక్ష్యంగా చేసుకున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో మొబైల్ బ్యాంకింగ్ సేవలు వినియోగించుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
ఎలాంటి సైబర్ దాడులు జరగొచ్చు?
'ఇన్‌కం ట్యాక్స్ రీఫండ్' పేరిట ఈ వైరస్ ఫోన్లోకి చొరబడి.. యూజర్ వ్యక్తిగత డేటాతోపాటు.. ఇతర సున్నితమైన సమచారాన్ని తెలుసుకునే వీలుందని పేర్కొంది కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ). దీని ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక మోసాలు జరగొచ్చని వివరించింది.
ఎలా జరగొచ్చు?
ఆదాయపు పన్ను శాఖను పోలిన నకిలీ లింక్ ఎస్ఎంస్ ద్వారా ఫోన్లోకి వస్తుంది. ఈ లింక్‌ను క్లిక్ చేస్తే.. ఆధార్, పాన్ వివరాలతో పాటు.. ఇతర వ్యక్తిగత సమాచారం కోరుతుంది. ఆ వివరాలన్నీ సమర్పిస్తే.. వాటిని నిర్ధరించేందుకు గుర్తింపు లేని ఏపీకే ఫైల్‌ను డౌన్లోడ్ చేయమని సూచిస్తుంది. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయాలంటే.. ఎస్ఎంఎస్లు, కాల్స్ సహా ఇతర ఫైళ్లను యాక్సెస్ చేసేందుకు అనుమతులు అడుగుతుంది. దీని ద్వారా ఈజీగా మాల్వేర్ డేటాను తస్కరించే వీలుంది. అయితే ఆ నకిలీ లింక్ నిజమైన వెబ్‌సైట్‌ను పోలి ఉండటం వల్ల ఎక్కువ మంది దానిని నమ్మి మోసపోయే అవకాశముందని సీఈఆర్టీ పేర్కొంది.
ఎలా జాగ్రత్త పడాలి?
అందుకే లింక్‌ను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించింది సెబర్ సెక్యూరిటీ ఏజెన్సీ. ఎస్ఎంస్ ద్వారా అలాంటి లింక్ వస్తే ముందు.. అది నిజమైందో కాదో అని తెలుసుకునేందుకు ఒరిజినల్ వెబ్‌సైట్‌ను చూసి నిర్ధరించుకోవాలని తెలిపింది.
ఇదీ చదవండి:ఇక ఇంటి వద్దే కొత్త సిమ్ కార్డ్.. ఆధార్ ఉంటే చాలు!