తెలంగాణ

telangana

ETV Bharat / business

Triguni EzE Eats Story: వయసు డెబ్భై.. సంపాదన రూ. కోట్లలో... - Triguni EzE Eats Story news

Triguni EzE Eats Story: 69 ఏళ్ల వయసు.. కృష్ణా.. రామా అంటూ కూర్చోవాలనుకోలేదామె! ఏదైనా ప్రయత్నించాలనుకుంది. నచ్చిన పాకశాస్త్రాన్ని ఉపయోగించి సంస్థను ప్రారంభించింది. ప్రముఖ విమానయాన సంస్థలకు సైతం ఆహారాన్ని పంపిణీ చేసే స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో వైఫల్యాలెదురైనా వెనకడుగు వేయలేదు.. చెన్నైకి చెందిన రాధా దాగా. ఆమె విజయ రహస్యమేంటో  తెలుసుకుందామా!

Triguni EzE Eats Story
వయసు డెబ్భై.. సంపాదన రూ. కోట్లల్లో

By

Published : Dec 7, 2021, 2:38 PM IST

Triguni EzE Eats Story: ఇండిగో, ఎయిర్‌ ఆసియా ఇండియా ఫ్లైట్స్‌లో ప్రయాణించేవారికి రాధా దాగా అందించే బిర్యానీ రుచి సుపరిచితమే. సింగపూర్‌, మలేసియా వంటి దేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. 'త్రిగుణి ఈజీ ఈట్స్‌' పేరిట ఈమె ఆహార ఉత్పత్తులు ఇప్పుడు దేశవ్యాప్తంగా లభ్యమవుతున్నాయి.

మహిళలకు ఉపాధి కల్పించాలనే

త్రిగుణి ఈజీ ఈట్స్‌ సంస్థలో ఉద్యోగులు

12 ఏళ్లక్రితం 69 ఏళ్ల వయసులో ప్రారంభించిన వ్యాపారాన్ని అనతి కాలంలోనే అభివృద్ధి పథంలో నడిపించిందీమె. ప్రారంభంలో 1987లో 'చిమైస్‌ ఎక్స్‌పోర్ట్స్‌' పేరుతో గార్మెంట్‌ ఎక్స్‌పోర్ట్‌ సంస్థను ప్రారంభించింది. మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన దీన్ని 22 ఏళ్లు నిర్వహించింది. 2009లో ఫుడ్‌ బిజినెస్‌ వైపు అడుగులేసింది.

"అమెరికా వెళ్లినప్పుడు ఒక మ్యాగ్‌జైన్‌లో 'రెడీ టూ ఈట్‌ పాస్తా' ప్రకటన నన్ను ఆకర్షించింది. నాకు వంట చేయడమంటే ఇష్టం. పాస్తా తరహాలో 'కప్‌ ఆఫ్‌ ఇడ్లీ' చేస్తే అన్న ఆలోచన వచ్చింది. ఫ్లైట్ కిచెన్‌లో పనిచేసే ఓ చెఫ్‌ను కలిశా. అతడి సహకారంతో చాలాసార్లు ప్రయత్నించినా సక్సెస్‌ కాలేదు. కొన్నిసార్లు ఇడ్లీ సరిగ్గా ఉడికేది కాదు, లేదా ముక్కలయ్యేది. ఎన్నిసార్లు ప్రయత్నించినా విఫలమవుతుండటంతో పక్కనపెట్టేశా. అలాగని ప్రయోగాలు ఆపలేదు. నిమ్మకాయ అన్నం, బిర్యానీ వంటివి విజయవంతమవడంతో పులిహోర, ఉప్మా మొదలైనవి ప్రయత్నించా. వీటిని ముందే సిద్ధం చేసి, ఆపై డీహైడ్రేషన్‌ చేసేదాన్ని. అలా 'త్రిగుణి ఈజీ ఈట్స్‌' ప్రారంభించా. స్థానిక దుకాణాలు, ఆన్‌లైన్‌లో అమ్మడం మొదలుపెట్టా. ఓసారి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధికి మా బిర్యానీ రుచి చాలా నచ్చింది. అప్పటికప్పుడు తినగలిగేలా, విమాన సిబ్బందికి సౌకర్యంగా ఉండేలా తయారు చేయాలన్నారు. అలాగే చేసిచ్చాం. 30వేల అడుగుల ఎత్తులో ప్రయాణించే వ్యక్తికి వేడి వేడి ఆహారాన్ని అందిస్తోంది మా సంస్థ. ప్రస్తుతం మా ఆర్డర్లలో దాదాపు 85 శాతం ఆ సంస్థవే."

-- రాధా దాగా, త్రిగుణి ఈజీ ఈట్స్‌ వ్యవస్థాపకురాలు

ఉప్మా, దాల్‌ చావల్‌, రాజ్మా చావల్‌, హైదరాబాద్‌ బిర్యానీ, పోహా, చికెన్‌ కర్రీ రైస్‌ వంటకాలకు ఎక్కువ డిమాండ్‌ అని.. రోజుకి 16 నుంచి 18వేల టబ్స్‌ను ప్యాక్‌ చేయగలిగే సామర్థ్యం మా ఫ్యాక్టరీకి ఉందని రాధా చెప్పారు. ఎయిర్‌లైన్స్‌, దేశీయ మార్కెట్‌ల నుంచి ఆర్డర్లు వస్తుంటాయంటారు.

రైళ్లలోనూ..

త్రిగుణి ఈజీ ఈట్స్‌ వ్యవస్థాపకురాలు రాధా దాగా

గతేడాది సెప్టెంబరులో లాక్‌డౌన్‌ పూర్తయ్యాక రైళ్లలోనూ తమ ఉత్పత్తులను విక్రయించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిందీమె. ఇందుకోసం పొంగల్‌ సాంబార్‌, మూంగ్‌దాల్‌ కిచిడీ, మసాలా ఉప్మా తయారీ ప్రారంభించింది. తిరువేర్కాడులోని ఈ ఫ్యాక్టరీలో నిత్యం ప్రయోగాలు జరుపుతూనే ఉండే ఈమె గతేడాది లాక్‌డౌన్‌లో సమస్యలు ఎదుర్కొంది. అత్యధిక ఆర్డర్లు తీసుకునే విమాన సంస్థలు పూర్తిగా మూతబడ్డాయి. ఆ తర్వాత తిరిగి ఈ వ్యాపారం పుంజుకుంది.

2019-20కి వీరి టర్నోవరు రూ.16 కోట్లు. కొవిడ్‌ నేపథ్యం కొంత నష్టాన్ని తెచ్చిపెట్టగా, తిరిగి ఈ ఏడాదిలో ఇప్పటివరకు అయిదుకోట్ల వ్యాపారం జరిగింది. ప్రస్తుతం వారానికి లక్ష టబ్స్‌ ఆర్డర్లను అందిస్తోన్న ఈమె ఈ వయసులోనూ మరిన్ని రకాల వంటకాలను అందించే దిశగా కృషి చేస్తోంది. యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఇదీ చూడండి:Dog Baby Shower: శునకానికి సీమంతం.. ఇరుగుపొరుగు దీవెనలు!

ABOUT THE AUTHOR

...view details